తెలంగాణ సాధన.. ఒక్కరి క్రెడిట్‌ కాదు.. అన్ని పార్టీలూ కష్టపడ్డాయి

ABN , First Publish Date - 2020-05-13T20:56:25+05:30 IST

రాజకీయాల లక్ష్యం అధికారంగా, ఉద్యమాల పరమార్థం పదవులుగా మారిపోయిన వర్తమాన సందర్భంలో, వాటన్నింటికీ దూరంగా నిత్య ఉద్యమస్ఫూర్తితో సాగుతున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్‌ కోదండరాం. విప్లవ వామపక్ష నేపథ్యం కలిగిన ఆయన భిన్న, విరుద్ధ భావజాలాల

తెలంగాణ సాధన.. ఒక్కరి క్రెడిట్‌ కాదు.. అన్ని పార్టీలూ కష్టపడ్డాయి

ఉపాధి కేంద్రంగా రాష్ట్ర నిర్మాణం.. దాని కోసమే పని చేస్తా

అవసరమైతే వాలంటరీగా రిటైరవుతా.. ఓయూ వీసీ పదవి ఆలోచన లేదు

రాజకీయం మారాల్సిందే... కొత్త తరాలు ముందుకొస్తాయి

విద్యార్థుల రాజకీయ ఆకాంక్షను ఆహ్వానిస్తున్నా

ఓపెన్‌ హార్ట్‌ విత్ ఆర్కేలో ప్రొఫెసర్‌ కోదండరాం


రాజకీయాల లక్ష్యం అధికారంగా, ఉద్యమాల పరమార్థం పదవులుగా మారిపోయిన వర్తమాన సందర్భంలో, వాటన్నింటికీ దూరంగా నిత్య ఉద్యమస్ఫూర్తితో సాగుతున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్‌ కోదండరాం. విప్లవ వామపక్ష నేపథ్యం కలిగిన ఆయన భిన్న, విరుద్ధ భావజాలాల కలపోత అయిన రాజకీయ తెలంగాణ జేఏసీకి ఇన్నాళ్లు సారథ్యం వహించారు. తెలంగాణ సాధన అనంతర పరిణామాల్లోనూ ఆయన అన్ని పార్టీలకూ, సంస్థలకూ సన్నిహితంగా ఉంటూ..పునర్నిర్మాణం దిశగా తన తదుపరి అడుగులను సవరించుకొంటున్నారు. ‘ఉపాధితో కూడిన తెలంగాణ నిర్మాణం జరగాలం’టూ తన అభిమతాన్ని, ఆకాంక్షలను ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’లో మనస్సు విప్పి పంచుకున్నారు. 17-03-2014న ఏబీఎన్‌లో ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు..


ఆర్కే: తెలంగాణను సాధించిన అనుభూతి ఎలా ఉంది?

కోదండరాం: తప్పకుండా సంతోషంగా ఉంటుంది. వ్యక్తిగత విజయాలను పొందినప్పుడు అందరం సంతోషిస్తాం. కానీ, ఇది అలాంటిది కాదు. సమాజమంతా సంతోషిస్తుంది. కాబట్టి, ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే ఘట్టం.


ఆర్కే: కేసీఆర్‌కు ముందు నుంచే మీరు తెలంగాణ అంశంపై చైతన్యం చేస్తూ వస్తున్నారు. ‘తెలంగాణ వచ్చేనా’ అన్న నిరాశకు ఎప్పుడైనా గురయ్యారా?

కోదండరాం: నిరాశకు గురి కాలేదుగానీ, కేంద్రం నుంచి స్పందన లేదేమిటన్న కోపం ఉండేది. పరిస్థితులకు చూసినప్పుడు విషాదం కలిగేది. కానీ, అది కొంత కాలమే. ఆ వెంటనే ఉద్యమాన్ని నిలబెట్టుకోవడంపై, వ్యూహాలు రచించడంపైకి దృష్టి వెళ్లిపోయి,అన్నీ పక్కకు వెళ్లిపోయేవి.


ఆర్కే: రాజకీయ వ్యవస్థలు సూచిస్తున్న అభివృద్ధి నమూనాకు, మీరు ప్రతిపాదిస్తున్న నమూనాకు మధ్య తేడాలు కనిపిస్తున్నాయి కదా!

