ఇక రెణ్నెల్లే!

ABN , First Publish Date - 2020-09-26T10:24:56+05:30 IST

తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై ఈసారి సందిగ్ధత నెలకొంది. పుష్కరాల్లో భక్తులు నదీ పరివాహక ప్రాంతానికి చేరుకుని స్నానాలు చేస్తారు.

ఇక రెణ్నెల్లే!

తుంగభద్ర పుష్కరాలపై శీతకన్ను

కలెక్టరేట్‌ దాటని ప్రతిపాదనలు

సకాలంలో పనులపై అనుమానం

బడ్జెట్లో ఇంకా కేటాయించని నిధులు 

గత పుష్కరాలకు ఏడాది ముందే ఏర్పాట్లు 



కర్నూలు, ఆంధ్రజ్యోతి: తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై ఈసారి సందిగ్ధత నెలకొంది. పుష్కరాల్లో భక్తులు నదీ పరివాహక ప్రాంతానికి చేరుకుని స్నానాలు చేస్తారు. పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేస్తారు. దీని కోసం ప్రభుత్వం నదీ తీరంలో స్నాన ఘట్టాలను ఏర్పాటు చేయాలి. ప్రజారవాణా తదితర సౌకర్యాలు కల్పించాలి. కానీ కరోనా కారణమో.. మరే కారణమోగానీ తుంగభద్ర పుష్కరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.


నిధుల కేటాయింపు, ఘాట్ల మరమ్మతులు, రోడ్ల నిర్మాణాలు తదితరాలపై ఇప్పటికీ పట్టించుకోలేదు. 2008లో జరిగిన ఈ పుష్కరాలకు అప్పటి సీఎంగా వైఎ్‌సఆర్‌ ఏడాది ముందు నుంచే చర్యలు తీసుకున్నారు.


ప్రస్తుతం మరో రెండు నెలల్లో జరగాల్సిన పుష్కరాలపై ప్రభుత్వం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోంది. 2020-21 బడ్జెట్‌లో తుంగభద్ర పుష్కరాలకు నిధుల కేటాయింపు ఊసే లేదు. నవంబరు 20 నుంచి 12 రోజులు జరిగే ఈ పుష్కరాలకు ప్రాథమిక నిర్ణయాలు కూడా తీసుకోలేదని హిందూ ధార్మిక సంస్థలు విమర్శిస్తున్నాయి. 


తుంగభద్ర ప్రవాహం ఇలా..

కర్ణాటక ఎగువ భాగం నుంచి ప్రవహించే తుంగ, భద్ర నదుల సంగమమే తుంగభద్ర నది. ఏపీలోని కౌతాళం మండలం, మేళగనూరు వద్ద కర్నూలు జిల్లాలో ఈ నది ప్రవేశిస్తోంది. కౌతాళం, నందవరం, సి.బెళగల్‌, కోసిగి, మంత్రాలయం, గూడూరు మండలాలతో పాటు కర్నూలు పట్టణం గుండా ప్రవహించే ఈ నదికి 107 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది.


సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో తుంగభద్ర కలిసిపోతుంది. ఈ సంవత్సరంలో వర్షాలు పుష్కలంగా పడటంతో తుంగభద్ర జలాశయం నిండుగా ప్రవహిస్తోంది. శ్రీశైలం జలాశయానికి నెల నుంచి వరద నీటిని కూడా విడుదల చేస్తున్నారు.  తుంగభద్ర నదికి పర్యవేక్షణ కరువై స్నాన ఘట్టాలు దెబ్బతినిపోయాయి. వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయి గుంతలు పడ్డాయి.


పుష్కరాలకు ఇంకో  రెండు నెలల వ్యవధి కూడా లేదు. ప్రభుత్వం నిధుల కేటాయించే ప్రక్రియను ప్రారంభించలేదు. కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో పుష్కరాలకు ప్రభుత్వం ఏ మేరకు సిద్ధమయ్యేదీ సందేహమని సమాచారం.]


