బోనమెత్తిన కొమురవెల్లి

ABN , First Publish Date - 2021-01-17T05:30:00+05:30 IST

కోరమీసాల మల్లికార్జునస్వామికి కొమురవెల్లి బోనమెత్తింది. డప్పుచప్పుళ్లు, దరువుల నడుమ శివసత్తుల సిగాలు, పూనకాలు, పోతరాజుల చిందుతో కొమురవెల్లి విజయాచలగుట్టలు హోరెత్తాయి. మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంక్రాంతి పర్వదినం తరువాత వచ్చిన మొదటివారాన్ని పురస్కరించుకుని ఆదివారం పట్నం వారాన్ని భక్తులు ఘనంగా జరుపుకున్నారు.

బోనమెత్తిన కొమురవెల్లి

హోరెత్తిన మల్లన్న పట్నం వారం

మార్మోగిన విజయాచలగుట్టలు

పట్నాలు వేసి మొక్కుల చెల్లింపు

దర్శనానికి బారులు తీరిన భక్తులు

ఎల్లమ్మతల్లికి బోనం నివేదన

బెల్లం పానకం, కల్లు శాఖ సమర్పణ

నేడు హైదరాబాద్‌ యాదవ సంఘం ఆధ్వర్యంలో పట్నం, అగ్నిగుండాలు


చేర్యాల, జనవరి 17 : కోరమీసాల మల్లికార్జునస్వామికి కొమురవెల్లి బోనమెత్తింది. డప్పుచప్పుళ్లు, దరువుల నడుమ శివసత్తుల సిగాలు, పూనకాలు, పోతరాజుల చిందుతో కొమురవెల్లి విజయాచలగుట్టలు హోరెత్తాయి. మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంక్రాంతి పర్వదినం తరువాత వచ్చిన మొదటివారాన్ని పురస్కరించుకుని ఆదివారం పట్నం వారాన్ని భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన సుమారు లక్ష మంది భక్తులు తరలిరావడంతో కొమురవెల్లి జనసంద్రంగా మారింది. శనివారం సాయంత్రం ఽధూళిదర్శనం చేసుకున్న భక్తులు ఆదివారం దండిగా మొక్కులు తీర్చుకున్నారు. భక్తిప్రపత్తులతో బోనాలు తయారుచేసి నైవేద్యాన్ని నివేదించారు. బసచేసిన, ఆలయ గంగరేగుచెట్టు ప్రాంతంలో, ముఖమండపంలో మల్లన్నకు చిలుకపట్నం, నజరు, ముఖమండప పట్నాలు వేసి మొక్కులను చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని చీర, సారెతో ఓడి బియ్యాలు పోశారు. తమ కోరికలు నేరవేర్చమని గంగరేగుచెట్టుకు ముడుపులు కట్టారు. సంతానం కలిగించాలంటూ మహిళలు వ ల్లుబండ వద్ద వరంపట్టారు. స్వామివారి సహోదరి అయిన ఎల్లమ్మతల్లికి బోనాలు నివేదించారు. బెల్లం పానకం, కల్లును సమర్పించి తమ పసుపు, కుంకుమలు చల్లంగా చూడమని వేడుకున్నారు. ఆలయ తోటబావి ప్రాంగణంలో నేడు హైదరాబాద్‌ యాదవ సంఘం ఆధ్వర్యంలో పెద్దపట్నం రచించి అగ్నిగుండాలను దాటనున్నారు. వంటినిండా పసుపు ధరించి భక్తులు పట్నం తొక్కి అగ్నిగుండాలలో చిందేయనున్నారు. 


క్యూలైన్లలో పడిగాపులు

భారీగా భక్తులు హాజరవడంతో కూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. పట్నాల మందిరంలోని క్యూలైన్లూ నిండిపోవడంతో గంటల తరబడిగా భక్తులు పడిగాపులు కాశారు. స్వామివారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పట్టడంతో ఇబ్బందులకు గురయ్యారు. ఆలయ ఈవో బాలాజీ, ఏఈవోలు గంగ శ్రీనివాస్‌, వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్‌ నీల శేఖర్‌, పునరుద్ధరణ కమిటీ సభ్యులు తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ పర్యవేక్షణలో చేర్యాల సీఐ బీంరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 




Updated Date - 2021-01-17T05:30:00+05:30 IST