కోదండరాం: కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం ఉంది. ముఖ్యంగా తెలంగాణ సమాజం వ్యవసాయపరంగా చితికిపోయింది. ముందుగా చెరువులను అభివృద్ధి చేసుకోవాలి, సాగునీటి ప్రాజెక్టులను కట్టుకోవాలి, కొత్త రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం ఉచితంగా అందించాలి, కొన్ని ఉపాధి అవసరాలను తీర్చాలి, సింగరేణిలో ఓపెన్‌కాస్ట్‌ తవ్వకాలను ఆపివేయాలి.. వంటి విషయాల్లో ఏకాభిప్రాయమే ఉంది. ఒక్కమాటలో, రాజ్యాంగంలోని 3,4 షెడ్యూల్‌లను ప్రభుత్వం అమలు చేస్తే సమస్యలన్నీతీరిపోతాయి.


ఆర్కే: పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం దరిమిలా తెలంగాణ సమాజంలో రాజకీయ ఆకాంక్షలు పెరిగాయి. ముఖ్యంగా ఓయూ విద్యార్థులు రాజకీయ అవకాశాల కోసం చూస్తున్నారు. దీన్నెలా చూస్తారు?

కోదండరాం: ఇదేమీ సమస్య కాదు. పైగా మంచి పరిణామం. రాజకీయ ఆకాంక్షల్లోంచి ప్రత్యేక ఉద్యమం వచ్చిందా లేక ప్రత్యేక ఉద్యమం ద్వారా రాజకీయ ఆకాంక్షలు బలపడినాయా అనేది విశ్లేషించాలి. నా దృష్టిలో రాజకీయ ఆకాంక్షల్లోంచే బలమైన ఉద్యమం నిర్మాణమయింది. ఓయూ విద్యార్థుల రూపంలో ముందుకొస్తున్న కొత్త తరం, కొత్త అనుభవాన్ని పార్టీలు ఆహ్వానించాల్సిందే. నిజానికి రాజకీయాలు వాటికి అవే చెడ్డవి కావు. కింద నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు తట్టుకొన్నవారే నిలబడ్డారు. ఎన్టీఆర్‌ గ్రామ పట్వారీ వ్యవస్థని రద్దుచేసినప్పుడు కొంతమంది బాధపడినా ఇక్కడి నాయకులు నిలదొక్కుకున్నారు కదా!


ఆర్కే: ప్రొ. జయశంకర్‌ తరువాత ఆ గౌరవాన్ని మీకే దక్కింది?

కోదండరాం: ఆయన స్థాయిని అందుకోవాలంటే సమయం పడుతుంది. సాధారణ ప్రజలకు అభివృద్ధిలో వాటా దక్కినప్పుడే తెలంగాణను సాధించుకున్నట్టు అవుతుందని ఆయన చెప్పేవారు.


ఆర్కే: రాజకీయ అవకాశాలొచ్చినా ఇంతనిబ్బరంగా ఎలా ఉంటున్నారు?

ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటమనేది గొప్ప పని అని అనుకోవడం లేదు. దీర్ఘకాలిక దృష్టితో చూసి మన పాత్రని నిర్ణయించుకోవాలి. బాలగోపాల్‌, కన్నబీరన్‌లతో కలిసి ముఫ్పై ఏళ్లు పనిచేసిన అనుభవం నుంచి నేనిదే నేర్చుకున్నా.


ఆర్కే: మీ నేపథ్యం ఏమిటి? విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమానికి ఆకర్షితులు అయ్యారా? మీది ఏ ప్రాంతం?

కోదండరాం: తొలి దశలో సంప్రదాయ ఆలోచనలతో ఉండేవాడిని. 1970ల నాటి కల్లోల దశాబ్దం అందరితోపాటు నన్ను కూడా ఆలోచింపజేసింది. 1972-75 మధ్యకాలంలో నేను డిగ్రీలో ఉండగా..ఇందిరాగాంధీ భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ వంటి చర్యలు తీసుకున్నారు. ఎమర్జెన్సీ పెట్టారు. అతి పెద్ద ప్రజాస్వామ్యం అనుకున్న దేశంలో..ఎమర్జెన్సీ విధించడం ఏమిటని దిగ్ర్భాంతికి గురి అయ్యాం. ఈ క్రమంలో పౌర హక్కుల ఉద్యమానికి ఆకర్షితుడినయ్యాను. వ్యక్తిగత జీవితానికి వస్తే.. మాది ఆదిలాబాద్‌. నాన్న ఫారెస్టు కాంట్రాక్టులు చేసేవారు. మేం ఏడుగురం. మా పిల్లలిద్దరూ అమెరికాలోనే ఉన్నారు. అమ్మాయి..నల్లగొండ అబ్బాయిని ప్రేమ పెళ్లి చేసుకుంది.


