నిజానిజాలు తెలుసుకోండి!

ABN , First Publish Date - 2020-04-09T05:56:55+05:30 IST

కరోనాని పారదోలడానికి, కోట్లాది పేద ప్రజల కడుపు నింపడానికి మనందరం అనేక విధాలుగా పని చేస్తున్నాం. యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా, రచయితగా నేను తెలంగాణ, ఇతర రాష్ట్రాలలో సామాజిక కార్యకర్తగా...

నిజానిజాలు తెలుసుకోండి!

అంబేడ్కర్ మీద  దళితుల చేతనే నిందలు వేయించారట, నేనెంత? దళితుల మీద దళితుల చేతనే కేసులు పెట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో అనేక నిందలు వేస్తూ రాయిస్తున్నారు. కుటుంబాలు, జీవితాలు పణంగా పెట్టి ఊరు కాని ఊళ్లో ఉద్యోగాలు చేస్తూ ప్రజల కోసం పని చేస్తున్న మామీద ఇన్ని కంప్లైంట్‌లు చేసేవాళ్ళు రోజూ జరిగే దోపిడీలు, అత్యాచారాలు, అన్యాయాలపై ఎందుకు స్పందించరు?


ప్రియమైన ప్రజలకి,

కరోనాని పారదోలడానికి, కోట్లాది పేద ప్రజల కడుపు నింపడానికి మనందరం అనేక విధాలుగా పని చేస్తున్నాం. యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా, రచయితగా నేను తెలంగాణ, ఇతర రాష్ట్రాలలో సామాజిక కార్యకర్తగా పని చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసినదే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నేను ఫేస్‌బుక్‌లో పెట్టిన రెండు మూడు లైన్ల మాటల మీద అనేక చట్టాల కింద కేసులు నమోదు చేశారు అని తెలిసింది. కరోనా సమయంలో కమ్యూనల్‌గా ఆలోచించొద్దు అన్నది ఆ మెసెజ్‌ సారాంశం. నేను హిందువుల మనోభావాల్ని దెబ్బ తీస్తున్నట్టు మా హిందూ సోదరులే, మనువాద కుట్రలని ఉపయోగిస్తూ దళితుల ద్వారా నా మీద కేసులు పెట్టిస్తున్నారు. కేసులు కొత్తేమీ కాదు, కాకపొతే ఈ సందర్భం చాలా ముఖ్యం. వీటి వెనుక ఉన్న కుట్రలని మీ దృష్టికి తీసుకు రావడానికి కొన్ని అంశాలు మీతో పంచుకుంటున్నాను.


మనలో చాలా మందికి నిజానిజాలు తెలుసుకునే ఓపిక ఉండదు. నేను 2009 నుండి కరీంనగర్‌లో పని చేస్తున్నాను. నాటి నుంచి పర్యావరణం, తెలంగాణ ఉద్యమంలో అన్ని కులాలు, మతాల ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి పని చేసాను. కరీంనగర్ చుట్టూ వివిధ ప్రాజెక్ట్‌లు, పరిశ్రమల కింద ఆ గ్రామీణుల స్థానిక నమ్మకాలు, దేవుళ్ళు మరుగున పడకుండా ఉండాలని ఎన్నో అర్జీలు ప్రభుత్వాలకి, కోర్టులకి ఇచ్చాము. దానితో కొన్ని మనువాద, ఫాసిస్ట్, ఉన్నత, అగ్ర, దోపిడీ కుల శక్తులు నా మీద దాడి చేస్తున్నాయి.


స్త్రీలకి గొప్ప స్థానం కల్పించిన ప్రాంతం మనది. తెలంగాణ ఉద్యమంలో శక్తికి మించి అనేక కార్యక్రమాలు చేసిన నన్ను కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు ప్రభుత్వ సంస్థల్ని అడ్డుపెట్టుకుని లేనిపోని అభాండాలు వేస్తూ నా భావ ప్రకటనా స్వేచ్ఛని హరిస్తున్నారు. నా నమ్మకాలు ఎట్లా ఉన్నా నేను హిందూ మతంలో పుట్టినదానినే. ప్రజలు మూఢ నమ్మ కాల బారిన పడకుండా ఎడ్యుకేట్ చేయడం ధర్మంగా భావిస్తాను.


