కోడి.. పోరాఢీ

ABN , First Publish Date - 2022-01-17T06:20:21+05:30 IST

కోడి పందేలు హోరాహోరీగా సాగాయి.. ఢీ అంటే డీ అన్నాయి..

కోడి.. పోరాఢీ
రా..రా చూసుకుందాం : యలమంచిలి బరిలో పుంజుల కోట్లాట

జోరుగా సాగిన కోడి పందేలు


కోడి పందేలు హోరాహోరీగా సాగాయి..  ఢీ అంటే డీ అన్నాయి.. పండుగ మూడు రోజులు బరులు రక్తసిక్తమయ్యాయి.. అనుమతులు రావడం కాస్త ఆలస్యమైనా పందెగాళ్లు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గ లేదు.. కొవిడ్‌ నిబంధనలు బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా పందేలు సాగాయి.  సంక్రాంతి సందడి అంతా బరుల వద్దే కనిపించింది. పల్లె వీధులన్నీ ఖాళీగా దర్శన మిచ్చాయి.  రెండో రోజు గుండాట నిలిపివేసినప్పటికీ కోడి పందేలు మాత్రం విచ్చలవిడిగా జరిగాయి. చివరి రోజు గుండాలకు అనుమతివ్వడంతో అన్ని బరుల వద్ద కాయ్‌ రాజా కాయ్‌ అంటూ పందేలు విచ్చలవిడిగా సాగాయి.ఆదివారం సాయంత్రం  6 గంటలకు పందేలను ముగించారు.  




ఉండి/కాళ్ళ/పాలకోడేరు/ఆకివీడు రూరల్‌, జనవరి 16 : సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు జోరుగా సాగాయి. కోడి పందేల్లో మూడు రోజులకు కాళ్ళ మండలంలో సుమారు రూ.15 కోట్లు చేతులు మారినట్టు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి, కనుమ రెండు రోజుల్లో భారీ ఎత్తున కోడి పందేలు వేశారు. పగలే కాకుండా కొన్ని గ్రామాల్లో ఫ్లడ్‌లైట్లు వెలుతురులో రాత్రుళ్లు పందేలు నిర్వహించారు. సీసలి గ్రామంలో ఏర్పాటు చేసిన కోడి పందేల బరి వద్ద ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేశారు. పందెగాళ్లను కట్టడి చేసేందుకు బౌన్సర్లను ఏర్పాటు చేశారు.కాళ్ళకూరు, ఏలూరుపాడు, కాళ్ళ, సీసలి, కోపల్లె, జక్కరం, పెదఅమిరం, మాలవానితిప్ప గ్రామాల్లో జోరుగా పందేలు నిర్వహించారు. ప్రధానంగా సీసలి కోడి పందేల వద్ద దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పాల్గొన్నారు. పాలకోడేరు మండలంలోని గొల్లలకోడేరు, పాలకోడేరు, కోరుకొల్లు, వేండ్ర, విస్సాకోడేరు, పెన్నాడ, శృంగవృక్షం గ్రామాల్లో పందేలు జోరుగా సాగా యి. ఉండి మండలంలో ఉండి, చెరుకువాడ, యండగండి, పాములపర్రు, కోల మూరు, మహదేవపట్నం తదితర గ్రామాల్లో పందేలు జరిగాయి.


నరసాపురంరూరల్‌/ మొగల్తూరు: నరసాపురం, మొగల్తూరు మండలా ల్లో మూడో రోజు ఆదివారం జోరుగా పందేలు జరిగాయి. చివరి రోజు ఆదివా రం సాయంత్రం 6 గంటల వరకు అన్ని బరుల వద్ద పందెంరాయుళ్ళలో సందడి కనిపించింది.నరసాపురం మండలం లోని లక్ష్మణేశ్వరం వద్ద నిర్వహిం చిన రెండు బరుల్లో పెద్ద ఎత్తున పందేలు జరిగాయి. చిట్టవరం, వేములదీవి, తూర్పుతాళ్ళు బరుల వద్ద ఇదే సందడి. మొగల్తూరు మండలంలో దాదాపు 15 చోట్లపైనే పందేలు నిర్వహించారు. గడిచిన మూడు రోజుల్లో సుమారు రూ. 5 కోట్లు పైనే పందాలు నిర్వహించినట్టు అంచనా.