బతుకుతెరువు అవకాశాలు పెంచుకోవాలి


ఆర్కే: హైదరాబాద్‌ని ఇంకా మహానగరం చేస్తానని కేసీఆర్‌ అన్నారు?

కోదండరాం: ఎవరు ఆ మాట అన్నా కూడా..రియల్‌ ఎస్టేట్‌ కేంద్రక అభివృద్ధి సరి కాదు. ఇప్పటిదాకా అనుసరిస్తున్న అభివృద్ధి అంశాల్లో కొన్నింటిని కొనసాగించాల్సి ఉంది, మరికొన్నింటిని వదిలేయాల్సి ఉంది. అందుకే ఈ ప్రక్రియని పునర్నిర్మాణంగానే భావించాలి.


ఆర్కే: తెలంగాణ తెచ్చుకోవడం కన్నా ఎక్కువ బాధ్యత ఇప్పుడు మీపై ఉంది. ఈ బాధ్యతలని ఎలా నిర్వహించబోతున్నారు? 

కోదండరాం: తెలంగాణ తెచ్చుకునేవరకు ఉన్న ఆందోళన వేరు. ఇప్పుడున్న ఆందోళన అలాంటిది కాదు. పునర్నిర్మాణానికి సంబంధించింది. ఈ పని రెండు, మూడు దశల్లో జరగాలి. ముఖ్యంగా తెలంగాణలో వ్యవస్థలు లేవు. నాయకత్వం లేదు. ఇక్కడే ఎదిగి నడిపించిన నాయకులు లేరు. కాబట్టి పార్టీలను ఎదిగించడమనే సమస్య ఉంటుంది. అలాగే, ఈ ప్రాంత సమస్యలపై కేంద్రీకరించి పనిచేయడం ఎలాగనేది ప్రజాసంఘాలుగా మేమూ నేర్చుకోవాలి. కొత్త రాష్ట్రంలో కొత్త విలువలను నిలబెట్టుకోవాలి. ప్రాంత అవసరాలను అనుసరించి స్థిరమైన అభివృద్ధి నమూనాను ఏర్పాటుచేసుకొని..దాని చుట్టూ అల్లుకొని పూర్తి ఏకాభిప్రాయం కాకున్నా ఒకరకమైన అంగీకారాన్ని సాధించాలి. తెలంగాణ సాధించుకోవడం కోసం ఉద్వేగంతో కదిలినట్టు కాదిది.


ఆర్కే: తెలంగాణ కోసం సమాజమంతా ఏకమైంది. ఇప్పుడేమో ఎవరి ఎజెండాలతో వారు ముందుకొచ్చారు. దీనిపై మీ పంథా ఏమిటి?

కోదండరాం: మీతో సహా చదువుకున్న మనమంతా మంచిచెడులు బేరీజు వేసుకొని చెప్పాలి. ‘సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు చదువుకున్నవారు మౌనంగా ఉండరాదు. ఇది టెర్రరిజం కన్నా ప్రమాదకరం’ అని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అనేవారు. ప్రభుత్వానికి సమాజ స్పందనలను తెలియజేయడం, ఆకాంక్షలను పాలకులకు చేరవేయడం, అవి నెరవేరేలా చూడటం అనేది చదువుకున్నవారిగా మన బాధ్యత.


ఆర్కే: ప్రొఫెసర్‌ కోదండరాంని పొలిటీషియన్‌ కోదండరాంగా చూడొచ్చా?

