హుజురాబాద్‌ ఉపఎన్నిక బరిలో కొండా సురేఖ!

ABN , First Publish Date - 2021-08-15T22:29:45+05:30 IST

హుజురాబాద్‌ ఉపఎన్నిక బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ రంగంలోకి దిగబోతోంది. కొండా సురేఖ పేరును కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసింది

హుజురాబాద్‌ ఉపఎన్నిక బరిలో కొండా సురేఖ!

హైదరాబాద్: హుజురాబాద్‌ ఉపఎన్నిక బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ రంగంలోకి దిగబోతోంది. కొండా సురేఖ పేరును కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసింది. త్వరలో కొండా సురేఖ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. శనివారం పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హుజురాబాద్ అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. సురేఖతో పాటు కవ్వంపల్లి సత్యనారాయణ, కృష్ణారెడ్డి, ప్యాట రమేష్ పేర్లను కాంగ్రెస్ పరిశీలంచింది. అయితే అంతిమంగా సురేఖ పేరును ఆ పార్టీ ఖారారు చేసినట్లు తెలుస్తోంది.


హుజురాబాద్ ఉప ఎన్నిక బీసీ సామాజిక వర్గం చుట్టూ తిరుగుతోంది. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బీసీ కార్డును ఉపయోగిస్తున్నారు. అయితే ఈటల సగం బీసీ, సగం ఓసీ అంటూ టీఆర్‌ఎస్ ప్రచారం చేసింది. టీఆర్‌ఎస్ ఇలా ప్రచారం చేయడమే కాకుండా బీసీ సామాజికవర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను హుజురాబాద్ నుంచి బరిలోకి దింపుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్ క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు జిల్లాలో విద్యార్థి నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అటు దళిత బంధు పథకంతో ఆ వర్గం ఓట్లను.. ఇటు గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా బీసీల ఓట్లను తన ఖాతాలో వేసుకోవాలని టీఆర్‌ఎస్‌ ఆశ పెట్టుకుంది.


ఇక సురేఖను పోటీలో నిలబెట్టడానికి కాంగ్రెస్‌కు ఓ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలా అంటే సురేఖ భర్త కొండా మురళీది మున్నూరు కాపు సామాజిక వర్గం కాగా, సురేఖది పద్మశాలి సామాజిక వర్గం. ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన వాళ్లు కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తారని అంచనాతో ఉంది. ఇక తెలంగాణ అవిర్భావం తర్వాత వచ్చిన ఎన్నికలేవి కాంగ్రెస్‌కు కలిసి రాలేదు. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను కూడా ఆ పార్టీ కోల్పోయింది. ఆ ఓటములన్నీ అప్పటి పీసీసీ అధ్యక్షుడి ఖాతాలో పడిపోయాయి. అయితే ఇప్పుడు టీపీసీసీకి కొత్త టీం వచ్చింది. ఈ టీంకు హుజురాబాద్ ఉప ఎన్నిక ఛాలెంజ్‌గా మారింది. దీంతో ఆచితూచి సురేఖను బరిలోకి దింపాలని కాంగ్రెస్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-08-15T22:29:45+05:30 IST