కోల్‌కతాకు కష్టమే

ABN , First Publish Date - 2020-10-30T09:25:32+05:30 IST

నాకౌట్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పని సరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు షాక్‌ తగిలింది. ఐపీఎల్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై

కోల్‌కతాకు కష్టమే

ప్లేఆఫ్స్‌ రేస్‌ నుంచి ఇప్పటికే అవుటైన చెన్నై.. పోతూపోతూ కోల్‌కతా ఆశలకు గండికొట్టింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గైక్వాడ్‌ అర్ధ శతకంతో రాణించగా.. ఆఖరి బంతికి జడేజా సిక్స్‌ బాది చెన్నైకు విజయాన్ని అందించాడు. దీంతోకోల్‌కతా నాకౌట్‌ ఆశలు సన్నగిల్లాయి. ఈ  ఫలితంతో  ముంబై ప్లేఆఫ్‌ బెర్త్‌ను ఖరారు చేసుకొంది.   


చెన్నై చేతిలో ఓటమి

సన్నగిల్లిన ప్లే ఆఫ్‌ అవకాశాలు 

రుతురాజ్‌ హాఫ్‌ సెంచరీ

జడేజా మెరుపులు


దుబాయ్‌: నాకౌట్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పని సరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు షాక్‌ తగిలింది. ఐపీఎల్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72) అర్ధ శతకంతోపాటు జడేజా (11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 31 నాటౌట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెన్నై వరుసగా రెండో మ్యాచ్‌ నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 172/5 స్కోరు చేసింది. నితీష్‌ రాణా (61 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 87) హాఫ్‌ సెంచరీ చేశాడు. ఎన్‌గిడి (2/34) రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో చెన్నై ఓవర్లన్నీ ఆడి 4 వికెట్లకు 178 పరుగులు చేసి నెగ్గింది. అంబటి రాయుడు (38) రాణించాడు. వరుణ్‌ చక్రవర్తి (2/20), కమిన్స్‌ (2/31) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. గైక్వాడ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది.  

రుతురాజ్‌ అర్ధ శతకం..: ఛేదనను చెన్నై నెమ్మదిగా ఆరంభించింది. ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌ (14), రుతురాజ్‌ గైక్వాడ్‌ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. దీంతో పవర్‌ప్లేలో చెన్నై 44 పరుగులు మాత్రమే  చేసింది. అయితే, వాట్సన్‌ను అవుట్‌ చేసిన మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి.. కోల్‌కతాకు బ్రేక్‌ ఇచ్చాడు. భారీ షాట్‌ ఆడే క్రమంలో వాట్సన్‌.. రింకూకు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. గైక్వాడ్‌కు అంబటి రాయుడు జత కలవడంతో స్కోరు బోర్డు జోరందుకొంది. రాణా వేసిన 10వ ఓవర్‌లో రాయుడు హ్యాట్రిక్‌ ఫోర్లతో 16 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లో గైక్వాడ్‌ 4,6తో దూకుడు పెంచాడు. నాగర్‌కోటి వేసిన 12వ ఓవర్‌లో డబుల్‌తో గైక్వాడ్‌ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. రాయుడు సిక్స్‌ బాదడంతో టీమ్‌ స్కోరు సెంచరీ మార్క్‌ చేరింది. కమిన్స్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన రాయుడు.. అదే ఓవర్‌లో క్యాచ్‌ అవుటయ్యాడు. గైక్వాడ్‌తో కలసి రాయుడు రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోనీ (1)ని వరుణ్‌ బౌల్డ్‌ చేశాడు. చివరి 18 బంతుల్లో 34 కావాల్సిన సమయంలో.. గైక్వాడ్‌ను కమిన్స్‌ బౌల్డ్‌ చేయడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. అయితే, కర్రాన్‌ (13 నాటౌట్‌), జడేజా క్రీజులో ఉండడంతో చెన్నై మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకోలేదు.

మార్చేసిన జడేజా..:  ఫెర్గూసన్‌ 19వ ఓవర్‌లో జడేజా 4,6,4తో 20 పరుగులు సాధించడంతో.. ఆఖరి ఓవర్‌లో గెలుపునకు 10 పరుగులుగా సమీకరణ మారింది. నాగర్‌కోటి వేసిన చివరి ఓవర్‌లో కొంత ఉత్కంఠ రేగినా.. జడేజా వరుస సిక్స్‌లతో మ్యాచ్‌ను ముగించాడు.  

