కొక్కొరకో..ఢీ

ABN , First Publish Date - 2022-01-16T05:30:00+05:30 IST

సంక్రాంతి సంప్రదాయం.. సంబరాల ముసుగులో తీర ప్రాంతంల్లో కోడిపందేలు యథేచ్ఛగా జరిగాయి. భోగితో బరి తెగించగా.. సంక్రాంతి, కను మతో పుంజుల పందేలు పుంజు కున్నాయి.

కొక్కొరకో..ఢీ
నిజాంపట్నంలో కోడిపందాలను వీక్షిస్తున్న పందెం రాయుళ్ళు

అధిక్కారికంగా బరులు

తీరంలో భారీగా కోడి పందేలు

వీఐపీ బరుల్లో రూ.లక్షల్లో పందేలు

బరుల వద్దే యథేచ్ఛగా మద్యం అమ్మకాలు

రెండు రోజుల్లో సుమారు రూ.8 కోట్ల పందేలు

ఎక్కువ పందేలు గెలిస్తే బులెట్‌ బహూకరణ 

నిజాంపట్నం బరిలో పందెంరాయుళ్లలో ఉత్సాహం

పల్లెకోనలో మూడురోజులుగా కొనసాగుతున్న పందేలు


సంక్రాంతి కోళ్లు బరితెగించాయి. పౌరుషంతో కాళ్లు రువ్వుకున్నాయి. సంక్రాంతి కోళ్ల కోట్లాటలను చూసేందుకు వచ్చిన జనం.. పందెంరాయుళ్లతో.. తీర ప్రాంతం తిరునాళ్ల సందడిని సంతరించుకున్నది. కరెన్సీ కట్టలతో పందెంరాయుళ్లు ఉత్సాహంగా పందేలు కాశారు. పండుగ ముందు వరకు దాడులు చేసి బరులు కూల్చేయడం.. పందేలు కాస్తే కఠిన చర్యలే అన్న పోలీసులు ఆ ఛాయలకు రాకుండా మొహం చాటేశారు. అధికారం అండతో నిర్వాహకులు బరితెగించి కోళ్ల పందేలను జోరుగా నిర్వహించారు. ఇక బరుల ప్రాంగణాల్లో నెంబర్లాట, రింగ్‌ ఆట, కోతముక్క, లోన బయట తదితర జూదాలను ప్రత్యేకంగా నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా మద్యం విక్రయాలు జరిగాయి. తక్కువలో తక్కువ ఈ రెండు రోజుల్లో పందేల పేరిట రూ.8 కోట్లు  చేతులు మారినట్లు అంచనా. బరులు ఎక్కువై పోవడంతో నిర్వాహకులు పందెంరాయుళ్లలో ఉత్సాహం నింపేందుకు ఎక్కువ పందేలు గెలిచినవారికి బుల్లెట్‌ బహుమతి ఇస్తామని ఉత్సాహం నింపి మరీ పందేలు నిర్వహించారు. కృష్ణానది, సముద్ర తీర గ్రామాల్లో అడ్డూ అదుపు లేకుండా మూడు రోజులుగా కోళ్ల పందేలు సాగాయి. కొన్నిచోట్ల సోమవారం కూడా పందేలు నిర్వహిస్తామని నిర్వాహుకులు బహిరంగంగానే ప్రకటించారు.

 

 గుంటూరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సంప్రదాయం.. సంబరాల ముసుగులో తీర ప్రాంతంల్లో కోడిపందేలు యథేచ్ఛగా జరిగాయి. భోగితో బరి తెగించగా.. సంక్రాంతి, కను మతో పుంజుల పందేలు పుంజు కున్నాయి. సంక్రాంతి పండుగ సంద ర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో పందెంరాయుళ్లు స్వగ్రామాలకు రావటంతో కోడి పందేలు కోలాహలంగా జరిగాయి. స్థానికంగా అధికార పార్టీ నా యకుల అండతో పండుగ ముందు వరకు హడావుడి చేసిన పోలీసులు మూడు రోజు లుగా ఆ ఛాయలకు కూడా రాలేదు. పైగా వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలిరావడంతో పల్లె వీధులు కిటకిటలాడగా.. వాహనాల క్రమబద్ధీకరణకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. నిజాంపట్నం గ్రామంలో స్థానిక నేతల ఆశీస్సులతో నాయకులు శనివారం సంక్రాంతి, ఆదివారం కనుమ పండుగ సందర్భంగా విచ్చలవిడిగా 8 బరులతో కోడిపందేలు జోరుగా నిర్వహించారు. పోలీస్‌స్టేషన్‌ కూతవేటు దూరంలోనే పందే లు నిర్వహిస్తున్నా పోలీసులు కళ్లు మూసుకున్నారు. కోళ్ల యజమానులు కాసే బెట్టింగ్‌ల కన్నా పై బెట్టింగ్‌లు అధికంగా జరిగాయి. తెలంగాణ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన వారితో నిజాంపట్నం జనసందోహంతో నిండిపోయింది. కోడి పందేల బరు ల సముదాయంలో నెంబర్లు, రింగ్‌ ఆట, జోరుగా సాగాయి. ఫెన్సింగ్‌ వేసి మరి కోతముక్క, లోన బయట, ఆటలు నిర్వహించారు. రూ.10 వేలు కడితేనే గుడారాల్లోకి అనుమతి ఇచ్చేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కోడి పందేలు గెలుపొందాక నిర్వాహకులు విజేతల నుంచి 20 శాతం కమీషన్‌ వసూలు చేశారు. ద్విచక్ర వాహనాలకు రూ.50, కార్లకు రూ.100 పార్కింగ్‌ ఫీజుగా వసూలు చేశారు. ఈ పార్కింగ్‌ ఫీజులే లక్షల్లో వచ్చినట్లు సమాచారం. ఆటోల్లో మద్యం తీసుకొచ్చి మరీ యథేచ్ఛగా విక్రయించా రు. బీరు రూ. 350కి అమ్మగా ఇతర మద్యం సీసాలను కూడా అధిక ధరలకు విక్రయించారు.  నిజాంపట్నం వీఐపీ బరిలో ఎవరు ఎక్కువ పందేలు గెలిస్తే వారికి బుల్లెట్‌ బహూకరిస్తామని ప్రకటించి పందెంరాయుళ్లలో ఉత్సాహం నింపారు. ఎలాగైనా బుల్లెట్‌ను కైవసం చేసుకోవాలని రూ.లక్షలతో వీఐపీ బరుల వద్ద తిష్టేశారు. రూ.50వేల నుంచి రూ.1లక్ష వరకు మంచి పుంజులను కొనుగోలు చేసి పందేలు వేశారు. సోమవారం కూడా పందేలు నిర్వహించి విజేతలకు బుల్లెట్‌ బహుకరించనున్నట్లు సమాచారం.  

