దిగుబడులు ఘనం... ధర శూన్యం

ABN , First Publish Date - 2022-01-24T05:54:51+05:30 IST

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడులు అనూహ్యంగా పెరగడంతో బహిరంగ మార్కెట్‌లో డిమాండు తగ్గి ధరలు పతనమయ్యాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కొబ్బరి ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కాకపోవడంతో కొబ్బరికాయలను అయినకాడికి విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది.

దిగుబడులు ఘనం... ధర శూన్యం
బండారులంకలో నిల్వ చేసిన పచ్చి కొబ్బరికాయలు

  • పతన స్థితిలో కోనసీమ కొబ్బరి మార్కెట్‌
  • దిగుబడులు పెరిగినా తగ్గిన డిమాండు
  • పచ్చి కొబ్బరికాయ ధర ప్రస్తుతం వెయ్యింటికి రూ.8వేల లోపే
  • ఇతర రాషా్ట్రలకు స్తంభించిన ఎగుమతులు
  • నాఫెడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతుల వినతి

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడులు అనూహ్యంగా పెరగడంతో బహిరంగ మార్కెట్‌లో డిమాండు తగ్గి ధరలు పతనమయ్యాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కొబ్బరి ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కాకపోవడంతో కొబ్బరికాయలను అయినకాడికి విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. నాఫెడ్‌ సంస్థ రైతుల నుంచి కొబ్బరి సరుకును కొనుగోలు చేయడానికి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. వివాహాది శుభ కార్యక్రమాలు, కీలకమైన పండుగలు లేకపోవడంతో పాటు రానున్న మూఢం నేపథ్యంలో కొబ్బరి కాయల వినియోగం తగ్గడం వల్ల మార్కెట్‌ ధరలు పతనమయ్యాయి. పైగా ఏపీలో కొబ్బరి ఉత్పత్తులకు తెగుళ్ల బెడద కూడా ఉండడంతో  కాయ ఎదుగుదల మందగించడం వల్ల ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు స్తంభించిపోయి మార్కెట్‌ తీవ్రంగా దెబ్బతినడంతో కొబ్బరి రైతులకు గత రెండు నెలలుగా కోలుకోలేని నష్టం కలిగింది. 

దేశంలో కేరళ, తమిళనాడు తర్వాత ఆ స్థాయిలో ఏపీలోనే కొబ్బరి ఉత్పత్తులు గణనీయంగా ఉంటాయి. ఈసారి ఈ మూడు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లో కూడా కొబ్బరికాయల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. జిల్లాలో లక్షా 25వేల హెక్టార్లలో కొబ్బరి పంట సాగవుతోంది. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి దిగుబడులు గణనీయంగా పెరగడంతో మార్కెట్‌ ధర పూర్తిగా పతనమైంది. కొబ్బరికాయల దిగుబడి అనూహ్యంగా పెరగడం, వాటికి ప్రజల్లో వినియోగం లేకపోవడంతో కొబ్బరికాయల ధరలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం వెయ్యి పచ్చి కొబ్బరికాయల ధర రూ.7,000 నుంచి రూ.8,000 పలుకుతోంది. కొత్త కొబ్బరి క్వింటాలు రూ.9వేలు, కొత్త కొబ్బరి (రెండో రకం) రూ.8,500, కురిడీ కొబ్బరి (పాత రకం) గండేరా వెయ్యింటికి రూ.13వేలు, గటగట వెయ్యింటికి రూ.12వేలు పలుకుతున్నాయి. కురిడీ కొబ్బరి (కొత్త రకం) గండేరా వెయ్యింటికి రూ.12వేలు, గటగట వెయ్యింటికి రూ.10వేలు ధర ఉంది. నీటికాయ పాతముక్కుడు కాయ వెయ్యింటికి  రూ.8వేలు, కొత్త పచ్చికాయ రూ.7,500 నుంచి రూ.8వేల మధ్య ధర ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిసా లాంటి రాష్ట్రాలకు నిత్యం రెండు వందల లారీల్లో కొబ్బరి ఎగుమతి అయ్యేది. ప్రస్తుతం ఎగుమతులు యాభై లారీలకు మాత్రమే పరిమితమయ్యాయి. గోదావరి జిల్లాల్లోని కొబ్బరికాయలకు తెగుళ్లు సోకడం, ఆశించిన మేర సరుకు దిగుబడి రాకపోవడం, రవాణా చార్జీలు పెరగడం వంటి కారణాలతో ఎగుమతులు లేక స్థానికంగానే వీటిని విక్రయించుకోవాల్సి వస్తోందని అంబాజీపేట ప్రాంతానికి చెందిన కొబ్బరి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా శీతాకాలం కావడంతో కొన్ని రాషా్ట్రల్లో వ్యాపార లావాదేవీలు సక్రమంగా జరగకపోవడం వల్ల  ఎగుమతులు స్తంభించాయని వ్యాపారులు చెప్తున్నారు. దీనికి తోడు తమిళనాడు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కొబ్బరికాయలు వివిధ రాషా్ట్రలకు ఎగుమతి అవుతున్నాయి. సరుకు నాణ్యతతో పాటు రవాణా చార్జీలు తగ్గడం వల్ల ఇతర రాషా్ట్రల వ్యాపారులు తమిళనాడు కొబ్బరివైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం కొబ్బరికాయ మార్కెట్‌ పతన స్థితిలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం నాఫెడ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసి తమ నుంచి కొనుగోలు చేయడానికి చర్యలు చేపట్టాలని కోనసీమ రైతులు కోరుతున్నారు. నాఫెడ్‌ కేంద్రాలు వస్తే కొబ్బరి ధరల పెరుగుదలలో మార్పు ఉంటుందని, దీని  దృష్ట్యా ప్రభుత్వం నాఫెడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. 


Updated Date - 2022-01-24T05:54:51+05:30 IST