రాణా ధనాధన్‌..: ఆరంభం ఫర్వాలేదనిపించినా.. మధ్య ఓవర్లలో చెన్నై బౌలర్లు పట్టు బిగించడంతో కోల్‌కతా తక్కువ స్కోరుకే పరిమితమవుతుందా? అనిపించింది. కానీ ఓపెనర్‌ రాణా, దినేష్‌ కార్తీక్‌ (10 బంతుల్లో 3 ఫోర్లతో 21 నాటౌట్‌) బ్యాట్‌లు ఝళిపించడంతో చివరి 5 ఓవర్లలో 66 పరుగులతో పోరాడగలిగే స్కోరు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు.. ఓపెనర్లు గిల్‌ (26), నితీష్‌ రాణా మంచి ఆరంభాన్నే అందించారు. శాంట్నర్‌ వేసిన 6వ ఓవర్‌లో రాణా 4,4,6తో గేర్‌ మార్చడంతో.. పవర్‌ప్లే ముగిసే సరికి నైట్‌ రైడర్స్‌ వికెట్‌ నష్టపోకుండా 48 రన్స్‌ చేసింది. 8వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన కర్ణ్‌ శర్మ (1/35).. గిల్‌ను అవుట్‌ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వన్‌డౌన్‌లో వచ్చిన నరైన్‌ (7)ను శాంట్నర్‌ (1/30) ఊరించే బంతితో క్యాచ్‌ అవుట్‌ చేశాడు. 10 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 70/2 స్కోరు మాత్రమే చేసింది. రింకూ సింగ్‌ (11)ను జడేజా (1/20) అవుట్‌ చేశాడు. ఈ దశలో కెప్టెన్‌ మోర్గాన్‌ (15) క్రీజులోకి రావడంతో రాణా.. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 13వ ఓవర్‌ రెండో బంతికి సింగిల్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకొన్న రాణా.. కర్ణ్‌ 16వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లతో మోత మోగించాడు. రాణా, మోర్గాన్‌ను ఎన్‌గిడి పెవిలియన్‌ చేర్చగా..లోయరార్డర్‌లో కార్తీక్‌ స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ జట్టుకు మెరుగైన స్కోరును అందించాడు. 


స్కోరు బోర్డు

కోల్‌కతా: శుభ్‌మన్‌ గిల్‌ (బి) కర్ణ్‌ శర్మ 26, నితీష్‌ రాణా (సి) కర్రాన్‌ (బి) ఎన్‌గిడి 87, నరైన్‌ (సి) జడేజా (బి) శాంట్నర్‌ 7, రింకూ సింగ్‌ (సి) రాయుడు (బి) జడేజా 11, మోర్గాన్‌ (సి) గైక్వాడ్‌ (బి) ఎన్‌గిడి 15, కార్తీక్‌ (నాటౌట్‌) 21, త్రిపాఠి (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 172/5; వికెట్ల పతనం: 1-53, 2-60, 3-93, 4-137, 5-167; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3-0-31-0, సామ్‌ కర్రాన్‌ 3-0-21-0, లుంగీ ఎన్‌గిడి 4-0-34-2, శాంట్నర్‌ 3-0-30-1, జడేజా 3-0-20-1, కర్ణ్‌ శర్మ 4-0-35-1. 

చెన్నై: వాట్సన్‌ (సి) రింకు (బి) వరుణ్‌ 14, రుతురాజ్‌ గైక్వాడ్‌ (బి) కమిన్స్‌ 72, అంబటి రాయుడు (సి) నరైన్‌ (బి) కమిన్స్‌ 38, ధోనీ (బి) వరుణ్‌ 1, సామ్‌ కర్రాన్‌ (నాటౌట్‌) 13, జడేజా (నాటౌట్‌) 31, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 178/4. వికెట్ల పతనం: 1-50, 2-118, 3-121, 4-140. బౌలింగ్‌: ప్యాట్‌ కమిన్స్‌ 4-0-31-2, నాగర్‌కోటి 3-0-34-0, సునీల్‌ నరైన్‌ 4-0-23-0, ఫెర్గూసన్‌ 4-0-54-0, వరుణ్‌ చక్రవర్తి 4-0-20-2, నితీశ్‌ రాణా 1-0-16-0.

Updated Date - 2020-10-30T09:25:32+05:30 IST