కోదండరాం: సమాజం మారాలని కోరుకునేవారంతా రాజకీయాల్లో ఉన్నట్టే లెక్క. కాకపోతే, ప్రభుత్వ వ్యవస్థలో భాగం అవుతామా లేదా అనే పరిమితార్థంలో మాత్రం మేం రాజకీయ నాయకులం కాదు. టికెట్‌ విషయానివస్తే.. చాలాకాలం దగ్గరగా మాపనిని ఆయన గమనించారు. మేం కావాలనుకున్నారు. ‘మేం ఒక రంగాన్ని ఎంచుకున్నాం. రాలేం’ అంటే ఆయన సరేనన్నారు.


ఆర్కే: పంపకాలపై మీ వంటి విజ్ఞులతో సమన్వయ కమిటీ ఏర్పాటయితే బాగుంటుంది కదా!

కోదండరాం: ఇది మంచి సూచన. ఆలోచిస్తాం. తప్పక ఆహ్వానిస్తాం. కొన్ని రంగాల్లోనయినా ప్రయత్నం చేస్తాం. కానీ, ఒక్క విషయంలో మీరు పూనుకోవాలి. పోలవరం నిర్మాణం పూర్తయి గోదావరి జిల్లాలకు నీళ్లు పోవడం పట్ల తెలంగాణకు అభ్యంతరం లేదు. ఆ నీళ్లను వాడుకోవాలన్నా తెలంగాణ వారు వాడుకోలేరు. కాకపోతే ప్రాజెక్టు భూకంప కేంద్రంలో ఉంది, ఆదివాసీలను ముంచుతున్నది. కాబట్టి, డిజైన్‌ మార్చాలి. ప్రత్యామ్నాయాలపై ఆలోచన చేయాలి. దీనిపై బహిరంగ చర్చ జరగడం మంచిది.


ఆర్కే: ఈ అంశాన్నే అవతల వాళ్లకి నచ్చజెప్పొచ్చు కదా! ‘నీళ్లు కోరుకున్నన్ని వాడుకోండి. మీ ప్రయోజనాలకు దెబ్బతగని విధంగానే ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయండి’ అని వారిని కోరవచ్చు కదా! 

కోదండరాం: దానికోసం ఇరుపక్షాలకు చెందిన మేధావులు, విజ్ఞులతో ఉమ్మడి వేదికని ఏర్పాటుచేయవచ్చు. అయితే, ఈ పనిని ఇప్పుడు కాక ఎన్నికల తరువాత మొదలుపెడితే బాగుంది. తప్పక చేయాలి. అందరం కలిసి ఆలోచించాలి. మీరు అన్నట్టు ఎన్నికల తర్వాతే..అంటే మే 15 తరువాతే మొదలుపెడదాం.


ఆర్కే: విభజన తరువాత..స్థానికత అంశంపై సందేహాలు వస్తున్నాయి. అసలు స్థానికులంటే ఎవరు?

కోదండరాం: స్థానికతకు పదో తరగతి సర్టిఫికేట్‌ ప్రమాణం కావాలన్నది ఉద్యోగుల వాదన. అలాగని ఈ అంశం అన్ని చోట్లా ఒకేరకంగా లేదు. స్థిరమైన నిర్వచనమూ లేదు. చిరు వ్యాపారుల విషయంలో స్థానికత అనే సమస్యే ఉత్పన్నం కాదు. ప్రధానంగా ఉద్యోగ, విద్యా విషయాల్లోనే ఈ చర్చ జరుగుతున్నది. అయితే, తెలంగాణలో ఉండిపోవాల నుకునేవారు క్రమంగా ఇక్కడివారిలో భాగమయిపోతారు. కన్నడిగులలాగే కలిసిపోయారు కదా!


ఆర్కే: ఖాళీ సమయాలు ఎలా గడుపుతారు?

కోదండరాం: పాత సినిమాలు చూస్తాను. రిలీఫ్‌ కోసం టీవీ చూస్తాను. పుస్తకాలు చదువుతాను. మొక్కలు పెంచడం ఇష్టం.


ఆర్కే: మీ జీవిత లక్ష్యం ఏమిటి?

కోదండరాం: వ్యవసాయం బాగుపడి ఆత్మహత్యలు ఆగిపోతే మనం దోహదపడిన వారమవుతాం. దుబాయికి పోతున్నవారి బతుకులు దుర్భరంగా ఉంటున్నాయి. అందువల్ల ఇక్కడ బతుకుతెరువు అవకాశాలు పెంచుకోవాలి. అంతకుమించి నేను కోరుకునేది ఏమీ ఉండదు.