ఇవే ప్రతిపాదనలు 

తుంగభద్ర పుష్కర ఘాట్ల పునరుద్ధరణపై ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్‌, వై.బాలనాగిరెడ్డి, జే.సుధాకర్‌, వై.చెన్నకేశవరెడ్డి, టి. ఆర్థర్‌ తమ నియోజకవర్గాల్లో దృష్ట్యా ప్రతిపాదనలు పంపారు. కర్నూలు నియోజకవర్గంలోని 9 ఘాట్లకు రూ.14.45కోట్లు, కోడుమూరులో 5 ఘాట్ల పునరుద్ధరణకు రూ. 8.5 కోట్లు, మంత్రాలయం పరిధిలోని 6 ఘాట్ల కోసం రూ.12.16 కోట్లు, ఎమ్మిగనూరులో 2 ఘాట్లకు రూ.2.72 కోట్లు, నందికొట్కూరులో 6కు రూ.6.93 కోట్లు ఇవిగాక మరో రూ. 15 కోట్లతో అదనంగా ఇంకో 5 ఘాట్ల పునరుద్ధరణకు వెరసి రూ.50 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కాగా ఇవన్నీ కలెక్టరేట్‌ దాటి రాష్ట్ర ప్రభుత్వానికి అందడానికి ఇంకెంత సమయం పడుతుందో కూడా తెలియడంలేదు. 


2008 నాటి పుష్కరాలు ఇలా..

2008 నాటి పుష్కరాలకు అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏడాది ముందే స్పందించారు. దేవాలయాల పునరుద్ధరణ, భారీగా రోడ్ల నిర్మాణాలు, రవాణా వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇందుకు రూ.248 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం రూ.50 కోట్ల ప్రతిపాదనలతో సిద్ధం చేసినా ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. 


పుష్కర ఘాట్ల దుస్థితి 

 మామిదాలపాడు గ్రామం నుంచి నగరంలోని జమ్మిచెట్టు వరకు సుమారు 10 కిలోమీటర్ల రోడ్డులో ఒక కిలోమీటరు మాత్రమే నిర్మించారు.  ప్రస్తుతం ఉన్న ఘాట్లలో సంకల్‌బాగ్‌, నాగసాయిబాబ గుడి వద్ద మాత్రమే రోడ్డు   ఉంది. మిగతా ఘాట్ల వద్ద రోడ్డు  లేదు.

 

పంచలింగాల గంగమ్మ గుడి వద్ద గతంలో పుష్కర ఘాట్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. ఘాట్‌ పక్కనే ముళ్లకంపలు ఏపుగా పెరిగి పోయాయి. 




 మాసామసీదు- పంప్‌హౌస్‌ వద్ద గతంలో పుష్కరఘాట్లను నిర్మించారు. అయితే మామిదాలపాడు నుంచి నగరంలోని జమ్మిచెట్టు వరకు రోడ్డు వేయాలి. 


 సంకల్‌బాగ్‌ వద్ద గతంలో ఏర్పాటు చేసిన ఘాట్లను మట్టితో మూసివేసారు. ఇక్కడ కూడా రోడ్డు వేయాలనే ఉద్దేశంతో గతంలోనే ఘాట్లు కనబడకుండా మట్టితో కప్పేసారు.  ఇప్పుడైనా రోడ్డు వేయాలి. 


 నాగసాయి బాబా గుడి వద్ద కూడా ఇట్లాగే పుష్కర ఘాట్లను మట్టితో మూసివేసారు. దీన్ని పునరుద్ధరించాల్సి ఉంది. 


 దక్షిణ షిరిడీ ఆలయం వద్ద గతంలో నిర్మాణంచేపట్టిన ఘాట్లను మూసివేసారు. దీన్ని బాగుచేయాల్సి ఉంది.

 

 నగరేశ్వరస్వామి ఆలయం వద్ద ఘాట్ల నిర్మాణం చేపట్టలేదు. పూర్తిగావ్యర్థాలతో నిండుకుని ఉంది.  ఫ నవాబ్‌ బంగ్లా వద్ద పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. 

 

 రాఘవేంద్ర స్వామి మఠం వద్ద గతంలో ఘాట్లు నిర్మాణం చేపట్టలేదు. ఇప్పుడైనా నిర్మించాల్సి ఉంది.  


 రాంభొట్ల దేవాలయం వద్ద ఇప్పటి వరకు ఘాట్ల నిర్మాణం జరగలేదు. ఇది  భక్తులకు చాలా అనువైన ప్రాంతం.  


మంత్రాలయంలో ఇలా..

