విజ్ఞానం దేశానిది, లాభాలు కార్పొరేట్లకా?

ABN , First Publish Date - 2021-05-14T06:20:47+05:30 IST

కరోనా వ్యాక్సిన్ తయారీలో పరిశోధనలు చేసి విజయవంతమైన కంపెనీలు లాభాలు కోరుకోవడంలో తప్పు లేదు. అన్యాయం కూడా కాదు...

విజ్ఞానం దేశానిది, లాభాలు కార్పొరేట్లకా?

కరోనా వ్యాక్సిన్ తయారీలో పరిశోధనలు చేసి విజయవంతమైన కంపెనీలు లాభాలు కోరుకోవడంలో తప్పు లేదు. అన్యాయం కూడా కాదు. ఇప్పటి ప్రపంచ పేటెంట్ చట్టాల ప్రకారం పరిశోధనకు కోట్ల రూపాయలు వెచ్చించిన కంపెనీలు, తాము ఉత్పత్తి చేసిన వాక్సిన్లు, లేదా తమ అనుమతితో ఉత్పత్తి అయిన వాక్సిన్లలో రాయల్టీ కోరుకోవడంలో కూడా అన్యాయం లేదు. 


మననెత్తిన బ్రిటిష్‌వాడు వదిలేసిపోయిన అనేకానేక చట్టాల్లో పేటెంట్ చట్టం ఒకటి. తన పరిశోధన ఫలితమైన వస్తువులను అమ్మడం ద్వారా వచ్చిన లాభాలను ఆ పరిశోధకుడికే పరిమితం చేయడాన్ని పేటెంట్ హక్కు ఇవ్వడం అంటారు. ఈ ప్రయోజనం ఇచ్చినందుకు ప్రతిఫలంగా పేటెంట్ సొంతదారు తన పరిశోధనా పరిజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. అందువల్ల ఎవరైనా కొత్త పరిశోధకులు శోధించి అంతకన్న గొప్ప పరిజ్ఞానం కనిపెట్టే వీలు ఏర్పడుతుంది. ఇది పేటెంట్ లక్ష్యం. 


పేటెంట్ చట్టాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలన్న మంచి ఆలోచనతో న్యాయమూర్తి ఎన్ రాజగోపాల అయ్యంగార్ నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. అన్నీ పరిశీలించి ప్రాసెస్‌కు పేటెంట్ ఇవ్వవచ్చు గానీ ప్రోడక్ట్కు పేటెంట్ కూడదని కమిటీ 1970లో సూచించింది. ఒక వస్తువును ఒక ప్రక్రియ ద్వారా తయారుచేసిన వారికి పేటెంట్ ఇచ్చి, ఆ పద్ధతిని మరొకరు ఎవరూ అనుకరించకుండా నిరోధించడం ప్రాసెస్ పేటెంట్ అంటే. లాభాలను పదేళ్లపాటు ఈ కంపెనీకి మాత్రమే ప్రత్యేకిస్తారు. 


ఉత్పాదిత వస్తు పేటెంట్ లేకపోవడం వల్ల ప్రయోజనం ఏమంటే పరిశోధకులు శ్రమించి ఇతర విధానాల ద్వారా ఆ వస్తువును సులువుగా ఉత్పత్తి చేసే టెక్నిక్‌ను కనిపెట్టవచ్చు. దీనివల్ల మన దేశంలో ఫార్మా పరిశ్రమ, జనరిక్ మందుల ఉత్పాదన విస్తారంగా పెరిగింది. ప్రపంచ మార్కెట్‌లో మన ఫార్మా కూడా పోటీలో నిలబడింది. ఒక్క చిన్న పాలసీ మార్పు దేశానికి ఎంత ప్రయోజనకరంగా పరిణమిస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. 1970లో ఈ విధంగా చట్టం తెచ్చుకున్న తరువాత మన ఫార్మా అద్భుతమైన ప్రగతి సాధించింది. కాని 1994–-95లో ప్రపంచీకరణ చర్చలు ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రతిపాదనలు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి. వారు ప్రాసెస్ పేటెంట్‌తో పాటు ప్రొడక్ట్ పేటెంట్ కూడా ఇవ్వకపోతే పరిశోధనలకు ప్రోత్సాహం ఉండదని ఒత్తిడులు తెచ్చారు. భారత్ కూడా ఆ బ్లాక్ మెయిల్‌కు తలొగ్గక తప్పలేదు. మనకు ఈ మధ్యలో ఎయిడ్స్ అనే మహమ్మారి వచ్చి మానవుల మనుగడనే సవాల్ చేసింది. దాన్ని భారత్ విజయవంతంగా తట్టుకోగలిగింది. దానికి కారణం పేటెంట్ చట్టాల్లో మార్పులు వెంటనే అమలులోకి రాకపోవడమే. భారత్ సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలకు ఎయిడ్స్ మందులు తయారు చేయగలిగింది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరోనా మృత్యువు కరాళ నృత్యం చేస్తుంటే కరోనా వ్యాక్సిన్ అసమర్థ నేతల, వాణిజ్య శక్తుల చేతుల్లో బందీగా మిగిలిపోయింది!


