Abn logo
Sep 27 2021 @ 02:04AM

బెంగళూరుకో విజయం

కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌ అర్ధసెంచరీలు

హర్షల్‌ పటేల్‌ హ్యాట్రిక్‌

ముంబైకి కష్టమే..

దుబాయ్‌: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఎట్టకేలకు యూఏఈ గడ్డ పై గెలుపు రుచి చూసింది. వరుసగా ఇక్కడ ఏడు పరాజయాలు ఎదుర్కొన్న కోహ్లీ సేన.. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌పై 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. హర్షల్‌ పటేల్‌ హ్యాట్రిక్‌ సహా 4 వికెట్లు, చాహల్‌ 3 వికెట్లతో ముంబై వెన్ను విరి చారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (37 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 56), కోహ్లీ (42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51) అర్ధసెంచరీలు సాధించారు. ఛేదనలో ముంబై 18.1 ఓవర్లలో 111 పరుగులు చేసి ఈ లీగ్‌లో తొలిసారి ఆర్‌సీబీ చేతిలో ఆలౌటైంది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మ్యాక్స్‌వెల్‌ నిలిచాడు.


ఆరంభం బాగున్నా..:

ఛేదనలో ముంబై ఇండియన్స్‌ బ్యాటర్స్‌ దారుణంగా తడబడ్డారు. ఓపెనర్లు రోహిత్‌ (43), డికాక్‌ (24) శుభారంభంతో ముంబై ఇన్నింగ్స్‌ సవ్యంగానే సాగుతుందనిపించింది. కానీ ఈ జోడీ నిష్క్రమణతో జట్టు ట్రాక్‌ తప్పింది. పవర్‌ప్లే తర్వాత ఆర్‌సీబీ బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించారు. ముఖ్యంగా చాహల్‌, మ్యాక్స్‌వెల్‌ స్వల్ప విరామాల్లో డికాక్‌, రోహిత్‌, ఇషాన్‌ (9), క్రునాల్‌ (5) వికెట్లను తీయడంతో ముంబై 93/4 స్కోరుతో కష్టాల్లో పడింది.  17వ ఓవర్‌లో పేసర్‌ హర్షల్‌ పటేల్‌ అద్భుత బంతులతో హార్దిక్‌ (3), పొలార్డ్‌ (7), రాహుల్‌ చాహర్‌ (0) వికెట్లతో  హ్యాట్రిక్‌ పూర్తి చేసుకున్నాడు. 


కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌ బాదుడు:

బెంగళూరు ఇన్నింగ్స్‌లో కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌ అర్ధసెంచరీలతో చెలరేగారు. ఫామ్‌లో ఉన్న దేవ్‌దత్‌ (0)ను బుమ్రా రెండో ఓవర్‌లోనే అవుట్‌ చేయగా.. కోహ్లీ-విశాఖ ఆటగాడు శ్రీకర్‌ భరత్‌ (32) సమన్వయంతో ఆడారు. రెండు సిక్సర్లతో భరత్‌ ప్రమాదకరంగా కనిపించినా స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ అతడికి షాక్‌ ఇచ్చి రెండో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని ముగించాడు. అనంతరం మ్యాక్స్‌వెల్‌ స్విచ్‌ హిట్‌, రివర్స్‌ హిట్‌ షాట్లతో చెలరేగాడు. అయితే ఫిఫ్టీ పూర్తి చేసిన కోహ్లీని 16వ ఓవర్‌లో మిల్నే అవుట్‌ చేశాడు. మ్యాక్స్‌, డివిల్లీర్స్‌ (11) క్రీజులో ఉండడంతో జట్టు భారీ స్కోరుపై ఆశ పడింది. 18వ ఓవర్‌లో 6,4,4 బాదిన మ్యాక్స్‌ 33 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 19వ ఓవర్‌లో బుమ్రా వరుస బంతుల్లో ఈ ఇద్దరినీ అవుట్‌ చేశాడు. ఇక ఆఖరి ఓవర్‌లో బౌల్ట్‌ ఓ వికెట్‌తో 3 పరుగులే ఇచ్చాడు.


కోహ్లీ@ 10,000

విరాట్‌ కోహ్లీ టీ20 ఫార్మాట్‌లో పది వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల వద్ద అతడీ మైలురాయికి చేరుకున్నాడు. ఓవరాల్‌గా కోహ్లీ నాలుగో స్థానంలో నిలవగా.. గేల్‌ (14,261), పొలార్డ్‌ (11,195), షోయబ్‌ మాలిక్‌ (10,808) అతడి కంటే ముందున్నారు. 


స్కోరుబోర్డు

బెంగళూరు: కోహ్లీ (సి సబ్‌) అనుకూల్‌ రాయ్‌ (బి) మిల్నే 51; దేవ్‌దత్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 0; భరత్‌ (సి) సూర్యకుమార్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 32; మ్యాక్స్‌వెల్‌ (సి) బౌల్ట్‌ (బి) బుమ్రా 56; డివిల్లీర్స్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 11; క్రిస్టియన్‌ (నాటౌట్‌) 1; షాబాజ్‌ (బి) బౌల్ట్‌ 1; జేమిసన్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 165/6. వికెట్ల పతనం: 1-7, 2-75, 3-126, 4-161, 5-161, 6-162. బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-17-1; బుమ్రా 4-0-36-3; మిల్నే 4-0-48-1; క్రునాల్‌ 4-0-27-0; రాహుల్‌ చాహర్‌ 4-0-33-1.


ముంబై:

రోహిత్‌ శర్మ (సి) దేవ్‌దత్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 43; డికాక్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) చాహల్‌ 24; ఇషాన్‌ కిషన్‌ (సి) పటేల్‌ (బి) చాహల్‌ 9; సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) చాహల్‌ (బి) సిరాజ్‌ 8; క్రునాల్‌ పాండ్యా (బి) మ్యాక్స్‌వెల్‌ 5; పొలార్డ్‌ (బి) హర్షల్‌ 7; హార్దిక్‌ పాండ్యా (సి) కోహ్లీ (బి) హర్షల్‌ 3; మిల్నే (బి) హర్షల్‌ 0; రాహుల్‌ చాహర్‌ (ఎల్బీ) హర్షల్‌ 0; బుమ్రా (బి) చాహల్‌ 5; బౌల్ట్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: 18.1 ఓవర్లలో 111 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-57, 2-79, 3-81, 4-93, 5-97, 6-106, 7-106, 8-106, 9-111, 10-111. బౌలింగ్‌: జేమిసన్‌ 2-0-22-0; సిరాజ్‌ 3-0-15-1; క్రిస్టియన్‌ 2-0-21-0, హర్షల్‌ పటేల్‌ 3.1-0-17-4, చాహల్‌ 4-1-11-3, మ్యాక్స్‌వెల్‌ 4-0-23-2.