తెలంగాణ సాధన క్రెడిట్‌ ప్రజలకు, అమరులకు దక్కాలి


ఆర్కే: రాజకీయ జేఏసీని సొంతం చేసుకోవడానికి కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నాయన్న భావం కలగడం లేదా?

కోదండరాం: ఉద్యమంలోంచి ఎదిగొచ్చిన శక్తులను తమ పక్షం చేసుకోవాలని రాజకీయ పార్టీలు అనుకోవడం తప్పుకాదు. జేఏసీ నేతల్లో ఎవరికైనా ఆసక్తి ఉంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లవచ్చు. ఉద్యమంలో కనపరిచిన నిబద్ధతని.. రాజకీయ రంగంలోనూ కొనసాగించాలని మాత్రమే వారిని కోరతాం.


ఆర్కే: ఉద్యమకాలంలో చాలామంది నాయకులు నోరు పారేసుకున్నారు. ఆ విధంగా పెరిగిపోయిన వైషమ్యాలను పోగొట్టడానికి ఉమ్మడి కార్యాచరణను ఏమైనా సిద్ధం చేసుకున్నారా?

కోదండరాం: ఆంధ్రా ప్రాంతంతో మేం మొదటినుంచీ సఖ్యతనే కోరుకున్నాం. ఆ ప్రాంత వికాసానికి మాకు తోచిన సూచనలు చేస్తున్నాం. సమస్యల్లా రాజకీయ నాయకులతోనే. తెలంగాణ నాయకులు ఒకరిద్దరు దురుసుగా మాట్లాడి ఉండొచ్చుగానీ, ఆంధ్రా ప్రాంత నాయకులు కావాలని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. విభజన జరిగితే నీళ్లు రావని, ఉపాధి దొరకదని.. విభజన ప్రకటన తరువాత కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రకటనలు చేయడం విద్వేషాలను, భయాలను పెంచింది. కాబట్టి ఇరు ప్రాంతాల మధ్య సఖ్యత కోసం కృషి చేయాల్సిన బాధ్యత అందరికన్నా ఎక్కువగా ఆంధ్రా ప్రాంత నాయకులపైనే ఉంది.


ఆర్కే: పరస్పర సహకారం ఉంటేనే రెండు రాష్ర్టాలూ అభివృద్ధి చెందుతాయి. దీనికోసం ఒక వేదిక ఏర్పాటు చేయవచ్చు కదా?

కోదండరాం: మేం తొలినుంచీ ఆంధ్రా ప్రాంత ప్రయోజనాలను గురించి ఆలోచించాం. వారి తరఫున మేం కేంద్రాన్ని కొన్ని అడిగాం. ‘‘ఆంధ్రా ప్రాంతంలో ఏయిమ్స్‌, ఐఐఎమ్‌ స్థాయిలో వైద్య, విద్యా వ్యవస్థలను ఏర్పాటుచేయొచ్చు కదా’’ అని ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్‌ నేతలను ప్రశ్నించాం. ద్వేషం పునాదిపై తెలంగాణను నిర్మించలేమని మా వాళ్లకు కూడా నచ్చజెప్పాం. పంపకాల్లో కొంచెం జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది.


ఆర్కే: దళితుడిని సీఎం చేస్తామని చెప్పిన కేసీఆర్‌ వెనక్కిపోయే పరిస్థితి రావడంతోనే కాంగ్రెస్‌ ముందుకొచ్చినట్టుంది?

కోదండరాం: తానన్న మాటని ఆయన బహిరంగంగా ఎక్కడా సవరించుకున్నది లేదు. అంటే కట్టుబడి ఉన్నట్టే కదా!


ఆర్కే: మీ ఉద్దేశంతో తెలంగాణ సాధన..క్రెడిట్‌ ఎవరికి దక్కాలి?

