పందెమే గెలిచింది

ABN , First Publish Date - 2021-01-16T06:28:11+05:30 IST

సంక్రాంతి మూడు రోజుల్లో పందెం రాయుళ్లు అనుకున్నది సాధించా రు. కోళ్లకు కత్తులు కట్టారు. గుండాట ఆడారు. పేకాటలో రెచ్చిపోయారు. కోట్లు గుమ్మరించారు. సరదా తీర్చుకున్నారు. ఎన్నడూ లేని విధంగా వందల కొద్దీ బరులు వెలిశాయి.

పందెమే గెలిచింది
చొదిమెళ్లలో పందేలకు రెఢీ...

సంప్రదాయం ముసుగులో కత్తులు కట్టారు

ఊరువాడా ఎగబడిన పందెం రాయుళ్లు

పేకాట, గుండాటల్లో  కోట్లు వెదజల్లారు 

మూడు రోజులు ఇదే తీరు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి మూడు రోజుల్లో పందెం రాయుళ్లు అనుకున్నది సాధించా రు. కోళ్లకు కత్తులు కట్టారు. గుండాట ఆడారు. పేకాటలో రెచ్చిపోయారు. కోట్లు గుమ్మరించారు. సరదా తీర్చుకున్నారు. ఎన్నడూ లేని విధంగా వందల కొద్దీ బరులు వెలిశాయి. రహస్యంగా రహస్య శిబిరాల్లో పేకాటలు సాగాయి. చెరువు గట్టు, లాడ్జీ గది తేడా లేకుండా తెగ సరదా చేశారు. ఎక్కడికక్కడ నోట్లను వెదజల్లారు. సంప్రదాయం పేరిట ఈ సారి నగదుతో కుస్తీ పట్టారు. కరోనాను విస్మరించారు. సామాజిక దూరం బరుల్లో బలాదూర్‌. చిన్నా పెద్ద తేడా లేకుండా మూడు రోజులు మస్తుగా ఆడారు, అంతకంటే మించి మత్తులో ఊగారు. వంద కోట్లు కోడి పందాలు, జూదాల్లో అలావోకగా ఖర్చయిపోయింది. మరికొన్ని  కోట్లు మద్యం మత్తుకు చిత్త య్యాయి. కోడిపందాల ఆట కు వెళితే పనిపడతాం అని జబ్బలు చరిసిన పోలీసు ఈ మూడు రోజులు అక్కడక్కడా దాడులు చేశారు.  కోట్ల కొద్దీ పేకాటలో తగలెడుతుంటే కొందరిని మాత్రం అరెస్ట్‌ చేయగలిగారు. పందేలు యథేచ్ఛగా సాగాయి. ఇక గుండాట సరేసరి. రోజుకి 14 గంటలపాటు కోడి పందాలు, జూదం సాగుతూనే ఉంది. అంతకంటే మించి అధికార పక్షం కోడి పందాల నిర్వహ ణలో దర్పం వలగబోసింది. చోటో మోటా నేతలే కాదు ఎమ్మెల్యేలకు అనుంగులు కోడిపందాల నిర్వహణకు స్వీయ దర్శకత్వం వహించారు. గుండాట, పేకాట వీరి కనుసన్నల్లోనే. మద్యం సరఫరా శిబిరం నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా పెద్దలకు వాటాలు పంపడం లోనూ, పెద్దన్నపాత్ర వహించారు. భయంలేదు మేమున్నామంటూ పందెం రాయుళ్ళకు భరోసా ఇచ్చారు. ఒక్క పశ్చిమాన కోట్ల కొద్ది నగదు ఆవిరైపోయింది.  చేతులు మారింది. సంప్రదాయం పేరిట విచ్చల విడితనం సాగింది. కానీ గతేడాదితో పోలిస్తే ఈసారి కాస్తంత చప్పగానే సాగినట్లే. అయినా నగదు వెదజల్లడంలో మాత్రం కొందరు బరి తెగించారు. 

