రై..రై.. రైడర్స్‌

ABN , First Publish Date - 2020-10-01T09:40:17+05:30 IST

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ వ్యూహం బెడిసి కొట్టింది. ఐపీఎల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ...

రై..రై.. రైడర్స్‌

లీగ్‌లో వరుసగా మూడో విజయం సాధించాలనుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌కు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) బ్రేకులు వేసింది. 175 పరుగుల ఓ మాదిరి లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచినా.. బౌలర్లు శివమ్‌ మావి, నాగర్‌కోటి అంచనాలకు మించి రాణించడంతో వరుసగా రెండో మ్యాచ్‌ నెగ్గింది. కోల్‌కతా భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం రాయల్స్‌ పూర్తిగా చేతులేత్తేసింది. క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకోవడంతో ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. 


లీగ్‌లో వరుసగా రెండో విజయం

37 పరుగులతో రాయల్స్‌ ఓటమి

గిల్‌ (47)బంతులు: 34 ఫోర్లు : 5 సిక్సర్‌: 1


దుబాయ్‌: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ వ్యూహం బెడిసి కొట్టింది. ఐపీఎల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో 37 పరుగుల తేడాతో చిత్తయింది. శుభ్‌మన్‌ గిల్‌ (34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 47) రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 174/6 స్కోరు చేసింది. మోర్గాన్‌ (34 నాటౌట్‌) ఫర్వాలేదనిపించాడు. ఆర్చర్‌ (2/18) రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో యువ పేసర్లు శివమ్‌ మావి (2/20), నాగర్‌కోటి (2/13) దెబ్బకు రాజస్థాన్‌ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. టామ్‌ కర్రాన్‌ (36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 నాటౌట్‌) అర్ధ శతకం నమోదు చేశాడు. శివమ్‌ మావికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

టప.. టపా..: ఛేదనలో రాజస్థాన్‌ బ్యాటింగ్‌ ఆది నుంచే తడబడింది. రెండో ఓవర్‌లోనే కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (3) వికెట్‌ కోల్పోయింది. కమిన్స్‌ బౌలింగ్‌లో కీపర్‌ కార్తీక్‌ క్యాచ్‌ పట్టడంతో స్మిత్‌ పెవిలియన్‌ చేరాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన సంజూ శాంసన్‌ (8) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. పేసర్‌ శివమ్‌ ఐదో ఓవర్‌ తొలి బంతికే సంజూను క్యాచ్‌ అవుట్‌ చేసి రాయల్స్‌కు షాకిచ్చాడు. అయితే, మరో ఓపెనర్‌ బట్లర్‌ (21), ఊతప్పతో కలసి షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ, శివమ్‌ ఆరో ఓవర్‌ తొలి బంతికే బట్లర్‌ను అవుట్‌ చేసి రాయల్స్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. తర్వాతి ఓవర్‌లో ఊతప్ప (2), రియాన్‌ పరాగ్‌ (1)ను నాగర్‌కోటి పెవిలియన్‌ చేర్చడంతో.. రాజస్థాన్‌ 42/5తో మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకొంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన రాహుల్‌ తెవాటియా (14), టామ్‌ కర్రాన్‌ వికెట్ల పతనాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అయితే, తెవాటియాను బౌల్డ్‌ చేసిన చక్రవర్తి.. ఆరో వికెట్‌కు 24 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. శ్రేయాస్‌ గోపాల్‌ (5)ను నరైన్‌ అవుట్‌ చేశాడు. చక్రవర్తి బౌలింగ్‌లో నాగర్‌కోటి గ్రేట్‌ క్యాచ్‌తో ఆర్చర్‌ (6) పెవిలియన్‌ చేరాడు. ఉనాద్కట్‌ (9) సాయంతో కర్రాన్‌ టీమ్‌ స్కోరును 100 పరుగుల మైలురాయిని దాటించాడు. కుల్దీప్‌ బౌలింగ్‌లో ఉనాద్కట్‌ అవుటయ్యాడు. 19వ ఓవర్‌లో మూడు సిక్స్‌లు బాదిన కర్రాన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