2020లో మనం వాక్సిన్ లేక కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆనాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు బిలియన్ డాలర్లు ఇచ్చుకుని వాక్సిన్ తయారీ సంస్థలతో ముందస్తు ఒప్పందాలు చేసుకుని తమ దేశ జనాభాకు సరిపోయేంత వాక్సిన్ కొన్నారు. అమెరికాలో అందరికీ టీకా ఇచ్చుకోవడం కూడా పూర్తి అయింది. మనమూ ఉన్నాం. మనదేశం లోని ప్రభుత్వ సంస్థే వ్యాక్సిన్ తయారయ్యే విజ్ఞానం కనిపెట్టినప్పకీ తగినంతగా దాని ఉత్పాదన చేతగాని అప్రయోజక విధానాలతో చతికిల పడిపోయాం. మొత్తం అమెరికా జనాభాకు వ్యాక్సిన్ వేసుకున్న తరువాత వారికి దానితో పని లేదు. అధిక ధరకు విదేశాలకు అమ్ముకోవచ్చు. విధి లేక కొనుక్కునే దుర్దశలో భారత్ వంటి అనేక దేశాలు ఎదురుచూస్తుంటాయి. 


అమెరికా వంటి అనేక అగ్రరాజ్యాలలో ప్రైవేట్ కంపెనీల పేటెంట్ వ్యాక్సిన్లతో లాభాలు సంపాదించడానికి సంసిధ్ధంగా ఉన్నాయి. పేటెంట్ నుంచి కరోనా వాక్సిన్‌కు మినహాయించాలని భారత్, దక్షిణాఫ్రికా సహా 100 దేశాలు ఒత్తిడి తెస్తే అమెరికా అధ్యక్షుడు అందుకు అంగీకరించారు. కాని కథ దాంతో సుఖాంతం కాలేదు. అనేకానేక దేశాలు ఒప్పుకుంటే తప్ప మినహాయింపు రాదు. ఏ ఒక్కదేశం వీటో చేసినా ఈ కృషి అంతా వృథా అవుతుంది. 


పేటెంట్ చట్టాలను ప్రపంచీకరించినపుడు అత్యవసర పరిస్థితుల్లో, ముఖ్యంగా కరోనా వంటి మహమ్మారి విజృంభించే దశలో ప్రభుత్వం, ఇతరులు పేటెంట్ పొందిన వస్తువును ఉత్పాదన చేసేందుకు కంపెనీలకు కంపల్సరీ లైసెన్స్ ఇచ్చే అధికారం సంపాదించుకున్నారు. దీని వల్ల అందరికీ ఔషధాలు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంటుంది. కరోనా కాలం కంటే ఈ మినహాయింపు వాడుకోదగిన సందర్భం మరేది ఉంటుంది. కాని ఇంతవరకు ఈ మినహాయింపును జన సంక్షేమం కోసం వాడే ప్రజానుకూల ప్రభుత్వాలే లేవు. 


వాక్సిన్ ఉత్పత్తి చేసే రెండు సంస్థలు ఉన్న హైదరాబాద్, పూణె నగరాలకు ప్రధాన మంత్రి ప్రత్యేక విమానంలో వచ్చి వారితో మాట్లాడినపుడు, ఆహా ఎంత ప్రోత్సాహం లభిస్తున్నది అని ప్రజలు సంతోషించారు. కాని జరిగింది మరొకటి. మన 137 కోట్ల జనాభాకు రెండు డోసులు అంటే దాదాపు 280 కోట్లు లేదా 300కోట్ల డోసులు కావాలి. పూనావాలా సీరం సంస్థ ఏటా వందకోట్లు, హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ 70 కోట్లు మాత్రమే తయారు చేయగలుగుతాయని ముందే తెలుసు. అవి మనకు సరిపోవనీ తెలుసు. కాని ఉత్పత్తి పెంచడానికి ఏ చర్యలూ తీసుకోకపోగా, 6 కోట్లకు పైగా డోసులు ఎగుమతి చేసుకున్న ఘనత పాలకులది. ఈ లెక్కన మనదేశంలో అందరికీ వాక్సిన్ 2024లో కూడా అందడం కష్టం. ఈ లోగా మూడో వేవ్ కూడా వస్తే ఈ దేశానికి ఎవరు దిక్కు?


