కొండంత ఆశయం..

ABN , First Publish Date - 2020-07-12T20:14:24+05:30 IST

‘ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా.. గోవింద..’ ఆ నామస్మరణ వింటే ఆయన తనువు పులకించిపోతుంది.

కొండంత ఆశయం..

‘ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా.. గోవింద..’ ఆ నామస్మరణ వింటే ఆయన తనువు పులకించిపోతుంది. మెట్టు మెట్టుకూ కొత్త శక్తి వస్తుంది. లేకపోతే 258 సార్లు కాలినడకన తిరుమల కొండ ఎక్కేవాడు కాదు.  శ్రీకాకుళంలోని గుడివీధికి చెందిన మహంతి శ్రీనివాసరావు వెంకటేశ్వరస్వామి భక్తుడు. ఆయుర్వేద దుకాణం నడుపుతున్నాడు. 1996లో తొలిసారి కాలినడకన కొండమీదికెళ్లి స్వామి దర్శనం చేసుకున్నాడు. 2017 వచ్చేసరికి ఆయన వయస్సు యాభై ఏళ్లు. అదే ఏడాదిలో తన వయసుకు తగ్గట్టు 50 సార్లు కాలినడకన తిరుమలకు వెళ్లాడు. ‘నేను రికార్డుల కోసం ఈ పని చేయలేదు. భక్తిభావంతోనే చేశాను. ఈ వయసులో ఎలా మెట్లు ఎక్కుతున్నావు? అనడుగుతుంటారు. సంకల్పబలం ఉంటే సాధ్యం కానిది ఏమీ లేదు..’ అంటాడాయన చిరునవ్వుతో. 2018లో ఏకంగా 71 సార్లు కాలినడకన వెళ్లాడు. అప్పటి నుంచి ఈ రెండు మూడేళ్లలోనే పలుమార్లు తిరుమల వెళ్లినట్లు చెప్పారాయన. ఈ ఏడాది జనవరి నాటికి 258 సార్లు తిరుమల కొండ ఎక్కాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్లు ఒక గుర్తింపు పత్రాన్ని ఇచ్చారు. ఏసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులోకీ తన పేరు చేరింది. ‘ఈ మొత్తం ప్రయాణంలో.. నా భార్య సరస్వతితో కలిసి 53 సార్లు కొండపైకి నడిచి వెళ్లాను. తిరుమల యాత్ర నా జీవితంలో మరపురాని జ్ఞాపకం’ అన్నారు శ్రీనివాసరావు.

- తాతపూడి సురేష్‌బాబు, స్టాప్‌రిపోర్టర్‌, శ్రీకాకుళం


Updated Date - 2020-07-12T20:14:24+05:30 IST