కొండ హాం ఫట్‌

ABN , First Publish Date - 2020-09-19T10:14:21+05:30 IST

కొండను కొల్లగొట్టేస్తున్నారు. రాళ్లను పగులగొట్టి.. మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు.

కొండ హాం ఫట్‌

వెనుకవైపు యథేచ్చగా తవ్వకాలు

మట్టి, రాళ్లు తరలించి దందా

చదును చేసి స్థలం కబ్జా

చోద్యం చూస్తున్న అధికారులు


పత్తికొండ, సెప్టెంబరు 18: 

కొండను కొల్లగొట్టేస్తున్నారు. రాళ్లను పగులగొట్టి.. మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. చదును చేసి ఏకంగా కబ్జా చేసేస్తున్నారు. అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది. 


పట్టణ శివారులోని బురుజు గుండ్లు కొండ కనుమరుగు అవుతోంది. సుమారు 59 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండను ఎర్రమట్టి కోసం కొందరు తవ్వేస్తున్నారు. రోజూ వందల ట్రాక్టర్ల మట్టిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే పదెకరాల విస్తీర్ణంలో కొండ కరిగిపోయింది. ట్రాక్టర్‌ మట్టి రూ.600 నుంచి రూ.వెయ్యి వరకూ అమ్ముతున్నారు. కొండ వెనుక ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగుతోంది. రెవెన్యూ యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. 


సొంతంగా దారి వేసి..

పత్తికొండ నుంచి ప్యాపిలికి వెళ్లే రహదారిలో సర్వే నెంబరు 918/1 బి 2లో బురుజుగుండ్లు కొండ 59.19 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రధాన రహదారివైపు పెద్ద పెద్ద బండరాళ్లతో కనిపించే ఈ కొండ వెనుకభాగం గరుసు మట్టితో నిండి ఉంది. దీన్ని కొందరు కొల్లగొడుతున్నారు. మొదట్లో పొలాల రహదారి మీదుగా మట్టిని తరలించారు. ఇప్పుడు కొండ తరిగిపోతుండంతో సొంతంగా దారి వేసుకుని మరీ దందా సాగిస్తున్నారు. మట్టి తవ్వగా బయల్పడిన బండరాళ్లను ముక్కలు చేసి తరలిస్తున్నారు. 


చదును చేసి కబ్జా..

కొండ తవ్వగా ఏర్పడిన సమతల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. మట్టిని, రాళ్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు ఆ ప్రాంతాన్ని చదును చేస్తుండటం గమనార్హం. అధికారపార్టీ కిందిస్థాయి నాయకులు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. వీరి వెనుక ఉన్నది ఎవరో తేలాల్సి ఉంది. మట్టి తవ్వకాల విషయంలో వారి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలిసింది. 


విచారణజరిపిస్తాం.. వెంకటలక్ష్మి, ఇన్‌చార్జి తహసీల్దార్‌  

బురుజుగుండ్లు కొండలో మట్టితవ్వకాలపై ఆర్‌ఐని పంపి విచారణ జరిపిస్తాం. అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. 

Updated Date - 2020-09-19T10:14:21+05:30 IST