కోదండరాం: ముందుగా ప్రజలకు, అమరులకు దక్కాలి. తెలంగాణ ఉద్యమానికి రాజకీయ ముఖంగా వచ్చి పార్టీలపై ఒత్తిడి తెచ్చిన క్రెడిట్‌ టీఆర్‌ఎస్‌ది. రాజకీయ ప్రక్రియను పరిపూర్తి చేయడంలో బీజేపీ పాత్ర ఉంది. ఉద్యమానికి సమరశీలతని తీసుకురావడంలో న్యూడెమోక్రసీకి, నైతికబలం తీసుకురావడంలో సీపీఐకి పాత్ర ఉంది. ఈ పార్టీలు భవిష్యత్తులో ఎలాంటి పాత్రని పోషించబోతున్నాయనేదే ఇప్పుడు ముఖ్యం. ఈ క్రమంలో జేఏసీ పాత్రని నిర్ణయించుకోవాల్సి ఉంది.


ఆర్కే: ఉద్యమ ప్రస్థానంలో ఒక్కసారే ఆత్మరక్షణలో పడ్డారు. ఎవరికి చెప్పకుండా మీరు, శ్రీనివాస్‌గౌడ్‌ ఢిల్లీకి వచ్చారని ప్రచారం ఉంది?

కోదండరాం: ఆలస్యం చేస్తే నష్టం జరుగుతుందని కాంగ్రెస్‌ నేతలకు చెప్పడానికి వెళ్లి వచ్చాం. కొంతమంది మిత్రులు సహకరించి..ఈ సమావేశం ఏర్పాటుచేశారు. అయితే, డీల్‌ చేసిన పద్ధతి సరిగా లేదని జేఏసీలో మేం ఆత్మవిమర్శ చేసుకున్నాం.


ఆర్కే: భావజాలం విషయంలో మీకు, ఐలయ్యకి సారూప్యత, ఘర్షణ ఉంటుంది. ఎందుకలా?

కోదండరాం: ఇద్దరం వ్యక్తిగతంగా సన్నిహితులం. బహుజనులకు అన్యాయం జరగరాదనేది ఐలయ్య భావన. అలాంటి అనుమానం కలిగినప్పుడు ఆయన విమర్శ చేస్తారు. అది ఆయన పాత్ర. తప్పేమీ లేదు.


ఆర్కే: తిరిగి మీ వృత్తిలోకి వెళతారా? ఓయూ వీసీగా చూడొచ్చా?

కోదండరాం: ఉద్యమానికి, అధ్యాపక వృత్తికి మధ్య పెద్ద గీతేదో ఉన్నట్టు నేను భావించను. ఈ ఉద్యమానికి ముందు నుంచి కూడా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నవాడినే. రెండేళ్లలో రిటైర్‌ అవుతున్నాను. కాబట్టి, ఇప్పుడే వాలెంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకొని పూర్తిగా సామాజిక జీవితాన్ని గడిపే ఆలోచనా లేకపోలేదు. జేఏసీగా రాష్ట్ర నిర్మాణంలో భాగస్వామిని అవుతాను. ఓయూ వీసీ పదవి ఆలోచన లేదు.


ఆర్కే: పునర్నిర్మాణం అని కొందరు, నవ నిర్మాణం అని కొందరు అంటున్నారు.పునర్నిర్మాణం అన్నదే తప్పని పొన్నాల అంటున్నారు.

కోదండరాం: రెండూ ఒక్కటే. తెలంగాణ సమాజాన్ని కొత్తగా నిర్మించాలనేది నవ నిర్మాణ భావన. విచ్ఛిన్నమయిన సమాజాన్ని తిరిగి వికసింపజేయాలనేది పునర్నిర్మాణ భావన. పునర్నిర్మాణ ప్రక్రియని కొత్త పద్ధతుల్లో చేపట్టాలనేది మాకున్న అభిప్రాయం. పొన్నాల విషయం నాకు అనవసరం. ఉమ్మడి రాష్ట్రంలో రియల్‌ఎస్టేట్‌ కేంద్రంగా నమూనాను రూపొందించుకున్నారు. హైదరాబాద్‌లో నిర్మాణాలు రావాలి, రియల్‌ ఎస్టేట్‌ పెరగాలనేది ఆ నమూనా. ఈ నమూనాను ఇక ముందూ కొనసాగిస్తారా? వ్యవసాయం బలపడి, చిన్న పరిశ్రమలు నిలదొక్కుకొనే పర్యావరణహిత నమూనా కావాలి.

Updated Date - 2020-05-13T20:56:25+05:30 IST