మఠం భూమి స్వాహా

ABN , First Publish Date - 2020-10-29T09:04:15+05:30 IST

ధార్మిక కార్యక్రమాలకు ఓ దాత ఇచ్చిన భూమి అన్యాక్రాంతమైంది. ఆ భూమిని ఎవరికీ అమ్మకూడదని డాక్యుమెంట్లలో ఉన్నా..

మఠం భూమి స్వాహా

1928 రుద్రబావాజీ మఠానికి ఇచ్చిన దాత

2018లో ముగ్గురి పేరిట అక్రమ రిజిస్ట్రేషన్‌

విశ్రాంత ఆర్‌ఐ భార్య, మరో ఇద్దరి పేరిట..

తహసీల్దారు కార్యాలయం ఎదుట భక్తుల ధర్నా



ఆదోని రూరల్‌, అక్టోబరు 28: ధార్మిక కార్యక్రమాలకు ఓ దాత ఇచ్చిన భూమి అన్యాక్రాంతమైంది. ఆ భూమిని ఎవరికీ అమ్మకూడదని డాక్యుమెంట్లలో ఉన్నా.. అన్యాక్రాంతమైంది. రెవెన్యూ రికార్డుల్లో మఠం పేరు ఉండాల్సిన చోట ముగ్గురు వ్యక్తుల పేర్లు ఉన్నాయి. సమాచార హక్కుచట్టం కింద ఈ వ్యవహారాన్ని కొందరు బట్టబయలు చేశారు. దీంతో మఠం నిర్వాహకులు రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. 


రుద్రబావాజీ మఠం భూమి..

ఆదోని పట్టణ శివారులోని ఎమ్మిగనూరు ప్రధాన రహదారి పక్కన ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఇక్కడికి సమీపంలో 200 సంవత్సరాల క్రితం రుద్రనాథ సరస్వతి స్వామిజీ జీవసమాధి అయ్యారు. 1928లో నర్సింహయ్య అనే వ్యక్తి రుద్రనాథ సరస్వతి మఠం పూజా కైంకర్యాలు, ధార్మిక కార్యక్రమాల కోసం ఏడుగురు ధర్మకర్తలకు రుద్రబావాజీ మఠం పేరిట 5.44 ఎకరాల భూమిని రిజిస్టర్‌ చేయించి ఇచ్చారు. సర్వే నెంబర్లు 151, 152 ఏ, 152సీలో ఈ భూమి ఉంది. ఈ భూమిని ఎవరూ కొనకూడదు, అమ్మకూడదదని దాత షరతు విధించారు. కౌలుకు ఇచ్చి.. వచ్చిన సొమ్మును పూజలు, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కూడా చేశారు. 


కన్నేసి.. కాజేశారు..

2016లో కొందరు సమాచార హక్కు చట్టం కింద ఈ భూమి వివరాలను సేకరించారు. 5.44 ఎకరాల భూమి రుద్రబావాజీ మఠం పేరిట ఉందని రెవెన్యూ అధికారులు తేల్చారు. వాటి డాక్యుమెంట్ల నఖలు కూడా అందజేశారు. 2018లో రెవెన్యూ అడంగల్‌ను పరిశీలిస్తే, రిటైర్డ్‌ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ భార్య శారద పేరిట 50 సెంట్లు, రాఘవేంద్ర పేరిట 45 సెంట్లు, హనుమంతప్ప పేరిట 1.73 ఎకరాలు ఉన్నట్లు తేలింది. మిగిలిన భూమి కూడా మఠం పేరుపై లేదని చూపిస్తోంది. ఆరు నెలలుగా మఠం సభ్యులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో మఠం సభ్యులు బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అన్యాక్రాంతమవుతున్న దేవాలయ భూములను రక్షించాలని, మఠం భూములను పక్కదారి పట్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మఠం భూములు రెవెన్యూ అధికారి భార్య పేరిట ఎలా మారాయని ప్రశ్నించారు. మఠం భూమి అని తెలిసి రెవెన్యూ అధికారి ఎలా కొంటారని, ఆయనకు ఎవరు అమ్మారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. 


ఆ భూమి మఠానికే ఇవ్వాలి.. రామాంజనేయులు, విరాఠ్‌ హిందుస్థాన్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

రుద్రబావాజీ మఠం పేరిటన ఉన్న 5.44 ఎకరాల భూమిలో కొంత భాగం అన్యాక్రాంతమైంది. దీనికి బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి. మఠం భూమిని మఠానికే చెందేలా చర్యలు తీసుకోవాలి. భూములు కాజేసేందుకు కుట్ర చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఆరు నెలలుగా న్యాయం చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. 



పోరాటం ఆపం..శ్రీనివాసులు, మఠం అధ్యక్షుడు

1928లో మఠం పేరిట 5.44 ఎకరాల భూమి రిజిస్టర్‌ అయింది. ప్రస్తుతం ఆ భూమి ఇతరుల పేరిట చూపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రెవెన్యూ రికార్డులలో  మార్పులు చేయాలి. న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తునే ఉంటాం. 


 

సబ్‌ రిజిస్ట్రార్‌కు లేఖ రాస్తాం..శ్రీనివాసులు, మఠం అధ్యక్షుడు

1928లో వైద్యం నర్సింహయ్య అనే వ్యక్తి ఆ మఠం ధర్మకర్తలకు 5.44 ఎకరాల భూమిని రిజిస్టర్‌ చేయించారు. కానీ ఇందులో శారదమ్మ పేరిట 50 సెంట్లు, రాఘవేంద్ర పేరిట 45 సెంట్లు, హనుమంతప్ప పేరిట 1.73 ఎకరాలు రికార్డుల్లో చూపిస్తోంది. ఈ ముగ్గురికి నోటీసు ఇచ్చాం. వారు స్పందించలేదు. మఠం భూమి అన్యాక్రాంతం కాకుండా లిస్ట్‌ ఆఫ్‌ ఎండోమెంట్‌ ల్యాండ్‌లో ఉంచుతాం. ఎవరికీ రిజిస్ట్రేషన్‌ చేయకూడదని సబ్‌ రిజిస్ట్రార్‌కు లేఖ రాస్తాం. 

Updated Date - 2020-10-29T09:04:15+05:30 IST