 భట్టిప్రోలు మండలం పల్లెకోన నుంచి  రాచూరు వెళ్లే మార్గంలో నాలుగు బరులను ఏర్పాటు చేసి మూడు రోజులుగా పందేలు నిర్వహిస్తున్నా రు.   ఇక్కడ నిర్వాహకులు భారీగా ఏర్పా ట్లు చేయడంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారితో బరుల ప్రాంగణాలు కిట కిటలాడాయి. సైకిళ్లు, ద్విచక్రవాహనాలు, కార్లకు ఎంట్రీ ఫీజుల పేరిట దోపిడీ చేశారు. పాన్‌, సిగరెట్‌, కూల్‌డ్రింక్‌, మిఠాయి దుకాణాలు, బిర్యాని పాయింట్లు ఏర్పాటుకు వేలాది రూపాయిలు ధర నిర్ణయించి మరీ నిర్వాహకులు వసూలు చేశారు.  



కోళ్లు తెచ్చిన.. కోట్లు

సంక్రాంతి సంబరం.. కోళ్ల పందేల మధ్య కొనసాగింది. కృష్ణానది, సముద్ర తీర గ్రామాల్లో  మూడు రోజులుగా కోళ్ల పందేలు జరిగాయి. ఎంత లేదన్నా సంక్రాంతి, కనుమ రోజుల్లో జిల్లాలో రూ.8 కోట్ల పందేలు జరిగినట్లు సమాచారం. జిల్లావాసులే కాకుండా కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో పందెంరాయుళ్లు తరలివచ్చి మరీ కోళ్లపై పందేలు కాశారు. నిజాంపట్నంలో అయితే పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే 8 బరులు ఏర్పాటు చేసి మరీ పందేలు నిర్వహించారు. నిజాంపట్నంలో రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు కొన్ని, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కొన్ని, రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు మరికొన్ని ఇలా వేర్వేరు పందేలకు ప్రత్యేకంగా ఎనిమిది బరులను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ రెండు రోజుల్లో 5 వేలకుపైగా పందేలు జరగ్గా  రూ.6 కోట్ల వరకు కరెన్సీ కట్టలు తెగాయని అంచనా. నగరం, బాపట్ల మండలాల్లో 216 జాతీయ రహదారి వెంటే ఏర్పాటు చేసిన బరుల్లోనూ భారీగానే పందేలు జరిగాయి. బాపట్ల, కొల్లిపర మండలం బొమ్మువానిపాలెం, దుగ్గిరాల మండలం పెదకొండూరు సమీపంలోని కృష్ణానది మధ్యలో, మరికొన్ని లంకల్లో ఏర్పాటుచేసిన బరుల ద్వారా మరో రూ.2 కోట్లకుపైగా పందేలు నిర్వహించి ఉంటారని అంచనా. వీఐపీల కోసం ఏర్పాటు చేసిన బరుల్లో  లక్షల్లో పందేలు జోరుగా సాగాయి. 


సంబరంగా.. సంక్రాంతి

సంక్రాంతి, కనుమ పర్వదినాలను జిల్లావాసులు సంబరంగా జరుపుకున్నారు. భోగికి వర్షం ఆటంక పరచగా శని, ఆదివారాల్లో తెరిపిచ్చింది. దీంతో శుక్రవారం ప్రజలు సంక్రాంతి వేడుకగా జరుపుకున్నారు. ఆలయాలు కిటకిటలాడాయి. ప్రత్యేక అలంకరణలు, పూజలతో భక్తులు తరలించారు. ఆలయాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు భక్తులను అలరించాయి. పల్లెలతో పాటు పట్టణాలు పండుగ కళను సంతరించుకున్నాయి. ఇళ్ల ముంగిళ్లలను రంగురంగుల ముగ్గులతో పూలతో అలంకరించారు.  ఆదివారం కనుమ రావడంతో మాంసప్రియులకు కలిసివచ్చింది. కోడి, మటన్‌ మాంసం విక్రయ దుకాణాలు కోనుగోలుదారులతో కిటకిటలాడాయి. క్యూల్లో నిల్చుని మరీ చికెన్‌, మటన్‌లను పలువురు కొనుగోలు చేశారు. మందుప్రియులు కూడా జోరుగా కొనుగోళు చేశారు. 


  

Updated Date - 2022-01-16T05:30:00+05:30 IST