ఇక అసలు కథ. మన భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ తయారుచేసింది ఎవరో కాదు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అనే ప్రభుత్వరంగ సంస్థ. ఆ పరిజ్ఞానాన్ని వాడుకుని భారత్ బయోటెక్ వారు కోవాగ్జిన్ తయారు చేస్తున్నారు. వచ్చిన లాభాల్లో అయిదుశాతం రాయల్టీ ఐసిఎంఆర్‌కు ఇవ్వాలని ఒప్పందం. సీరం వారు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేసిన వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారుచేయడానికి ఒప్పందం చేసుకున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కూడా ఇంగ్లాండ్ లోని ప్రభుత్వ సంస్థే. ప్రైవేటు దుకాణం కాదు. 


మనదేశంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యాక్సిన్ తయారుచేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. మహారాష్ట్రలో హాఫ్కిన్ బయో ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్, జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు వారి ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్, భారత బయోటెక్నాలజీ విభాగానికి చెందిన భారత్ ఇమ్యూనలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ లిమిటెడ్ అనే ప్రభుత్వరంగ సంస్థలు వాక్సిన్ తయారు చేయడంలో నిష్ణాత సంస్థలు. కేంద్రప్రభుత్వానికి గానీ ఐసిఎంఆర్‌కు గానీ వీటిని ఉపయోగించుకోవచ్చన్న విషయమే గుర్తు లేదు. వారికి ప్రైవేటురంగంలో ఉన్న అనేకానేక సంస్థలు కూడా కనిపించలేదు. తెలుసుకోవాలనీ అనిపించలేదు. భారత్ బయో, సీరం సంస్థలతో సహా వీటన్నిటితో కూడా వ్యాక్సిన్ తయారు చేసే పరిజ్ఞానాన్ని ఐసిఎంఆర్ ఎందుకు పంచుకోలేదో తెలియదు. ఇవ్వన్ని కలిసి వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తే మనదేశ ప్రజలందరికీ ఇవ్వడమే గాకుండా పేదదేశాలకు ఉచితంగా ఇచ్చి, ఇతర దేశాలకు లాభంతో అమ్ముకునే అవకాశం ఉండేది కదా. ఐసిఎంఆర్ పరిజ్ఞానంతో తయారయ్యే వ్యాక్సిన్‌ను తక్కువ స్థాయిలో, ఆక్స్‌ఫర్డ్ వారి వ్యాక్సిన్‌ను సీరం సంస్థ నుంచి ఎక్కువ స్థాయిలో కొనుక్కోవాలనేది అమాయకమైన ఆలోచనా? 


సీరం నుంచి ఏటా సగం అంటే యాభై కోట్ల వ్యాక్సిన్ లను 150 రూపాయలకు ఒక డోస్ చొప్పున కొనే కేంద్ర ప్రభుత్వంవాటిని ఎవరికిస్తుంది, ఏం చేసుకుంటుంది? వారి అధీనంలో ఉన్న కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో పంచుతుందా? లేదా నచ్చిన రాష్ట్రానికి ఇస్తుందా? మిగతా సగం కోటాను రాష్ట్రాలు రెట్టింపు ధరకు ఎందుకు కొనాలి? ఇది ప్రజల డబ్బు కాదా? వీరికి వచ్చే కరోనా విశిష్టమైనదా? ప్రైవేట్ వారికి ఇదే ఔషధాన్ని 600 నుంచి 1200కు సీరం ఎందుకు అమ్ముకోవాలి? 


కరోనా వైరస్‌ను లాభాల కోసం వాడుకోవడానికి కంపెనీలు ఉత్సాహంగా ఉంటే, వారికి వేల కోట్ల ప్రయోజనాలు చేకూర్చడానికి అంతకన్నా ఉత్సాహంగా ప్రభుత్వం పని చేయడమా? ఇంత ప్రజావ్యతిరేక, రాజ్యాంగ నియమభంగకరమైన, బాధ్యతారహితమైన వ్యాక్సిన్ విధానాన్ని జనం పైన రుద్దుతున్న కేంద్రప్రభుత్వాన్ని ఏమనాలి?

మాడభూషి శ్రీధర్

Updated Date - 2021-05-14T06:20:47+05:30 IST