ఆ రోజంటూ వస్తే క్రికెట్‌ నుంచి తప్పుకుంటా: కోహ్లీ

ABN , First Publish Date - 2021-11-09T21:42:21+05:30 IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో నిన్న జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో కోహ్లీసేన అదరగొట్టింది. 9 వికెట్ల

ఆ రోజంటూ వస్తే క్రికెట్‌ నుంచి తప్పుకుంటా: కోహ్లీ

దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో నిన్న జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో కోహ్లీసేన అదరగొట్టింది. 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, విజయం సాధించినా ఎలాంటి ఫలితం లేకపోయినప్పటికీ గెలుపుతో టోర్నీ నుంచి నిష్క్రమించడం అభిమానులకు కొంత ఊరటనిచ్చే విషయం. టీ20 కెప్టెన్‌గా కోహ్లీకి, కోచ్‌గా రవిశాస్త్రికి ఇది చివరి మ్యాచ్ కావడంతో వారికి ఘనంగా వీడ్కోలు లభించింది. 


మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. మీకో విషయం చెప్పాలనుకుంటున్నా అని మొదలుపెట్టిన కోహ్లీ.. జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పాడు. కెప్టెన్‌గా గత ఆరేడేళ్లుగా విపరీతమైన భారం, పని ఒత్తిడి అనుభవించానని చెప్పాడు. పని భారాన్ని తగ్గించుకునేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. ఈ టోర్నీలో బాగా రాణించలేదని తెలుసని పేర్కొన్న కోహ్లీ.. తమ ఆటగాళ్లు మాత్రం అద్భుతంగా రాణించారంటూ ప్రశంసలు కురిపించాడు. తొలి రెండు ఓవర్లలో బాగా ఆడిన జట్టే పైచేయి సాధిస్తుందని, తొలి రెండు మ్యాచుల్లో అలా ఆడకపోవడమే తమ కొంప ముంచిందని అన్నాడు. 


కెప్టెన్సీ నుంచి తప్పుకున్నంత మాత్రాన తన ఆట తీరులో మాత్రం ఏమాత్రం తేడా ఉండదని కోహ్లీ స్పష్టం చేశాడు. అదే జరిగిన రోజు క్రికెట్ ఆడడం మానేస్తానని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, సహాయక సిబ్బందికి కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు.     


Updated Date - 2021-11-09T21:42:21+05:30 IST