నానీపై బీజేపీ భగ్గు.. పలువురు నేతల అరెస్టు

ABN , First Publish Date - 2020-09-25T15:39:33+05:30 IST

బీజేపీ పిలుపుతో ఆయా నాయకులను పోలీసులు ముందుగానే గృహనిర్బంధంలో..

నానీపై బీజేపీ భగ్గు.. పలువురు నేతల అరెస్టు

గృహ నిర్బంధంలో మరికొందరు

బీజేపీ కార్యాలయం వద్ద తోపులాట

విజయవాడలో ఉద్రిక్తం


విజయవాడ(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమరాన్ని రేపుతున్నాయి. బీజేపీ శ్రేణులు సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ముట్టడికి గురువారం ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు దారి తీసింది. 


బీజేపీ పిలుపుతో ఆయా నాయకులను పోలీసులు ముందుగానే గృహనిర్బంధంలో ఉంచారు. అయినప్పటికీ భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు విజయవాడ సూర్యారావుపేటలో ఉన్న బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ పోలీసులు భారీగా మొహరించారు. అక్కడి నుంచి వాళ్లంతా సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి బయలుదేరి వెళ్లడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ పోలీసులను తోసుకుంటూ ముందుకు కదిలారు.


వారిని పోలీసులు అరెస్టు చేసి, నగరంలోని వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి, పాతూరి నాగభూషణం తదితరులను అరెస్టు చేశారు. బీజేపీ సెంట్రల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి సత్యమూర్తి, మీడియా కన్వీనర్‌ వల్లూరి గంగాధర్‌ తదితరులు మహాత్మాగాంధీ రోడ్డులోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వారితోపాటు 29 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు వారిని స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. మంత్రి కొడాలి నానీని మంత్రివర్గం నుంచి తొలగించాలని వారు డిమాండ్‌ చేశారు. 


కరోనా కలకం

సూర్యారావుపేటలోని బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న నేపథ్యంలో కరోనా అందరిలోనూ టెన్షన్‌ పుట్టించింది. కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాటలో వాళ్ల మధ్య భౌతికదూరం చెరిగిపోయింది. నోటికి ఉన్న మాస్క్‌లు ఎగిరిపోయాయి. అంతా ఒకరినొకరు తోసుకున్నారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఓ నాయకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు వార్తలు బయటకు రావడంతో ఆ నాయకుడితో సన్నిహితంగా ఉన్నవాళ్లందరిలో ఇప్పుడు టెన్షన్‌ మొదలైంది. 

Updated Date - 2020-09-25T15:39:33+05:30 IST