Abn logo
Sep 28 2021 @ 04:15AM

కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ ఆస్తి

  • ఆయన సేవలు చిరస్మరణీయం
  • స్పీకర్‌ పోచారం, పలువురు మంత్రుల నివాళి
  • రవీంద్రభారతిలో జయంతి వేడుకలు.. హాజరైన దత్తాత్రేయ 


హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక రాష్ట్రం కోసం నిరంతరం తపించిన స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ ఆస్తి అని పలువురు రాష్ట్ర మంత్రులు కొనియాడారు. తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం, అందించిన సేవలు మరువలేనివని అన్నారు. తెలంగాణ కోసం తపించిన మహానీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. సోమవారం కొండా లక్ష్మణ్‌ బాపూజీ 106వ జయంతి సందర్భంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ఆడిటోరియంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కేటీఆర్‌, తలసాని శ్రీనివాసయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అరణ్య భవన్‌లో మంత్రి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వీర వనిత ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కొండా లక్ష్మణ్‌ బాపూజీ వంటి మహనీయుల గురించి భావితరాలకు తెలిసేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. 


రవీంద్రభారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన బాపూజీ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. 94 ఏళ్ల వయసులోనూ ఢిల్లీలో గడ్డకట్టే చలిలో తెలంగాణ కోసం బాపూజీ చేసిన పోరాటాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని గుర్తు చేసుకున్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో వలస పాలనను వ్యతిరేకిస్తూ 1969లో తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. మలిదశ ఉద్యమంలోనూ ఉద్యమ సారథి సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచి తన ఇంటిని (జలదృశ్యం) ఉద్యమ వేదికగా మలిచి స్ఫూర్తిని అందించారన్నారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ ఆణిముత్యం అని, సహకార రంగంలో ఆయన చేసిన కృషి ఫలితంగా చేతి వృత్తుల వారికి ఎంతో మేలు జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నేత రమణ, బుర్ర వెంకటేశం పాల్గొన్నారు.