ఆ ఇద్దరే చేశారు..!

ABN , First Publish Date - 2020-10-29T08:58:46+05:30 IST

జిల్లా పరిషత్‌ పరిధిలో పదోన్నతులు, పోస్టింగ్‌లు జరిగిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆ ఇద్దరే చేశారు..!

జడ్పీ పదోన్నతి నియామకాల్లో ఆరోపణలు

దగ్గరలో ఖాళీ ఉన్నా.. దూరంగా పోస్టింగ్‌

అయినవారికి అనుకూలంగా వ్యవహారం

ఇద్దరు అధికారులపై బాధితుల ఆగ్రహం


కర్నూలు(న్యూసిటీ), అక్టోబరు 28: జిల్లా పరిషత్‌ పరిధిలో పదోన్నతులు, పోస్టింగ్‌లు జరిగిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. అటెండర్లు, స్వీపర్లు, వాచ్‌మెన్‌ మొత్తం 54 మందికి రికార్డు అసిస్టెంట్‌, లైబ్రరీ అసిస్టెంట్‌, ల్యాబ్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. వీరికి సీనియారిటీ ప్రకారం ఎంపీడీవో కార్యాలయాలు, పాఠశాలల్లో పోస్టింగ్‌ ఇవ్వాలి. కానీ అధికారులు సీనియారిటీని పక్కనపెట్టి తమకు అనుకూలంగా ఉన్న వారికి దగ్గరలో పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా పరిషత్‌లో పని చేస్తున్న ఓ సెక్షన్‌ అధికారి, ఓ ముఖ్య ప్రజాప్రతినిధి పేషీలో పని చేస్తున్న ఓ అధికారి కలిసి ఈ తతంగం నడిపించారని కొందరు ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. ముఖ్య ప్రజాప్రతినిధి పేషీకి వెళితే జిల్లా పరిషత్‌ పరిధిలో డిప్యుటేషన్లు, పోస్టింగులు జరిగిపోతాయన్న ప్రచారం సాగుతోంది. దీంతో అర్హత ఉన్న వారికి పోస్టింగ్‌లు ఇవ్వలేకపోతున్నామని జడ్పీ అధికారులు వాపోతున్నారు. జిల్లా పరిషత్‌కు కలెక్టర్‌ ప్రత్యేక అధికారిగా ఉన్నా ఇలాంటి ఆరోపణలు వస్తుండటం విమర్శలకు తావిస్తోంది. 


బాధితుల్లో కొందరు..

ఫ వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్వీపర్‌గా పని చేస్తున్న దివ్యాంగురాలు ఎల్‌.రంగమ్మకు పదోన్నతి కల్పించి తుగ్గలి మండలం ఆర్‌ఎస్‌ పెండేకల్‌ జడ్పీ పాఠశాలకు లైబ్రరీ అసిస్టెంట్‌గా నియమించారు. వెల్దుర్తి జడ్పీ పాఠశాలలో ఖాళీ ఉన్నా రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల ప్రోత్సాహంతో సొంతూరు వెల్దుర్తి మండలం శ్రీరంగాపురానికి దూరంగా పని చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఆమె అంధురాలు అయినా ఇలా వ్యవహరించారు.


ఫ ఉలిందకొండ జిల్లా పరిషత్‌ పాఠశాలలో పని చేస్తున్న ఎస్‌.జయలలిత జడ్పీ పాఠశాల(బాలికలు)ప్యాపిలిలో ఖాళీగా ఉందని కౌన్సెలింగ్‌లో దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆమెకు కోసిగి జడ్పీ పాఠశాలలో పోస్టింగ్‌ ఇచ్చారు. ఇందులో కూడా ఆ ఇద్దరు అధికారుల హస్తం ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. 


ఫ జగదీష్‌ అనే అటెండర్‌కు ప్యాపిలి జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో పోస్టింగ్‌ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 45 సంవత్సరాలు దాటిన పురుషులకు మాత్రమే బాలికల పాఠశాలలో పోస్టింగ్‌ ఇవ్వాలి. అయితే నిబంధనలను తుంగలో తొక్కి జడ్పీలోని ఓ సెక్షన్‌ అధికారికి జగదీష్‌కు పోస్టింగ్‌ ఇవ్వడం దుమారం రేపుతోంది. 

 

ఫ పదోన్నతి పొందిన వారిలో సుమారు 20 మంది ఉద్యోగులు తమకు పోస్టింగుల విషయంలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత ప్రాంతానికి దగ్గరలో ఖాళీలు ఉన్నా, దూరంగా వేశారని అంటున్నారు. పోస్టింగ్‌ ఆర్డర్లు తీసుకున్న కొందరు ఉద్యోగులు విధుల్లో చేరాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. 


న్యాయం చేయండి...

నేను అంధురాలిని. నాకు న్యాయం చేయాలని అడిగినా అధికారులు పట్టించుకోవడం లేదు. నా సొంత గ్రామం వెల్దుర్తి మండలం శ్రీ రంగాపురం.  వెల్దుర్తిలో ఖాళీగా ఉందని, అక్కడ పోస్టింగ్‌ ఇవ్వాలని అడిగినా అధికారులు వినలేదు. 55 కి.మీ. దూరంలో పోస్టింగ్‌ ఇచ్చారు. విధులకు వెళ్లాలంటే మరొకరి సాయంత తీసుకోవాలి. ఉన్నతాధికారులు స్పదించిన నాయకు న్యాయం చేయాలి.

- ఎల్‌.రంగమ్మ, ల్యాబ్‌ అసిస్టెంట్‌


న్యాయంగానే పోస్టింగులు

పదోన్నతి పొందిన అందరికీ న్యాయంగా పోస్టింగ్‌లు ఇచ్చారు. కొందరికి దూరంగా పోస్టింగ్‌లు ఇచ్చిన మాట వాస్తవమే. కానీ దీని వెనుక ఎవరి ఒత్తిళ్లూ లేవు. 

- ఎం.వెంకట సుబ్బయ్య, జడ్పీ సీఈవో

Updated Date - 2020-10-29T08:58:46+05:30 IST