కోహ్లీపైనే కళ్లన్నీ..!

ABN , First Publish Date - 2022-01-19T08:45:35+05:30 IST

ఏడేళ్ల సుదీర్ఘ కాలం పాటు మైదానంలో నాయకత్వ ప్రతిభతో.. కీలక సమయాల్లో తనదైన హావభావాలతో అలరించిన విరాట్‌ కోహ్లీ ఇప్పుడు కేవలం ఒక ఆటగాడు మాత్రమే....

కోహ్లీపైనే కళ్లన్నీ..!

దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి వన్డే నేడే

వెంకటేశ్‌ అయ్యర్‌ అరంగేట్రం

మధ్యాహ్నం 

2 గంటల నుంచి

 స్టార్‌ స్పోర్ట్స్‌లో...


ఏడేళ్ల సుదీర్ఘ కాలం పాటు మైదానంలో నాయకత్వ ప్రతిభతో.. కీలక సమయాల్లో తనదైన హావభావాలతో అలరించిన విరాట్‌ కోహ్లీ ఇప్పుడు కేవలం ఒక ఆటగాడు  మాత్రమే. దీంతో నేటి నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీ్‌సలో అభిమానుల దృష్టంతా అతడిపైనే ఉండబోతోంది. దాదాపుగా రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన విరాట్‌పై ఎలాంటి బాధ్యతా లేకపోవడంతో మునుపటి సత్తాను ప్రదర్శిస్తాడని అంతా భావిస్తున్నారు. అలాగే కెప్టెన్‌గా రాహుల్‌, ఆల్‌రౌండర్‌ పాత్రలో వెంకటేశ్‌ అయ్యర్‌ కూడా నిరూపించుకోవాల్సి ఉంది.


పార్ల్‌: మూడు టెస్టుల సిరీ్‌సలో పరాజయం తర్వాత భారత జట్టు ఇప్పుడు పరిమిత ఓవర్ల సిరీ్‌సలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో నేటి నుంచి మూడు వన్డేల సిరీస్‌ జరుగబోతోంది. రోహిత్‌ గైర్హాజరీ కారణంగా తొలిసారిగా కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలో జట్టు బరిలోకి దిగబోతోంది. త్వరలోనే టెస్టు కెప్టెన్‌ పదవిని భర్తీ చేయనుండడంతో ఈ సిరీస్‌ అతడికి కీలకం కానుంది. ఇక వన్డే కెప్టెన్సీకి అనివార్య పరిస్థితిల్లో దూరమైన విరాట్‌కు కూడా ఈ సిరీ్‌సలో రాణించడం కీలకమే. చాలా రోజులుగా ఊరిస్తున్న సెంచరీని సాధించాలనే ఆలోచనలో ఉన్నాడు. అలాగే కీలక సమయంలో కోహ్లీ నుంచి సలహాలను కూడా రాహుల్‌ ఆశిస్తున్నాడు. మరోవైపు పూర్తి స్థాయి వన్డే జట్టుకు ద్రవిడ్‌ తొలిసారిగా కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు. గతంలో ధవన్‌ నేతృత్వంలో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. తమ చివరి పర్యటనలో ఇక్కడ భారత జట్టు ఆరు వన్డేల సిరీ్‌సను 5-1తో గెలవగా, కోహ్లీ ఇందులో మూడు శతకాలు బాదడం విశేషం.


రుతురాజ్‌కు నిరాశే..: ఫామ్‌ కోల్పోయి ఇప్పటికే టీ20ల్లో స్థానం గల్లంతైన శిఖర్‌ ధవన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. అసలు ఈ సిరీ్‌సలో అతడికి చోటు దక్కదని అంతా భావించారు. కానీ కోచ్‌ ద్రవిడ్‌కు అతడిపై నమ్మకం ఉంది. అలాగే రాహుల్‌ కూడా ధవన్‌ ఈ మ్యాచ్‌ ఆడే విషయమై స్పష్టతనిచ్చాడు. కానీ యువ ఆటగాళ్లతో విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో అతను కచ్చితంగా ఈ సిరీ్‌సలో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ధవన్‌ బరిలోకి దిగితే అద్భుత ఫామ్‌లో ఉన్న రుతురాజ్‌ గైక్వాడ్‌ తన అరంగేట్రం కోసం వేచిచూడాల్సిందే. ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో రాహుల్‌ మిడిలార్డర్‌లో వచ్చినా ఈసారి ధవన్‌తో ఓపెనింగ్‌ చేయనున్నాడు. కోహ్లీ ఎప్పటిలాగే మూడో స్థానంలో బరిలోకి దిగుతాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ లేక శ్రేయాస్‌ అయ్యర్‌లలో ఎవరికి చాన్స్‌ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. పంత్‌ స్థానానికి ఢోకా ఉండదు. ఇక, ఆరో నెంబర్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ ఆల్‌రౌండర్‌ పాత్రలో రాబోతున్నాడు. ఇది తనకు అరంగేట్ర సిరీస్‌. అలాగే ఆరో బౌలర్‌గానూ జట్టు అతడి సేవలను వినియోగించుకోవాలనుకుంటోంది. బౌలింగ్‌ విభాగంలో బుమ్రా, భువనేశ్వర్‌ పేస్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే మూడో పేసర్‌గా దీపక్‌, శార్దూల్‌ మధ్య పోటీ ఉంది. పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో చాహల్‌, అశ్విన్‌ ఇద్దరినీ ఆడించాలనుకుంటున్నారు. అశ్విన్‌ 2017లో చివరి వన్డే ఆడడం గమనార్హం.