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం వద్ద తుంగభద్ర పుష్కారాలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఘాట్లు, అప్రోచ్‌ రోడ్లు, మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. తుంగభద్ర ఉధృతంగా ప్రవహిస్తున్నందున పనులు పూర్తవుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


మంత్రాలయం వద్ద నాలుగు చోట్ల ఘాట్లను ఏర్పాటు చేయాలని అధికారులు పరిశీలించారు. పనులు ముందుకు సాగలేదు. వినాయక ఘాట్‌ వద్ద కొత్తగా స్నానాల ఘాట్‌ను ఏర్పాటు చేయాలి. అప్రోచ్‌ రోడ్డు కూడా సరిగా లేదు. ఈ ఘాట్‌కు వెళ్లేందుకు రోడ్డుతో పాటు పంచముఖి దర్శన్‌ నిలయం ఎదురుగా మరో ఘాట్‌ను నిర్మించాలి. ఎన్‌ఏపీ తాగునీటి పథకం వద్ద వీఐపీ స్నానాల ఘాట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ అప్రోచ్‌ రోడ్డు సరిగ్గా లేదు. రాంపురం రామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద కూడా ఘాట్‌ను నిర్మించాలి.   


నందవరంలో ఇలా..

నందవరం మండలం గురుజాల గ్రామ సమీపంలోని ఆలయం వద్ద గత పుష్కరాల్లో సీసీ రోడ్డు, ఘాట్‌ ఏర్పాటు చేశారు.  భక్తులు పూజలు చేసేందుకు, పిండ ప్రదానాలకు సౌకర్యాలు కల్పించారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు షెడ్లు ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లు నిర్మించారు. అవన్నీ ప్రస్తుతం అధ్వానంగా మారాయి. ఇప్పుడు తిరిగి నిర్మించాల్సిందే. నాగలదిన్నె వద్ద గత పుష్కరాల సమయంలో ఒక ఘాట్‌ను నిర్మించారు. ఇప్పుడు దాని ఆనవాలు కూడా లేదు. వరదలకు నాగలదిన్నె బ్రిడ్జి నిర్మాణ సమయంలో అన్నీ కొట్టుకుని పోయాయి. ఘాట్‌ కూడా నీటిలో మునిగి పోయింది. ఇప్పుడు తిరిగి నిర్మించాల్సి ఉంది. 


కేసీ పుష్కర ఘాట్ల వద్ద..

నందికొట్కూరు నియోజకవర్గంలో కేసీ కాలవపై ఏర్పాటు చేసిన పుష్కరఘాట్ల వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. కేసీ కేసీ కాలువలో రెండు వేల నుంచి మూడు వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది. కాలువపై ఏర్పాటు చేసిన మెట్లు ఏటవాలుగా ఉన్నాయి. నాగటూరు నాగటూరు నుంచి కేసీ కాలువ ఘాట్‌ వరకు రోడ్డు గుంతలు పడ్డాయి. కొత్తపల్లి నుంచి సంగమేశ్వరం ఘాట్‌కు వెళ్లే రోడ్డు చాలా చోట్ల దెబ్బతింది. ప్రాతకోట, పగిడ్యాల, కంబాలపల్లి పుష్కరఘాట్లకు రోడ్లు బాగానే ఉన్నా ఘాట్ల వద్ద తగిన సౌకర్యాలు కల్పించాలి. 


గతంలో భాగానే ఏర్పాట్లు చేశారు 

గత పుష్కరాల సమయంలో ఏర్పాట్లు భాగానే చేశారు. మరి ఈ సారి ఎలా చేస్తారో తెలియదు. ఇప్పటివరకైతే ఇంకా మొదలు పెట్టలేదు. 

- మునిస్వామి, గురజాల, నందవరం మండలం 


గతంలో కన్నా బాగా ఏర్పాట్లు చేయాలి 

గత పుష్కరాలకన్న ఈ సారి అఽధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. గురుజాల రామలింగేశ్వరస్వామి ఆలయం దగ్గర నదిలో పుణ్యస్నానాలు అచరించేందుకు ఎక్కువ ఇష్టపడతారు. గతానికన్నా బాగా పనులు చేయాలి. 

                                                                                    - శేషయ్య, గురుజాల, నందవరం మండలం 


రోడ్డు నిర్మించాలి 

గత పుష్కరాల సమయంలో దాదాపు రూ. 10కోట్లతో ఏర్పాట్లు చేశారు. మరి ఈ సారి ఏమేరకు ఏర్పాటుచేస్తారో చూడాలి. ప్రధానంగా గ్రామం సమీపంలోనుంచి ప్రధాన రహదారి నుంచి ప్రత్యేంగ రోడ్డు నిర్మించాలి. ప్రస్తుతం ఘాట్‌ నీటిలో మునిగింది. 

                                                                                                                                                                                                                                                                                                ఈరన్న, మాజీ సర్పంచ్‌, నాగలదిన్నె, నందవరం మండలం



Updated Date - 2020-09-26T10:24:56+05:30 IST