కొండంత నష్టం.. గోరంత సాయం!

ABN , First Publish Date - 2021-12-09T04:52:38+05:30 IST

ఇటీవల భారీ వర్షాలకు తోడు పెన్నా, స్వర్ణముఖి, కాళంగి నదులు వరద నీటితో ఉప్పొంగడంతో పొర్లుకట్టలు తెగాయి.

కొండంత నష్టం..  గోరంత సాయం!
పెన్నానది వరదకు సంగం పొలాల్లో ఇసుక మేటలు

పోటెత్తిన వరదతో అన్నదాతకు కష్టాలు

పచ్చని పొలాల్లో ఇసుక మేటలు

కోతకు గురైనా కయ్యలు

కంటి తుడుపుగా ప్రభుత్వ సాయం

అన్నదాతల పెదవివిరుపు


ఈ రైతు పేరు మెట్టుకూరు పాపిరెడ్డి. సంగంవాసి. పెన్నా నది ఒడ్డున 3 ఎకరాల పట్టా పొలాలు ఉన్నాయి. బోర్ల కింద వరి సాగు చేస్తారు. అయితే గత నెలలో  నదిలో వరద పోట్టెత్తడంతో మూడు ఎకరాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇసుక మేటలు తొలగించాలంటే మూడు ఎకరాల్లో సుమారు రూ.75 వేలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన సాయం ఎందుకు చాలదని నిరుత్సాహం వ్యక్తం వ్యక్తం చేశారు. 


సంగం, డిసెంబరు 8: ఇటీవల భారీ వర్షాలకు తోడు పెన్నా, స్వర్ణముఖి, కాళంగి నదులు వరద నీటితో ఉప్పొంగడంతో పొర్లుకట్టలు తెగాయి. దీంతో నది పరివాహక గ్రామాల్లోని పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. కొన్ని పొలాలు కోతకు గురయ్యాయి. ఈ ఇసుక మేటలు తొలగించేందుకు హెక్టారుకు రూ.50-60 వేల వరకు ఖర్చువుతుంది. కోతకు గురైన పొలాలను సాధారణ స్థితి తీసుకువచ్చేందుకు రూ.75 వేల పైమాటేనని రైతులు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన సాయం ఇసుక మేటలకు హెక్టారు రూ.12,200, కోతకు గురైన పొలాలకు రూ.37,500. ఈ సాయం కంటితుడుపేనని రైతులు ఆరోపిస్తున్నారు.


12 మండలాల్లో నష్టం


వరదతో పెన్నానది, స్వర్ణముఖి, కాళంగి నది పరివాహక ప్రాంతాల్లోని 12 మండలాల్లో 115 గ్రామాల్లో సారవంతమైన సుమారు 1404.8 హెక్టార్లలో ఇసుక మేటలు, 530.8 హెక్టార్లలో కోతకు గురైనట్లు వ్యవసాయశాఖ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. అందులో భాగంగా సంగం మండలంలో 71.12 హెక్టార్లలో ఇసుక మేటలు, 29.12 హెక్టార్లలో కోతకు గురైనట్లు అధికారులు తేల్చారు. నాట్లు వేసిన పొలాల్లోనూ ఇసుక మేటలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వరదలు తగ్గాయి. పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలు తొలగించడానికి హెక్టారుకు సుమారు రూ. 50 వేల నుంచి 60 వేల పైమాటే ఖర్చువుతుంది. అదే కోతకు గురైన పొలాలను సాధారణ స్థితికి తీసుకురావడాని సుమారు రూ.75 వేలకు పైగా ఖర్చు అయ్యేలా ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇసుక మేటలు తొలగించలేక రైతులు ఈ ఏడాది చేతులెత్తేశారు.


ప్రభుత్వ సాయం కంటితుడుపే


పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలు, కోతకు గురైన పొలాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రకటించిన సాయం కంటితుడుపేనని రైతులు ఆరోపిస్తున్నారు. ఇసుక మేటలు ఏర్పడిన పొలాలకు హెక్టారుకు రూ.12,200, కోతకు గురైన పొలాలకు హెక్టారుకు రూ.37,500 చొప్పున పరిహారం సాయం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సాయంపై అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ సాయంతో కేవలం అర ఎకరా కూడా బాగు చేయలేమని పేర్కొంటున్నారు. హెక్టారుకు కనీసం రూ.50 వేలు అయినా ఇవ్వాలని అన్నదాతలు కోరుతున్నారు.


సాయం పెంచాలి


ఇసుక మేటలు, కోతకు గురైన పొలాలు బాగు చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన సాయం ఎందుకూ చాలదు. ఇసుక మేటలు తొలగించేందుకు హెక్టారుకు రూ. 50 వేల నుంచి 60 వేల వరకు ఖర్చు అవుతుంది. అదే కోతకు గురైన పొలాలను సాధారణ స్థితికి తీసుకువచ్చి సాగు చేయాలంటే హెక్టారుకు రూ.75 వేల పైమాటే అవుతుంది. అంతేగాక బాగు చేయాలన్నా చాలా రోజులుపడుతుంది. దీంతో ఈ ఏడాది పొలాలు బీడే. పంట వేయలేరు. కాబట్టి ప్రభుత్వం సాయం పెంచి రైతులను ఆదుకోవాలి.

- ఫణీంద్రరెడ్డి, సంగం

Updated Date - 2021-12-09T04:52:38+05:30 IST