నూతన ‘రవి’సారథి

ABN , First Publish Date - 2020-09-28T21:00:25+05:30 IST

శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆమదాలవలస..

నూతన ‘రవి’సారథి

శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడిగా కూన రవికుమార్‌

ప్రకటించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు

విజయనగరానికి కిమిడి నాగార్జున, అరకుకు గుమ్మిడి సంధ్యారాణి

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నియామకం

తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జోష్‌


శ్రీకాకుళం(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ నియమితులయ్యారు. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదివారం రవికుమార్‌ పేరును ప్రకటించారు. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున, అరకు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా గుమ్మిడి సంధ్యారాణిలను నియమించారు. జిల్లాలో పది నియోజకవర్గాలున్నాయి. శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానం పరిధిలోకి వస్తాయి.


ఈ నియోజకవర్గాలకు సంబంధించి అధ్యక్షుడిగా కూన రవికుమార్‌ వ్యవహరించనున్నారు. విజయనగరం పార్లమెంట్‌ స్థానం పరిధిలో ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలున్నాయి. వీటికి సంబంధించి కిమిడి నాగార్జున అధ్యక్షుడు. అలాగే అరకు పార్లమెంట్‌ స్థానంలో పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో గుమ్మిడి సంధ్యారాణి అధ్యక్షురాలిగా వ్యవహరించనున్నారు. ప్రభుత్వం పార్లమెంట్‌ స్థానాల ప్రాతిపదికగా చేసుకొని కొత్త జిల్లాలు ప్రకటించనున్న నేపథ్యంలో టీడీపీ కొత్తగా అధ్యక్ష నియామకాలు చేపట్టింది. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో సీనియార్టీతో పాటు యువత, మహిళలకు ప్రాధాన్యమివ్వనున్నట్టు అధిష్టానం ప్రకటించింది. అందుకు తగ్గట్టుగా కూన రవికుమార్‌, కిమిడి నాగార్జున, గుమ్మిడి సంధ్యారాణిలను అధ్యక్షురాలిగా నియమించడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 


యువ నాయకత్వానికి పట్టం

విజయనగరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున గడిచిన ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఓటమి చవిచూసినా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వం విధానాలను ఎండగడుతూ వచ్చారు. ఆయన మాజీ మంత్రి కిమిడి మృణాళిని తనయుడు. కిమిడి కుటుంబానికి రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. నాగార్జున నియామకంతో ఆ రెండు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతమవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


మహిళా నేతకు గుర్తింపు

అరకు పార్లమెంటరీ అధ్యక్షురాలిగా నియమితులైన గుమ్మిడి సంధ్యారాణి సీనియర్‌ నాయకురాలు. ఎమ్మెల్సీగా ఉన్న ఆమె మండలిలో ఉపనేతగా కూడా బాధ్యతలు చేపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో ముందంజలో ఉంటారు. గడిచిన ఎన్నికల్లో అరకు పార్లమెంట్‌ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిచెందారు. అందర్నీ కలుపుకుపోతారన్న పేరు ఉంది. అందుకే అధిష్ఠానం ఆమెను అధ్యక్షురాలిగా నియమించింది. పాలకొండ అసెంబ్లీ స్థానంలో నేతలను ఏకతాటికి తీసుకొచ్చి గెలుపునకు దోహదపడతారని శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 


పోరాట పటిమను గుర్తించిన అధిష్ఠానం

టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి శ్రీకాకుళం కంచుకోట. కానీ గడిచిన ఎన్నికల్లో పది నియోజకవర్గాలకుగాను...టెక్కలి, ఇచ్ఛాపురంలో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌, శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్‌నాయుడు గెలుపొందారు. జిల్లాలో మిగతా ఎనిమిది చోట్ల ఓటమి చవిచూశారు. ఈ పరిస్థితుల్లో టీడీపీలో నిస్తేజం అలుముకుంది. పార్టీలో యువరక్తాన్ని ఎక్కించడం ద్వారా పూర్వవైభవానికి తీసుకురావాలని అధిష్ఠానం భావించింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా చురుకైన నేతలను పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులుగా, జిల్లాల ఇన్‌చార్జిలుగా చంద్రబాబు ఎంపిక చేశారు. అందులో భాగంగానే శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడిగా రవికుమార్‌ను ఖరారు చేశారు. 2014 ఎన్నికల్లో ఆమదాలవలస నియోజకవర్గం నుంచి రవికుమార్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.


అటు తరువాత ప్రభుత్వ విప్‌గా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. పార్టీతో పాటు ప్రభుత్వ విధానాలపై స్పష్టంగా మాట్లాడేవారు. 2019 ఎన్నికల తరువాత పార్టీ ఓటమి చవిచూసినా..అధికార వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసు కేసులు సైతం నమోదయ్యాయి. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలపై నిరసన గళం వినిపించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం రవికుమార్‌ను పార్లమెంటరీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. 


పార్టీ బలోపేతానికి కృషి

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తా. అధిష్ఠానం నమ్మకాన్ని వమ్ము చేయకుం డా పనిచేస్తా. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధుల సహకారంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతా. స్థానిక సంస్థలతో పాటు సాధారణ ఎన్నికల్లో గెలుపునకు ప్రణాళిక రూపొందిస్తాం. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్‌కు కృతజ్ఞతలు.

-కూన రవికుమార్‌, శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు


కోఆర్డినేటర్‌గా గణబాబు

శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గాల కోఆర్డినేటర్‌గా సీనియర్‌ నాయకుడు, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబాబును నియమించారు. పార్టీ నాయకులను సమన్వ యం చేసే బాధ్యతలను అధిష్ఠానం ఆయనకు అప్పగించింది.




Updated Date - 2020-09-28T21:00:25+05:30 IST