Abn logo
Sep 19 2021 @ 01:00AM

కోల సంబరంలో ప్రమాదం

విద్యుత్‌ షాక్‌తో ఇద్దరి మృతి
కాజులూరు, సెప్టెంబర్‌ 18: నిత్యం గోవిందనామం స్మరిస్తూ కోల సంబరం చేసే కళాకారులు దైవసన్నిధిలోనే అశువులు బాశారు. జనం చూస్తుండగానే ప్రమాదానికి గురై మరణించారు. కళ్లముందే కన్నుమూసిన ఇద్దరిని చూసి తోటి కళాకారులు, అక్కడి భక్తులు కన్నీరుమున్నీరయ్యారు. స్థానికులు, గొల్లపాలెం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాజులూరు మండలం కోలంకలో రామాలయం వద్ద జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి కపిలేశ్వరపురం, రామచంద్రపురం మండలాలకు చెందిన కళాకారుల బృందంతో కోల సంబరం ఏర్పాటు చేశారు. రాత్రి  కళాకారులు భక్తిశ్రద్ధలతో కోలసంబరం ఆడారు. ఈ క్రమంలో నర్తిస్తూ ఉండగా తెల్లవారుజామున పందిరిలో మైక్‌ వైర్ల ద్వారా విద్యుత్‌ ప్రసరించడంతో రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం శివారు బాపనచెరువుకు చెందిన మేడిశెట్టి శ్రీనివాస్‌(51), కపిలేశ్వరపురం మండలం నల్లూరుకు చెందిన వాసంశెట్టి శ్రీనివాస్‌(వెంకన్న)(31) నిస్సహాయంగా కొట్టుకుంటూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో తోటి కళాకారులు, స్థానిక నిర్వాహకులు వెంటనే యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన గొల్లపాలెం ఎస్‌ఐ పవన్‌కుమార్‌ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటనతో కోలంక గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద స్థలం నీటితో తడిచి పోవడంవల్ల ప్రమాద తీవ్రత ఎక్కువైనట్లు పోలీసులు చెబుతున్నారు.