Abn logo
Oct 24 2020 @ 01:12AM

30 ఏళ్ల క్రితమే కొమరం భీమ్‌ సినిమా!

Kaakateeya

చరిత్రలో ఎన్నడూ కలవని వ్యక్తులు.. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌. వీరిద్దరు ఓ చోట కలిసి సాయుధ పోరాటం చేస్తే ఎలా ఉంటుంది? అనే ఊహకు ఫిక్షన్‌ జోడించి దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌ పాత్ర పోషించనున్నారనే విషయం తెలిసిన దగ్గర నుంచి అసలు ఎవరీ కొమరం భీమ్‌ అని గూగుల్‌లో శోధన జరుగుతోంది. అయితే అడవి బిడ్డలకు తప్ప కొమరం భీమ్‌ ఎవరో తెలియని రోజుల్లోనే అంటే 30 ఏళ్ల క్రితమే  ఆయన జీవిత కథ గురించి  ‘కొమరం భీమ్‌’ సినిమా రూపుదిద్దుకొంది. చరిత్రకు అద్దం పడుతూ దర్శకుడు అల్లాణి శ్రీధర్‌ రూపొందించిన ఆ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. 


అసలు ఈ కొమరం భీమ్‌ ఎవరు? 

జల్‌, జమీన్‌, జంగల్‌... అంటే నీళ్లు, భూమి, అడవి. వీటి మీద హక్కు అడవి బిడ్డలదే అని నినదించిన వ్యక్తి కొమరం భీమ్‌. అల్లూరి సీతారామరాజు అందించిన ఉత్తేజంతో తన జాతి కోసం నిజాం ప్రభుత్వంతో పోరాటం చేసిన గోండు వీరుడు ఆయన. 1901లో జన్మించిన కొమరం భీమ్‌ తన 39వ ఏట పోలీసుల ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని వాంకిడి, జోడెఘాట్‌ ప్రాంతాల్లో 1935-40 మధ్య కాలంలో జరిగిన గోండ్ల పోరాటాన్ని కళ్ల ముందు ఉంచింది ‘కొమరం భీమ్‌’ చిత్రం. తొమ్మిదో తరగతి పాఠ్య పుస్తకంలో కొమరం భీమ్‌ గురించి, ఈ సినిమా గురించి ప్రస్థావన ఉంది.


రూ. 16 లక్షల వ్యయంతో రూపుదిద్దుకొన్న ‘కొమరం భీమ్‌’ చిత్రంలో భూపాల్‌, మౌనిక, తెలంగాణ శకుంతల, షరీఫుద్దీన్‌, యాదగిరి తదితరులు నటించారు. ఈ చిత్రంలోని పాటల్ని హీరో భూపాల్‌ స్వరపరచగా, నేపథ్య సంగీతాన్ని అంతర్జాతీయ దర్శకుడు గౌతంఘోష్‌ అందించారు. గోండు వీరుడు కొమరం భీమ్‌ పేరుతో ఓ జిల్లా ఇప్పుడు ఏర్పడింది. చరిత్రకు సంకేతంగా  ట్యాంక్‌ బండ్‌ మీద ఆయన విగ్రహం తలెత్తుకొని ఉంది.

ఇలా మొదలైంది

‘గోండు గిరిజనుల మీద ఓ డాక్యుమెంటరీ తీద్దామన్నది నా తొలి ఆలోచన. ఆ సమయంలో ఆదిలాబాద్‌ ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా సుబ్రహ్మణ్యం ఉండేవారు. ఆయన డాక్యుమెంటరీకి బదులు కొమరం భీమ్‌ గురించి సినిమా తీయమని సూచించారు. రచయిత ప్రాణ్‌రావు గారు చేసిన పరిశోధనలో కొమరం భీమ్‌ జీవితంలో ఎన్నో ఎమోషనల్‌ అంశాలు ఉన్నాయని తేలింది. మేం సినిమా తీసేనాటికి కొమరం భీమ్‌ సతీమణి సోంబాయి జీవించే ఉన్నారు. మా సినిమాకు ఆవిడే తొలి క్లాప్‌ ఇచ్చారు. భీమ్‌ ఎలా ఉండేవారు, ఆయన వ్యక్తిత్వం ఏమిటన్నది ఆవిడ చెప్పిన విషయాల ఆధారంగానే సినిమా రూపొందించాం. కొమరం భీమ్‌ అనుచరుల్లో కొంతమంది అప్పటికి బతికే ఉన్నారు. వారి నుంచి కూడా కొన్ని వివరాలు సేకరించాం. నిజాం ప్రభుత్వ హోం సెక్రటరీ కొమరం భీమ్‌ గురించి రాసిన నివేదిక కాపీ మాకు దొరికింది. అది మాకు ప్రామాణికం అయింది. కొమరం భీమ్‌కు సంబంధించిన ఓ ఊహా చిత్రం ఐటీడీఏ ఆఫీసులో దొరికింది. అది చూడగానే భీమ్‌ పాత్రకు భూపాల్‌ రెడ్డి బాగుంటారనిపించి, ఆయన్ని ఎంపిక చేశాం. ఐదారు నెలలు ఆదిలాబాద్‌ అడవుల్లోనే ఉండి ఈ సినిమా కోసం వర్క్‌ చేశాం. ‘కొమరం భీమ్‌’ చిత్రాన్ని హిందీలో తీయడానికి తాజాగా ప్రయత్నాలు ప్రారంభించాం.

అల్లాణి శ్రీధర్‌, దర్శకుడు


ఆర్‌ఆర్‌ఆర్ టీజర్‌పై విమర్శలు

‘రామరాజు ఫర్‌ భీమ్‌’ అంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సంబంధించి దర్శకుడు రాజమౌళి విడుదల చేసిన టీజర్‌లో ఎన్టీఆర్‌ ముస్లిం గెటప్‌ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. దాని మీద విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిజాం పాలకులకు, రజాకార్లకు వ్యతిరేకంగా కొమరం భీమ్‌ పోరాడాడనీ, అటువంటి వ్యక్తిని టీజర్‌ చివర్లో ముస్లిం గెటప్‌లో చూపించడం ఎంతవరకూ సమంజసమని చరిత్రను అధ్యయనం చేసిన చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం గురించి అల్లాణి శ్రీధర్‌ను అడిగితే ‘నాకూ చాలా మంది ఫోన్‌ చేసి ఈ విషయం అడిగారు. నాకు తెలిసినంతవరకూ అలాంటిదేమీ లేదు. కానీ  ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోనివి ఫిక్షనల్‌ కేరెక్టర్స్‌ కావడంతో అలా చూపించడానికి వేరే  కారణం ఏమన్నా ఉందేమో’ అన్నారు.

Advertisement
Advertisement