కొండాపూర్‌ పీహెచ్‌సీ ఉత్తమం

ABN , First Publish Date - 2020-09-25T06:08:08+05:30 IST

2019-20 సంవత్సరానికి గాను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ కాయకల్ప అవార్డులను

కొండాపూర్‌ పీహెచ్‌సీ ఉత్తమం

కాయకల్ప అవార్డులను ప్రకటించిన కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌

బెస్ట్‌ యూపీహెచ్‌సీగా ఆర్సీపురం

జహీరాబాద్‌, సదాశివపేట, గజ్వేల్‌ ఆస్పత్రులకు ప్రశంసా అవార్డులు


సంగారెడ్డి అర్బన్‌/గజ్వేల్‌, సెప్టెంబరు 24 : 2019-20 సంవత్సరానికి గాను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ కాయకల్ప అవార్డులను ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ కేంద్రం ఉత్తమ పీహెచ్‌సీగా ఎంపికైంది. అదే విధంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధుల్లో ఆర్‌సీపురం ఉత్తమ యూపీహెచ్‌సీగా నిలిచింది. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌ ఏరియా ఆస్పత్రి, సదాశివపేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ), సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌ ఏరియా ఆస్పత్రికి ప్రశంసా అవార్డులు దక్కాయి. అదేవిధంగా 24 గంటల పీహెచ్‌సీల పరిధుల్లో  సంగారెడ్డి జిల్లాలోని ఆత్మకూర్‌, మునిపల్లి, కంగ్టి, న్యాల్‌కల్‌, ఝరాసంగం, మనూర్‌ ఆరోగ్య కేంద్రాలకు ప్రశంసా అవార్డులు దక్కాయి.  12 గంటల పీహెచ్‌సీల పరిధుల్లో మొగుడంపల్లి, తుర్కపల్లి, బొల్లారం ఆరోగ్య కేంద్రాలను ప్రశంసా అవార్డులు వరించాయి. అదేవిధంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధుల్లో సంగారెడ్డిలోని మార్క్స్‌నగర్‌, ఇంద్రనగర్‌తో పాటు పటాన్‌చెరు యూపీహెచ్‌సీలు ప్రశంసా అవార్డులను సొంతం చేసుకున్నాయని నాణ్యతా ప్రమాణాల అధికారి చింతల రవి తెలిపారు.


ఆస్పత్రులకు నగదు పురస్కారం 

కాయకల్ప అవార్డు సొంతం చేసుకున్న ఆస్పత్రులకు నగదు పురస్కారం లభించనుంది. ఉత్తమ పీహెచ్‌సీ,   యూపీహెచ్‌సీగా ఎంపికైన కొండాపూర్‌,  ఆర్‌సీపురం ఆరోగ్య కేంద్రాలకు రూ.2 లక్షలు చొప్పున అందజేయనున్నారు. ప్రశంసా అవార్డులకు ఎంపికైన జహీరాబాద్‌ ఏరియా ఆస్పత్రి, సదాశివపేట కమ్యూనిటి హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ), గజ్వేల్‌ ఏరియా ఆస్పత్రులకు రూ.లక్ష చొప్పున క్యాష్‌ లభించనుంది. అలాగే ప్రశంసా అవార్డు కింద ఎంపికైన తొమ్మిది పీహెచ్‌సీలకు రూ.50 వేల చొప్పున నగదు పురస్కారం దక్కనుంది. ఉత్తమ యూపీహెచ్‌సీగా ఎంపికైన ఆర్‌సీపురానికి రూ.2 లక్షలు, ప్రశంస అవార్డు కింద ఎంపికైన మిగిలిన మూడు యూపీహెచ్‌సీలకు రూ.50 వేల చొప్పున అందజేయనున్నారు. అయితే వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రికి కాయకల్ప అవార్డు దక్కలేదు. గతంలో వరుస అవార్డుల పరంపర కొనసాగిన జిల్లా ఆస్పత్రి ఈసారి కనీసం ప్రశంసలను కూడా అందుకోలేకపోయింది.

Updated Date - 2020-09-25T06:08:08+05:30 IST