దళిత, బహుజన, మైనారిటీ స్త్రీలకి కుటుంబం తప్ప బయట ప్రపంచం గురించి ఆలోచించడం ఒక ఉద్యమం, మాలాంటి వాళ్లకి కూడా. బయటకి వచ్చి ఎవరికీ లొంగకుండా, ఏ పార్టీకి అమ్ముడు పోకుండా నమ్మిన సిద్ధాంతాల కోసం పని చేయడం ఇంకొక ఉద్యమం. ఆధిపత్య కులాల వాళ్ళు దళితుల, స్త్రీల ఎదుగుదలని సహించలేరు. మేము అన్యాయానికి వ్యతిరేకంగా ఏం చేసినా ఎదో ఒక వంకతో మామీద నిందలు మోపుతుంటారు. మాకు విప్లవ సంఘాలలో సభ్యత్వం లేదు, అనుబంధాలు లేవు, కలిసి వచ్చే అన్ని సంఘాలతో పని చేయడం తెలంగాణ ఉద్యమం నుండి నేర్చుకున్నాం. మా కార్యాచరణ మీద దెబ్బకొట్టాలని ఇపుడు మనువాద శక్తులు పని చేస్తున్నాయి. ఎందుకంటే, మా నిజాయితీముందు వాళ్ల ఆటలు ఏమి సాగవు కాబట్టి.


మహానుభావుడు అంబేడ్కర్ మీద కూడా దళితుల చేతనే నిందలు వేయించారట, నేనెంత? దళితుల మీద దళితుల చేతనే కేసులు పెట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో అనేక నిందలు వేస్తూ రాయిస్తున్నారు, అర్బన్ నక్సలైట్‌ అని. వీళ్ళలో అసలు అర్బన్‌కి, నక్స లైట్‌కి అర్థం కూడా తెలవనివాళ్ళు ఉండడం ఆశ్చర్యం కాదు. మొన్నటి ఎన్నికలలో బీఎస్పీ నుండి పోటీ చేసిన నన్ను కులం పేరుతో జోడించడం పెద్ద కుట్ర అని తెలియజేస్తున్నాను. నువ్వు జీవో, ఎన్జీవో కాకపొతే మావోవే అనడానికి ఇది ఒక క్లాసిక్ ఉదాహరణ. విద్యార్థులు మనుస్మృతిని దహనం చేస్తే, నేను అక్కడ లేకున్నా భారతమాత చిత్రాన్ని నేను తగలబెట్టించానని ప్రచారం చేశారు. దళిత్ మోర్చా, దళిత మహిళా మోర్చా వాళ్ళతో నాకు వ్యతిరేకంగా మాట్లాడించారు. నేను అకడమిక్ స్టడీస్‌లో భాగంగా పిల్లలని బయటకి తీసుకెళితే ‘సూడో’ పేర్లతో నా మీద గాలి వార్తలు రాయించారు. పోలీసులు అన్ని విధాలుగా విచారణ చేసి ఏమీ లేదని నిర్ధారించారు.


