ఎరువుల వృథాకు చెక్‌ పెట్టే పరిజ్ఞానం

ABN , First Publish Date - 2021-03-04T07:30:02+05:30 IST

ఐఐటీ ఖరగ్‌పూర్‌ శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే సరికొత్త ఆవిష్కరణ చేశారు. డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (డీజీపీఎస్‌) పరిజ్ఞానంతో నేల స్వభావాన్ని గుర్తించి, అందుకు అనుగుణంగా నైట్రోజన్‌, ఫాస్పరస్‌

ఎరువుల వృథాకు చెక్‌ పెట్టే పరిజ్ఞానం

అభివృద్ధిచేసిన ఐఐటీ ఖరగ్‌పూర్‌ శాస్త్రవేత్తలు


కోల్‌కతా, మార్చి 3 : ఐఐటీ ఖరగ్‌పూర్‌ శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే సరికొత్త ఆవిష్కరణ చేశారు. డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (డీజీపీఎస్‌) పరిజ్ఞానంతో నేల స్వభావాన్ని గుర్తించి, అందుకు అనుగుణంగా నైట్రోజన్‌, ఫాస్పరస్‌, పొటాష్‌ (ఎన్‌పీకే)లను వినియోగించేలా ఎరువులను చల్లే యంత్రాలకు మార్గనిర్దేశం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. దీని వాడకంతో ఎరువుల వృథాను 30 శాతం దాకా తగ్గించొచ్చని వెల్లడించారు. జీపీఎస్‌ ద్వారా హెక్టారు వ్యవసాయ భూమిని 36 గ్రిడ్‌లుగా విభజించి, ఒక్కో గ్రిడ్‌లోకి దాని పరిధిలోని నేల స్వభావం వివరాలను నిక్షిప్తం చేసినట్లు తెలిపారు. దీంతో ఎరువులను చల్లే యంత్రం ప్రతి గ్రిడ్‌లోని నేల స్వభావాన్ని అప్పటికప్పుడు స్కాన్‌ చేసి.. ఎక్కడెక్కడ, ఏయే ఎరువులు, ఎంతమేరకు అవసరమనేది నిర్ణయిస్తుందన్నారు. 


ఇలా పనిచేస్తుంది..  

ఎరువులు చల్లే యంత్రం నేల స్వభావాన్ని ఎలా గుర్తిస్తుంది ? దానికి సమాచారం ఎలా అందుతుంది ? ఇంతకీ ఆ యంత్రాలు ఎలా ఉంటాయి ? అనే సందేహం చాలామందికి ఉంటుంది. ట్రాక్టర్‌ లేదా ఎరువులు చల్లే యంత్రాలనే ఇందుకు వినియోగిస్తారు. వాటిపై చిన్నపాటి జీపీఎస్‌ యాంటెనా, డీజీపీఎస్‌ పరికరాలను అమర్చుతారు. ఆ యంత్రం/వాహనం కదలికలు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి? ఏ దిక్కులో జరుగుతున్నాయి ? అనే సమాచారం జీపీఎ్‌సకు పక్కాగా అందించేందుకుగానూ వెహికిల్‌ ట్రాకర్‌, ఈ-కంపా్‌సలు కూడా అమరి ఉంటాయి.  ఈ పరికరాల ద్వారా సేకరించే జీపీఎస్‌ సమాచారాన్ని నిక్షిప్తం చేసుకొని విశ్లేషించేందుకు ఒక కంప్యూటర్‌ను కూడా ఎరువులు చల్లే యంత్రానికి బిగిస్తారు. అందే సమాచారాన్ని విశ్లేషించి నేల స్వభావం ఆధారంగా.. సాగు భూమిలోని ఏయే ప్రాంతంలో ఏయే ఎరువులు, ఎంత మోతాదులో వాడాలో కంప్యూటర్‌లోని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ నిర్దేశిస్తుంది. ఈ ఉపకరణాలకు అదనంగా గ్రాఫిక్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ పరిజ్ఞానం కలిగిన మైక్రో ప్రాసెసర్‌ కమ్‌ మైక్రో కంట్రోలర్‌లను ఎరువులు చల్లే యంత్రానికి బిగించి నేల స్వభావాన్ని మ్యాపింగ్‌ చేయడమే ఐఐటీ ఖరగ్‌పూర్‌ శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ. 

Updated Date - 2021-03-04T07:30:02+05:30 IST