కెప్టెన్‌గా ఓకేనా!

ABN , First Publish Date - 2020-12-01T09:30:40+05:30 IST

కరోనాతో అంతర్జాతీయ క్రికెట్‌లో స్తబ్ధత నెలకొన్న నేపథ్యంలో ఆసీస్‌ పర్యటన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సూపర్‌ స్టార్లతో కూడిన జట్లు కావడంతో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతాయనిపించింది.

కెప్టెన్‌గా ఓకేనా!

కోహ్లీకి వరుస పరాజయాల సెగ


ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా విరాట్‌ కోహ్లీ స్థానానికి  తిరుగులేదు. అయితే జట్టును నడిపించే నాయకుడిగా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. దీనికి కారణం.. టీమిండియాకు ఎదురవుతున్న వరుస పరాజయాలే. ఎంతగా అంటే.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఆడిన ఏడు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ భారత్‌ ఓటమిపాలైంది. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమవుతుండడంతో.. పరిమిత ఓవర్ల నుంచి కోహ్లీని తప్పించాలంటూ ఇటీవల డిమాండ్‌ ఊపందుకుంటోంది.


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

కరోనాతో అంతర్జాతీయ క్రికెట్‌లో స్తబ్ధత నెలకొన్న నేపథ్యంలో ఆసీస్‌ పర్యటన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సూపర్‌ స్టార్లతో కూడిన జట్లు కావడంతో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతాయనిపించింది. కానీ ఇప్పటికైతే టీమిండియా ఆటతీరు అంచనాలకు తగ్గట్టు లేదు. అన్ని విభా గాల్లోనూ విఫలమై వరుసగా రెండు పరాజయాలతో మరో మ్యాచ్‌ ఉండ గానే సిరీస్‌ను కోల్పోయింది. దీనికి ముందు కూడా భారత్‌ ఆట గొప్పగా లేదు. విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలోనే ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 0-3తో.. రెండు టెస్టుల సిరీస్‌ను 0-2తో కోల్పో యింది. ఇప్పుడు ఆసీస్‌తో రెండింటిని కలిపితే వరుసగా ఏడు ఓట ములు. భారత క్రికెట్‌ చరిత్రలో వరుసగా ఇన్ని మ్యాచ్‌లు ఓడడం ఇది రెండోసారి మాత్రమే. ఇలా 18 ఏళ్లక్రితం గంగూలీ నేతృత్వంలో (10 మ్యాచ్‌లు) జరగడం గమనార్హం.


విరాట్‌ తప్పిదాలు

తాజా సిరీస్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసే విషయంలో కోహ్లీ పూర్తిగా విఫలమవుతున్నట్టు కనిపిస్తోంది. మైదానంలో అతడు చుక్కాని లేని నావలా ప్రయాణిస్తున్నట్టుంది. బౌలర్లకు తగిన సూచనలిస్తూ, ఫీల్డింగ్‌ను మార్చుతూ తగిన వ్యూహాలు రచిస్తున్నట్టు కనిపించడం లేదు. ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలవాల్సిన అతడిలోనే నిరాశావాదం కనిపిస్తోంది. ఇక తొలి వన్డేలో భారీగా పరుగులు సమర్పించుకున్న పేసర్‌ నవ్‌దీప్‌ సైనీ, స్పిన్నర్‌ చాహల్‌ను తప్పిస్తారని అంతా భావించినా అలా జరగలేదు. తిరిగి రెండో మ్యాచ్‌లోనూ ఈ ఇద్దరి బౌలింగ్‌ను ఆసీస్‌ ఆటాడుకుంది. మరో పేసర్‌ నటరాజన్‌కు అవకాశం విషయంలో కెప్టెన్‌గా సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడని విశ్లేషకుల భావన. అలాగే ఆరంభంలో ఓపెనర్లను అడ్డుకునేందుకు తమ ప్రధాన బౌలర్లను వాడుకునే విషయంలోనూ కోహ్లీకి స్పష్టత లేకుండా పోతోంది. 


బుమ్రాను వాడుకునేది ఇలాగా?

ఆస్ట్రేలియాతో రెండు వన్డేల్లోనూ భారత్‌ ఓడడంతో కెప్టెన్‌ కోహ్లీపై మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ విరుచుకు పడ్డాడు. అతడి నాయకత్వ లోపంతోనే సిరీస్‌ పోయిందని విమర్శించాడు. అలాగే పేసర్‌ బుమ్రాను వాడుకోవడంలో విఫలమయ్యాడన్నాడు. రెండో మ్యాచ్‌లోని రెండవ, నాల్గవ ఓవర్లు వేశాక బుమ్రాకు తిరిగి తొమ్మిదో ఓవర్‌ వరకు బౌలింగ్‌ ఇవ్వలేదు. ఈ రెండు ఓవర్లలో అతను ఏడు పరుగులే ఇచ్చాడు. ‘కోహ్లీ కెప్టెన్సీ అర్థం కావడం లేదు. వన్డే ఫార్మాట్‌లో బౌలర్లకు 4-3-3 ఓవర్ల చొప్పున స్పెల్‌ ఉంటుంది. కానీ తొలి స్పెల్‌లో బుమ్రాతో రెండు ఓవర్లే వేయించాడు. ఒక ప్రధాన బౌలర్‌ను ఇలాగేనా వాడుకునేది? ఇందులో తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన బుమ్రాను ఎదుర్కోవ డంలో ఆసీస్‌ ఓపెనర్లు ఇబ్బంది పడ్డారు. దీన్ని అవకాశంగా తీసుకోవాల్సింది. ఇది టీ20 ఫార్మాట్‌ కాదనే విషయం అతడు గుర్తుంచుకోవాలి’ అని గౌతీ హితవు పలికాడు. మరో వైపు కోహ్లీ కెప్టెన్సీకి హర్భజన్‌ మద్దతుగా నిలిచాడు. అతడు ఎలాంటి ఒత్తిడికీ గురవ డం లేదని, సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడని చెప్పాడు.


రోహిత్‌ బెస్ట్‌..!

పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి కోహ్లీ వైదొలిగి.. రోహిత్‌కు పగ్గాలు అప్పగించాలని అభిమానుల నుంచి కూడా డిమాండ్‌ వినిపిస్తోంది. అటు సోషల్‌ మీడియాలోనూ ఫ్యాన్స్‌ కోహ్లీతో పాటు కోచ్‌ రవిశాస్త్రిని కూడా విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో టీమిండియా విజయాలు సాధించలేదని వాదిస్తున్నారు. వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ బెస్ట్‌ అంటూ ఇప్పటికే ఇంగ్లండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ కూడా అభిప్రాయపడ్డాడు. అలాగే రోహిత్‌ నాయకుడిగా భారత్‌ ఆడిన 10 వన్డేల్లో 8 గెలవగా.. 19 టీ20ల్లో 14 నెగ్గడం విశేషం. ఐపీఎల్‌ ప్రదర్శన ఆధారంగా ఓ ఆటగాడికి టీమిండియాలో చోటు కల్పిస్తున్నప్పుడు.. సారథిగా ఐదు టైటిళ్లను గెలిచిన రోహిత్‌ను వన్డే కెప్టెన్‌ చేయడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. అయితే ఫ్యాన్స్‌ వాదన ఎలా ఉన్నా, కెప్టెన్‌గా ఎవరు బెస్ట్‌ అనే నిర్ణయం సెలెక్టర్లు తీసుకోవాల్సి ఉంటుంది. 

Updated Date - 2020-12-01T09:30:40+05:30 IST