కొడాలిని తొలగించాల్సిందే

ABN , First Publish Date - 2020-09-25T08:12:31+05:30 IST

హిందూ ధర్మాన్ని హేళన చేస్తూ, హైందవ సంస్కృతిని అవమానిస్తూ.. మతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న మంత్రి కొడాలి నానిపై చర్య

కొడాలిని తొలగించాల్సిందే

జగన్‌ పాలనలో హిందువులకు రక్షణ లేదు

రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): హిందూ ధర్మాన్ని హేళన చేస్తూ, హైందవ సంస్కృతిని అవమానిస్తూ.. మతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న మంత్రి కొడాలి నానిపై చర్య తీసుకోవాల్సిందేనని బీజేపీ డిమాండ్‌ చేసింది. హిందూ దేవుళ్లతోపాటు దేశ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి చర్యను నిరసిస్తూ అన్ని జిల్లాల్లో గురువారం ఆందోళన చేపట్టింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల్లో పోలీసులు, బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాటలు జరిగాయి.


కొడాలి నాని లాంటి వ్యక్తిని మంత్రివర్గంలో కొనసాగిస్తున్న జగన్‌ పాలనలో హిందులకు రక్షణ లేదని బీజేపీ నేతలు విష్ణువర్ధన్‌ రెడ్డి, సత్యమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మతాన్ని రాష్ట్ర మంత్రి ఇంతలా కించపరుస్తున్నా సీఎం మౌనాన్ని బట్టి ఆయన తీరు ఏమిటో అర్థం చేసుకోవాలని బీజేపీ నేతలు మాధవ్‌, సూర్యనారాయణ రాజు తదితరులు సూచించారు. 




కొడాలి పిచ్చి పరాకాష్ఠకు: విష్ణుకుమార్‌రాజు

తిరుమలలో బుధవారం మంత్రి నాని మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయనకు పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టుగా ఉందని బీజేపీ నేత పి.విష్ణుకుమార్‌రాజు విమర్శించారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ల గురించి అనుచితంగా మాట్లాడిన నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని సీఎం జగన్‌ను డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి దేవాలయాలను, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడడం చేతకాకపోతే కేంద్రానికి అప్పజెప్పాలని బీజేపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి కర్నూలులో అన్నారు.


హైందవ సంస్కృతిని మంట గలిపేందుకు రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఏపీ సాధు పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ధ్వజమెత్తారు. సీఎం జగన్‌ తాను హిందువునని ప్రకటించాలని, లేదా శారదా పీఠాధిపతి ఆ మాట చెప్పాలన్నారు. 



సాధువుల కంటతడి మంచిది కాదు: ఉమ

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం తిరుమల వచ్చి నప్పుడు డిక్లరేషన్‌పై సంతకం చేశారని సీఎం జగన్‌రెడ్డి ఆయనకంటే గొప్పవ్యక్తా అని టీడీపీ అధికార ప్రతినిధి బొండా ఉమ ప్రశ్నించారు. జగన్‌ కేబినెట్‌లోని మం త్రుల మాటలు చూసి సాధువులు కంటి తడి పెడుతున్నారని, వారి కంట తడి రాష్ట్రానికి అరిష్టమని ఆయన హెచ్చరించారు. ‘హిందూ దేవాలయాలు, దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడితే జనం తిరగబడతారు. ఖబడ్దార్‌‘ అంటూ మంత్రి కొడాలి నాని, వైసీపీ నేతలను ఆ పార్టీ ఎంపీ రఘురామరాజు హెచ్చరించారు.


మంత్రి కొడాలి నానిని ‘కలియుగ శిశుపాలుడు‘గా బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అభివర్ణించారు. శిశుపాలుడి మాదిరి వందతప్పులు చేసిన తర్వాత ఆయన పతనం తప్పదని జీవీఎల్‌ హెచ్చరించారు. చంద్రబాబులా తన పతనాన్ని కోరి తెచ్చుకుంటారో లేక జరిగిన తప్పును గుర్తించి కొడాలి నానిని తక్షణమే మంత్రి మండలి నుంచి బర్త్‌రఫ్‌ చేస్తారో చూద్దామంటూ పరోక్షంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి జీవీఎల్‌ వ్యాఖ్యానించారు.


Updated Date - 2020-09-25T08:12:31+05:30 IST