డికాక్‌ రాక: 2-1తో టెస్టు సిరీ్‌సను గెలిచిన జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికా ఈ వన్డే సిరీ్‌సను కూడా ఆత్మవిశ్వాసంతో ఆరంభించనుంది. పైగా కీలక ఆటగాడు డికాక్‌ జట్టులో చేరడం వారి బలాన్ని రెట్టింపు చేసింది. కెప్టెన్‌ బవుమా ఫామ్‌లో ఉండడంతో పాటు పేసర్‌ జాన్సెన్‌ తన అరంగేట్ర వన్డే సిరీ్‌సలో కూడా అదనపు బౌన్స్‌తో భారత బ్యాటర్లను ఇబ్బందిపెట్టాలనుకుంటున్నాడు. మిడిలార్డర్‌లో డుస్సెన్‌కు డేవిడ్‌ మిల్లర్‌ మెరుపు ఇన్నింగ్స్‌ తోడైతే భారీ స్కోరు ఖాయం. పేసర్లు ఎన్‌గిడి, ఫెలుక్వాయోలతో పాటు స్పిన్నర్‌ షంసి కీలకం కానున్నారు.


నేను సిద్ధం:  రాహుల్‌

భారత టెస్ట్‌ జట్టుకు ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కితే అందుకొనేందుకు తాను సిద్ధంగానే ఉన్నట్టు కేఎల్‌ రాహుల్‌ తెలిపాడు. జట్టును ముందుకు నడిపించడానికి వీలైనంతగా పాటుపడతానన్నాడు. ‘జాతీయ జట్టుకు నాయకత్వం వహించాలనేది ప్రతి ఆటగాడి చిరకాల స్వప్నం. నేనేమీ అందుకు మినహాయింపు కాదు. అయితే, కెప్టెన్సీ కోసం ఎదురుచూడడం లేదు. ఒకవేళ అవకాశం వస్తే అందుకొనేందుకు సిద్ధం. జట్టు కోసం అహర్నిశలూ శ్రమిస్తా’ అని తొలి వన్డే ముందు మంగళవారం జరిగిన వర్చువల్‌ మీడియా సమావేశంలో చెప్పాడు. 


రోహిత్‌కు అప్పగించాలి: అజర్‌

న్యూఢిల్లీ: టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి కోహ్లీ వైదొలగడంతో.. జట్టు పగ్గాలు ఎవరికి అప్పగిస్తారు? అనే దానిపై అనేక ఊహాగానాలు వినవస్తున్నాయి. అయి తే, నిస్సందేహంగా రోహిత్‌ శర్మకే అని టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజరుద్దీన్‌ చెప్పాడు. ‘అన్ని ఫార్మాట్లలోనూ అతడు నంబర్‌ వన్‌ ప్లేయర్‌ అయినప్పుడు..అభ్యంతరమేంటి? భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులేదు. కానీ, ప్రస్తుత పరిస్థితులను కూడా బేరీజు వేసుకోవాలి. రేపటి గురించి ఆలోచించి.. అనుభవం లేని ఆటగాడికి జట్టు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి’ అని అజర్‌ అన్నాడు. 


2020 తర్వాత దక్షిణాఫ్రికా 

వన్డే సిరీస్‌ను గెలవలేదు.


విదేశీ గడ్డపై జరిగిన వన్డేల్లో ఎక్కువ పరుగులు సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచేందుకు కోహ్లీ మరో 9 పరుగులు చేయాల్సి ఉంది. సచిన్‌ 5065 రన్స్‌తో టాప్‌లో ఉన్నాడు.


వంద వికెట్‌ క్లబ్‌లో చేరేందుకు చాహల్‌ మరో మూడు వికెట్ల దూరంలో ఉన్నాడు. అలాగే దక్షిణాఫ్రికాలో ఎక్కువ వికెట్లు (18) తీసిన భారత బౌలర్‌ అయ్యేందుకు మరో రెండు వికెట్లు చాలు.


బోలాండ్‌ మైదానంలో బౌండరీ లైన్‌ తక్కువ దూరంలో ఉండడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. స్పిన్నర్లకు కూడా సహకరించనుంది. వర్షం నుంచి ఎలాంటి 

అంతరాయం లేదు.


జట్లు (అంచనా)

భారత్‌: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), ధవన్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌/భువనేశ్వర్‌, అశ్విన్‌, బుమ్రా, చాహల్‌.

దక్షిణాఫ్రికా: డికాక్‌, జానెమన్‌ మలన్‌, బవుమా (కెప్టెన్‌), మార్‌క్రమ్‌, డుస్సెన్‌, మిల్లర్‌, ప్రిటోరియస్‌, ఫెలుక్వాయో, జాన్సెన్‌, ఎన్‌గిడి, షంసి.

Updated Date - 2022-01-19T08:45:35+05:30 IST