సోషల్ మీడియా మాలాంటి వారికి ఒక ఉద్యమ వారధి. నాలెడ్జి సంపాదించడం కోసం, మాకున్న పనిని షేర్ చేసుకోవడం దాన్ని వాడుతాం. ఇదే క్రమంలో ఒక యూట్యూబ్ లింక్‌తో, ఆంధ్ర ప్రాంతంలో ఒక జాతర గురించి ప్రస్తావించాను. కరోనా విషయంలో గుంపులు గుంపు లుగా దేవుడి దగ్గరకైనా పోవద్దని రాశాను. దీనిపై మా మాదిగ సోదరుడితో ‘హిందూ’ మనోభావాలు దెబ్బతిన్నాయని కేస్ పెట్టించారు. నాకు తెలిసి అతనికి ఫేస్‌బుక్ అక్కౌంట్ కూడా ఉండదు. చదవడం కూడా వస్తుందో రాదో తెలియదు. మా దళితులని ఈ విధంగా పావుల్లాగా వాడుకుంటారు. పోయినసారి చదవడం కూడా రాని ఒక బేడ బుడగ జంగం కుల సంఘం నాయకుడితో నాపై ఒక ఫిర్యాదు చేయించారు. నేను అతన్ని అడిగితే ‘వాళ్ళేదో రాసుకొచ్చి సంతకం చేయమన్నారు చేశాను, మీరు అని తెలియదు మేడం’ అని చెప్పాడు. ఇప్పుడు కూడా దళితుల చేతనే సోషల్ మీడియాలో కామెంట్ పెట్టిస్తున్నారు. మాలోనే ఉన్న అమాయకత్వాన్ని, చదువులేనితనాన్ని ఆధారం చేసుకుని జీవనోపాధి లేక బాంచెన్ దొరా అని పడుండే వారితోనే కేసులు పెట్టిస్తున్నారు. ఈ రాజకీయం ఎవరి మీద? ఒక దళిత స్త్రీ మీద.. అంటే ఇక్కడ కులం, జెండర్ వివక్షలను అర్థం చేసుకోవాలి. కుటుంబాలు, జీవితాలు పణంగా పెట్టి ఊరు కాని ఊళ్లో ఉద్యోగాలు చేస్తూ ప్రజల కోసం పని చేస్తున్న మామీద ఇన్ని కంప్లైంట్‌లు చేసేవాళ్ళు రోజూ జరిగే దోపిడీలు, అత్యాచారాలు, అన్యాయాలపై ఎందుకు స్పందించరు?


ఒక దళిత మహిళగా, బాధ్యత గల ఉపాధ్యాయురాలిగా నేను చెప్పేది ఏమిటంటే.. నిజానిజాలు తెలుసుకోండి, అన్యాయంగా స్త్రీల నోర్లు మూయిస్తున్న వాళ్ళని నిలదీయండి. మా మీద కేసులు పెట్టేది మా ఉద్యోగాలు పోగొట్టాలని, మమ్ముల్ని నైతికంగా దెబ్బతీయాలనే. అయితే, వాళ్ళ వైపు ఎటువంటి ఆధారాలు లేవు. పోస్ట్‌లు పెడితేనే కేసులు నమోదు చేస్తామంటే సగం సోషల్ మీడియాలో ప్రజలు ఉండరు. నాపైన ఇటువంటివి చేస్తున్న వారికి ఒక విధంగా నేను రుణపడే ఉండాలి. వీళ్ళ దాష్టీకాల వల్ల ప్రతీసారి నాకు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు వస్తుంది. నేను ఏ మతానికి కొమ్ము కాయను కాబట్టి అన్ని మతాల వారు నాకు మద్దతుగా ఉన్నారు. ఏ పార్టీ అయినా, ఏ మతం అయినా తప్పు చేస్తే విమర్శించే హక్కు రాజ్యాంగం కల్పించింది. నేను ఏ తప్పూ చేయలేదు, చేయను కూడా. నేను చేసింది తప్పుగా అనిపిస్తే, అలా వారు చిత్రీకరిస్తే.. అది నా తప్పు కాదు. కరోనా కోరల్లో దేశం చిక్కుకుంది. దీనికి మతం లేదు, కులం లేదు; బీదా గొప్ప, లింగ, ప్రాంత భేదం లేదు. కోట్లాది మంది సహాయం కోసం చూస్తున్నారు. వీలయితే సహాయం చేయండి కానీ ఒక మతాన్ని నిందించకండి. అదే నేను సోషల్ మీడియాలో రాసాను. దాన్నే తప్పుగా చూపించారు. ఈ తప్పుడు కేసులు పెట్టె వాళ్ళని ఏరి వేయమని, వీటి వల్ల ఏ పార్టీకి ఒరిగేది ఏమీ లేదని తెలియజేస్తున్నాను.


సుజాత సూరేపల్లి

(దళిత్ విమెన్ కలెక్టివ్)

Updated Date - 2020-04-09T05:56:55+05:30 IST