ఆచంట/పెనుగొండ/పెనుమంట్ర/పోడూరు : నియోజకవర్గంలోని ఆ చంట,పోడూరు, పెనుమంట్ర, పెనుగొండ నాలుగు మండలాల్లో పలు గ్రామా ల్లో కోడిపందేలు, పేకాట, గుండాటలు యథేచ్ఛగా జరిగాయి. పోడూరు మండ లం మట్టపర్రు, పండితవిల్లూరు, కవిటం, వద్దిపర్రు గ్రామాల్లో కోడిపందేలు నిర్వహించారు.నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో సుమారు కోట్ల రూపాయలు చేతులు మారినట్టు పలువురు చెబుతున్నారు.


పాలకొల్లుఅర్బన్‌/రూరల్‌/యలమంచిలి : పోలీసులు కాదన్నా మూడు రోజులుగా యథేచ్ఛగా కోడి పందాలు జరిగాయి. మద్యం ఏరులై పారింది. మం డలంలోని పూలపల్లి, లంకలకోడేరు, దగ్గులూరు, వడ్లవా నిపాలెం, చింతపర్రు, పట్టణంలోని పెంకుళ్ళపాడు  ఔట్‌ వద్ద, తదితర ప్రాంతాల్లో పందేలు వేశారు. పూలపల్లి బైపాస్‌రోడ్డు సమీ పంలో  బరి వద్ద ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ కొద్ది సేపు కోడి పం దేలను వీక్షించారు.యలమంచిలి మండలంలోని కలగం పూడి, యల మంచిలి, గుంపర్రు, వడ్డిలంక, మట్లపాలెం,పెదలంక, కొంతేరు గ్రామాల్లో పెద్ద ఎత్తున నగదు చేతులు మారింది. యలమంచిలి బరి ప్రాంగ ణంలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన సంప్రదాయబద్ధమైన అలంకరణలు సెల్ఫీలకు నిలయంగా మారాయి.ఉయ్యాలల వద్ద చిన్నారులు సందడి చేశారు.


గుండాట..ఆడారు



భీమవరం రూరల్‌ : బరులు కళతప్పాయి.. భోగి రోజునే కోడి పందేలకు అనుమతులిచ్చినా గుండాట, కోతాట కు మాత్రం అనుమతివ్వలేదు. దీంతో బరుల వద్ద సందడి తగ్గింది.. గ్రామాల్లో మూడు రోజుల పాటు కోడి పందేలు నిర్వహించగా రెండు రోజులు మాత్రమే గుండాట, కోతాట నిర్వహించారు. భోగి రోజున ఉద యం 11 గంటల నుంచి గుండాటలకు అనుమతించినా వాతావరణం అనుకూలించకపోవడం తో అను కున్న స్థాయిలో గుండాట నిర్వహించలేదు. ఇతర రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పందెగాళ్లు నిరాశగా వెనుతిరిగారు.


నాటు కోడి రూ. 3 వేలు


నరసాపురం, జనవరి 16:
సంక్రాంతి పండుగతో నాటు కోళ్లకు మంచి డిమాండ్‌ వచ్చింది. కేజీ నాటు కోడి ఆదివారం రూ. 3 వేలు పెట్టినా దొరకని పరిస్థితి. పల్లెల్లో కోళ్ళకు ఎక్కడా లేని డిమాండ్‌ వచ్చి పడింది. సంక్రాంతి, కనుమ పండుగనాడు. గ్రామాల్లోని అమ్మ వార్లకు మొక్కలు తీర్చుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. అయితే గత మూడు రోజులుగా ఎక్కడ నాటుకోళ్లు దొరకలేదు. డిమాండ్‌కు తగ్గ కోళ్లు లేకపో వడంతో ఉన్న వాటిని ఎంత చెప్పినా కొనాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు కేజీల పైబడి ఉన్న కోడి రూ.4 వేలు కూడా పలికింది. అయినా దొరకని పరిస్థితి.  






Updated Date - 2022-01-17T06:20:21+05:30 IST