గిల్‌ జోరు..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, సునీల్‌ నరైన్‌ (15) నిలకడైన ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. అయితే, రాజ్‌పుత్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో గిల్‌ సిక్స్‌తో తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. ఐదో ఓవర్‌లో 6,4తో ఎదురుదాడి యత్నం చేసిన నరైన్‌ను  ఉనాద్కట్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. క్రీజులో ఉన్న గిల్‌కు వన్‌డౌన్‌లో వచ్చిన నితీష్‌ రాణా (22) జత కలవడంతో స్కోరుబోర్డు వేగం పుంజుకొంది. రియాన్‌ పరాగ్‌ వేసిన 8వ ఓవర్‌ తొలి బంతినే రాణా సిక్స్‌గా మలచడంతో.. ఈ ఓవర్‌లో 14 పరుగులు లభించాయి. మరోవైపు గిల్‌ కూడా ధాటిగా ఆడుతూ బౌండ్రీలు రాబట్టాడు. అయితే, 10 ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన స్పిన్నర్‌ రాహుల్‌ తెవాటియా.. రాణాను క్యాచ్‌ అవుట్‌ చేసి జట్టుకు బ్రేక్‌ ఇచ్చాడు. గిల్‌-రాణా రెండో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. ఇక, అర్ధ శతకానికి చేరువవుతున్న గిల్‌ను ఆర్చర్‌ క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనక్కిపంపాడు. ఈ దశలో రస్సెల్‌ (14 బంతుల్లో 3 సిక్సర్లతో 24)కు కెప్టెన్‌ కార్తీక్‌ (1) జత కలవడంతో పరుగుల వేగం పెరుగుతుందని భావిం చారు. ఆరంభంలో కొంచెం తడబడినట్టు కనిపించిన రస్సెల్‌.. గోపాల్‌ వేసిన 13వ ఓవర్‌లో రెండు సిక్స్‌లతో బ్యాట్‌కు పని చెప్పాడు. అయితే, కార్తీక్‌ను క్యాచ్‌ అవుట్‌ చేసి ఆర్చర్‌ మరోసారి దెబ్బకొట్టాడు. తర్వాతి ఓవర్‌లో రస్సెల్‌ను రాజ్‌పుత్‌ అవుట్‌ చేయడంతో కోల్‌కతా పరుగుల వేగం మందగించింది. మోర్గాన్‌ (34 నాటౌట్‌), కమిన్స్‌ (12) ఆశించిన రీతిలో షాట్లు ఆడలేకపోయారు. టామ్‌ కర్రాన్‌ బౌలింగ్‌లో సంజూ మంచి క్యాచ్‌ అందుకోవడంతో కమిన్స్‌ పెవిలియన్‌ చేరాడు. ఆఖరి ఓవర్‌లో మోర్గాన్‌ సిక్స్‌ సహా 16 పరుగులు రావడంతో కోల్‌కతా పోటీ ఇవ్వగలిగే స్కోరు చేసింది. 


స్కోరుబోర్డు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: శుభ్‌మన్‌ గిల్‌ (సి అండ్‌ బి) ఆర్చర్‌ 47, సునీల్‌ నరైన్‌ (బి) ఉనాద్కట్‌ 15, నితీష్‌ రాణా (సి) పరాగ్‌ (బి) తెవాటియా 22, రస్సెల్‌ (సి) ఉనాద్కట్‌ (బి) రాజ్‌పుత్‌  24, దినేష్‌ కార్తీక్‌ (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 1, ఇయాన్‌ మోర్గాన్‌ (నాటౌట్‌)  34, ప్యాట్‌ కమిన్స్‌ (సి) సంజూ (బి) కర్రాన్‌ 12, కమలేష్‌ నాగర్‌కోటి (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 174/6; వికెట్ల పతనం: 1-36, 2-82, 3-89, 4-106, 5-115, 6-149; బౌలింగ్‌: జోఫ్రా ఆర్చర్‌ 4-0-18-2, అంకిత్‌ రాజ్‌పుత్‌ 4-0-39-1, ఉనాద్కట్‌ 2-0-14-1, టామ్‌ కర్రాన్‌ 4-0-37-1, శ్రేయాస్‌ గోపాల్‌ 4-0-43-0, రియాన్‌ పరాగ్‌ 1-0-14-0, రాహుల్‌ తెవాటియా 1-0-6-1. 

రాజస్థాన్‌ రాయల్స్‌: జోస్‌ బట్లర్‌ (సి) వరుణ్‌ చక్రవర్తి (బి) శివమ్‌ మావి 21, స్మిత్‌ (సి) కార్తీక్‌ (బి) కమిన్స్‌ 3, సంజూ శాంసన్‌ (సి) నరైన్‌ (బి) శివమ్‌ మావి 8, ఊతప్ప (సి) శివమ్‌ మావి (బి) నాగర్‌కోటి 2, పరాగ్‌ (సి) శుభ్‌మన్‌ గిల్‌ (బి) నాగర్‌కోటి 1, రాహుల్‌ తెవాటియా (బి) వరుణ్‌ చక్రవర్తి 14, టామ్‌ కర్రాన్‌ (నాటౌట్‌) 54, శ్రేయాస్‌ గోపాల్‌ (సి) కార్తీక్‌ (బి) నరైన్‌ 5, ఆర్చర్‌ (సి) నాగర్‌కోటి (బి) వరుణ్‌ చక్రవర్తి 6, ఉనాద్కట్‌ (సి) నాగర్‌కోటి (బి) కుల్దీప్‌ 9, అంకిత్‌ రాజ్‌పుత్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 137/9; వికెట్లపతనం: 1-15, 2-30, 3-39, 4-41, 5-42, 6-66, 7-81, 8-88, 9-106; బౌలింగ్‌: నరైన్‌ 4-0-40-1, కమిన్స్‌ 3-0-13-1, శివమ్‌ మావి 4-0-20-2, కమలేష్‌ నాగర్‌కోటి 2-0-13-2, వరుణ్‌ చక్రవర్తి 4-0-25-2, కుల్దీప్‌ యాదవ్‌ 3-0-20-1. 

Updated Date - 2020-10-01T09:40:17+05:30 IST