అది సమస్య కాబోదు

ABN , First Publish Date - 2021-06-03T06:20:11+05:30 IST

టీమిండియా మరో ప్రతిష్ఠాత్మక పర్యటనకు బయలుదేరింది. ఇంగ్లండ్‌ టూర్‌లో భాగంగా భారత జట్టు తొలుత న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌

అది సమస్య కాబోదు

ఫైనల్‌ సన్నాహకాలపై కోహ్లీ

మైండ్‌సెట్‌ ముఖ్యమంటున్న  కెప్టెన్‌


ముంబై: టీమిండియా మరో ప్రతిష్ఠాత్మక పర్యటనకు బయలుదేరింది. ఇంగ్లండ్‌ టూర్‌లో భాగంగా భారత జట్టు తొలుత న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఈనెల 18న సౌతాంప్టన్‌లో మొదలు కానుంది. కానీ సుదీర్ఘ ఫార్మాట్‌లో రారాజెవరో తేల్చే పోరుకు టీమిండియా పెద్దగా సన్నాహకం లేకుండానే సిద్ధం కావాల్సి వస్తోంది. అయితే ఇది పెద్ద సమస్య కాబోదంటున్న కెప్టెన్‌ కోహ్లీ ‘ఫైనల్‌’కు సమాయత్తం కావడం అనేది మన ఆలోచనా విధానంపై ఆధారపడి ఉందన్నాడు.


ఇంగ్లండ్‌ టూర్‌కు బయలుదేరుతున్న సందర్భంగా విరాట్‌, కోచ్‌ రవిశాస్త్రి బుధవారం ముంబైలో విలేకరులతో వర్చువల్‌గా మాట్లాడారు. ‘గతంలో పక్కా షెడ్యూల్‌ ప్రకారం విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడూ సిరీ్‌సలకు మేం కేవలం మూడు రోజులముందే అక్కడికి అడుగుపెట్టిన సందర్భాలున్నాయి. అందువల్ల ఎలా సన్నద్ధమయ్యామనేది మన ఆలోచనా తీరునుబట్టి ఉంటుంది’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ‘మేం ఇంగ్లండ్‌లో తొలిసారి ఆడడంలేదు. అక్కడి పరిస్థితులు మాకు కొట్టిన పిండి’ అని గుర్తు చేశాడు. కివీ్‌సతో మ్యాచ్‌కు ముందు కేవలం నాలుగు ప్రాక్టీస్‌ సెషన్లే ఉండడం సమస్య కాబోదన్నాడు. ‘సమష్టిగా రాణిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో మాకు తెలుసు. అందునా గతంలో ఇంగ్లండ్‌లో ఆడాం. అందువల్ల పెద్దగా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు లేకపోవడం ఇబ్బంది కాబోదు’ అని కోహ్లీ చెప్పాడు. కాగా..కిందటి ఏడాది న్యూజిలాండ్‌లో టీమిండియా రెండ్‌ టెస్ట్‌ సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. కివీ్‌సలో వాతావరణ పరిస్థితులు కూడా ఇంగ్లండ్‌ను పోలివుండడం గమనార్హం. 


సిరాజ్‌ ఆదిలోనే వారి పనిపడతాడు..

‘న్యూజిలాండ్‌ జట్టులో ఎక్కువగా లెప్ట్‌హ్యాండర్లున్నారు. అందువల్ల రౌండ్‌ ద వికెట్‌ బౌలింగ్‌ చేస్తాం. లాలా సిరాజ్‌ ఆరంభంలోనే వారి పనిపడతాడు’ అని హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సత్తా గురించి సమావేశంలో కోహ్లీ వ్యాఖ్యానించాడు. 

Updated Date - 2021-06-03T06:20:11+05:30 IST