ఎటువంటి దాడులు జరగకుండా పోలీసులను అధికార దర్పంతో బుజ్జగించారు. కొన్నిచోట్ల గుండాట, పేకాట నిర్వహణకు లక్ష నుంచి 15 లక్షలు నిర్వాహకులు చెల్లించు కోవాల్సి వచ్చింది. ఈ మొత్తాన్ని  ఫణంగా పెట్టి కోడిపందాలు వేశారు. కొన్నిచోట్ల నిర్వాహకుల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి.  కొయ్యలగూడెంలో పందేల నిర్వహణలో ఇరువర్గాలు రెచ్చి పోయి తల బడ్డాయి. ఉద్రిక్తత సృష్టించాయి. సీసలి, కలగంపూడి, తేతలి, మందల పర్రు వంటి ప్రాంతాల్లో భారీగా పందేలు సాగాయి. జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. గుండాట అలావోకగా సాగిపోయింది. గుండాట నిర్వాహకులు సైతం గంటల తరబడి తమకు కేటాయించిన స్థలాల్లోనే అందరిని ఆకర్షిస్తూ జేబులు ఖాళీ చేశారు. పేకాట శిబిరాలు మస్తుగా సాగాయి. ఇలాంటి శిబిరాలన్నింటిలోనూ గంటల తరబడి ఒకేచోట రహస్యంగా ఆట ఆడేందుకు వీలుగా అన్ని సదుపాయాలను కల్పించారు. మూడో కంటికి కనపడకుండా కొంత మందితో గస్తీ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 200 పందెం బరులు వేయగా, వీటన్నింటిలోనూ గుండాట జోరుగా సాగిం ది. ఒక్కో గుండాట నిర్వహణకు లక్షన్నర పైగానే ముడుపు చెల్లించు కోవాల్సి వచ్చింది. పేకాట సంగతి చెప్పనక్కరలేదు. కొవిడ్‌ భయంతో ఈసారి అత్యధికులు కోడి పందేలకు దూరం గా ఉన్నారు. చాలా చోట్ల స్థానికులే అన్ని సరదాలను తీర్చుకున్నారు. 


పోలీసు దాడులు 986 మంది అరెస్ట్‌

ఏలూరు క్రైం : సంక్రాంతి సందర్భంగా జిల్లాలో కోడి పందేలు, పేకాట స్థావరాలపై దాడులు జరిపి 345 కేసులు నమోదు చేసి 986 మందిని అరెస్ట్‌ చేసినట్టు ఎస్పీ కె.నా రాయణ నాయక్‌ తెలిపారు. వారి నుంచి ఆరు లక్షల 28 వేల నగదు, 497 కోళ్లు, 483 కోడి కత్తులు స్వాధీ నం చేసుకున్నారు. పేకాట, గుండాట ఆడుతున్న వారిపై 314 కేసులు నమోదు చేసి 1394 మందిని అరెస్ట్‌ చేసి 39 లక్షల 56 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 


కళ తప్పిన భీమవరం సంక్రాంతి 

ఈసారి  భీమవరం ప్రాంతంలో సంక్రాంతి కళ తప్పింది. అంచనాలకు అందని విధంగా పొరుగు ప్రాంతాల నుంచి సంక్రాంతి సంబరాలు చూసేం దుకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. కరోనా దెబ్బకు ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోను కోడి పందేలు నిర్వహించబోమని పోలీసు హెచ్చరి కలు, సాఫ్ట్‌ వేర్‌ రంగం వర్క్‌ ఫ్రమ్‌ హోం, ప్రభుత్వ విధానాలు వంటివి పొరుగు ప్రాంతాల నుంచి వచ్చే అతిథిలు, టూరిస్టులపై ప్రభావం చూపించింది. గతంతో పోలిస్తే ఈ ప్రాంతానికి సుమారు రెండు లక్షల మంది రాలేదని అంచనా. దీని ఫలితంగా లాడ్జిలు, రెస్టారెంట్లు, రవాణా తది తర వ్యాపారాలు ఆశిం చిన విధంగా జరగలేదు. కోట్ల రూపాయల మేర సంక్రాంతి వేళ లావాదేవీలు నిలిచిపోయాయి. కరోనా తరువాత సంక్రాంతికి కొంత వ్యాపారం చేసుకోవచ్చునని ఆశించిన వారి అంచనాలు తలకిందలయ్యాయి.

– భీమవరం 



Updated Date - 2021-01-16T06:28:11+05:30 IST