పాపా.. నిను ఒక్కసారి చూడాలమ్మా!

ABN , First Publish Date - 2020-02-14T08:16:07+05:30 IST

ఎప్పుడో మూడేళ్ల క్రితం చనిపోయిన కూతురు! బిడ్డనే తలచుకుంటూ తల్లడిల్లుతున్న తల్లి!! శాశ్వతంగా దూరమైందనుకున్న ఆ పాప.. ఒకరోజు ఆ తల్లి కంటిముందుకు వచ్చి మాట్లాడింది. ఆడింది. ‘అమ్మా నిన్ను మిస్సవుతున్నా’ అని చెప్పింది!!

పాపా.. నిను ఒక్కసారి చూడాలమ్మా!

చనిపోయిన కుమార్తెను వర్చువల్‌గా కలిసిన తల్లి

ప్రపంచం కంటతడి పెట్టించిన కొరియన్‌ టీవీ షో.. 

ఎవరికైనా అలా తమవారిని కలుసుకునే అవకాశం

వర్చువల్‌ రియాలిటీ పరిజ్ఞానంతో సాధ్యం.. 

నైతికంగా అది తప్పంటున్న కొందరు వైద్యులు


ఎప్పుడో మూడేళ్ల క్రితం చనిపోయిన కూతురు! బిడ్డనే తలచుకుంటూ తల్లడిల్లుతున్న తల్లి!! శాశ్వతంగా దూరమైందనుకున్న  ఆ పాప.. ఒకరోజు ఆ తల్లి కంటిముందుకు వచ్చి మాట్లాడింది. ఆడింది. ‘అమ్మా నిన్ను మిస్సవుతున్నా’ అని చెప్పింది!! ఎప్పుడో దూరమైన కూతుర్ని అలా చూసిన ఆ తల్లి ఆనందం వర్ణనాతీతం. చూడగానే ఏడ్చింది. కళ్ల వెంట నీరు కారిపోతుండగా పాప చేతిని పట్టుకుంది. తనివితీరా తడిమి చూసుకుంది. ఇదేదో సైన్స్‌ ఫిక్షన్‌ సినిమానో.. ఫాంటసీ కథలో దృశ్యమో కాదు! టెక్నాలజీ సాధ్యం చేసిన అద్భుతం.


అమ్మ కలలకే పరిమితమైన ఓ కూతురిని.. ‘వర్చువల్‌’గా కంటి ముందు నిలిపింది!!  ‘మీటింగ్‌ యు’ పేరుతో కొరియాకు చెందిన ఒక టీవీ చానల్‌ ప్రసారం చేసిన ఈ డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘వర్చువల్‌ రియాలిటీ’ టెక్నాలజీతో వారు ఆ తల్లీబిడ్డలను కలపగలిగారు. కొరియాకు చెందిన జాంగ్‌ జి సంగ్‌ అనే మహిళకు నేయోన్‌ అనే కుమార్తె ఉండేది. ఏడేళ్ల వయసులో (2016లో) ఆ పాప అంతుపట్టని వ్యాధితో చనిపోయింది. అప్పట్నుంచీ ఆ తల్లి కుమార్తె జ్ఞాపకాలతోనే కుమిలిపోతోంది. ఈ క్రమంలో... కొరియాకు చెందిన ఎంబీసీ అనే చానల్‌ ‘మీటింగ్‌ యు’ అనే కార్యక్రమంలో భాగంగా ఆ తల్లిని తన కూతురితో కలిపే పనికి శ్రీకారం చుట్టింది. జాంగ్‌ జి సంగ్‌ తలకు వర్చువల్‌ రియాలిటీ హెడ్‌ సెట్‌, కూతురి డిజిటల్‌ అవతార్‌ స్పర్శ తెలిసేలా ఆమె చేతులకు ‘టచ్‌ సెన్సిటివ్‌ గ్లవ్స్‌’ అమర్చారు. ఆ హెడ్‌సెట్‌ తగిలించుకోగానే సంగ్‌ కళ్ల ముందు ఒక (డిజిటల్‌) ఉద్యానవనం ప్రత్యక్షమైంది. అక్కడ.. ఊదా రంగు గౌను ధరించి మెరిసే కళ్లతో చూస్తున్న కూతురు కనపడిందామెకు.


‘ఇన్ని రోజులూ ఎక్కడున్నావమ్మా? నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా’ అని చిన్నారి నేయోన్‌ ముద్దుముద్దుగా అడిగింది. ‘నీ గురించి ఆలోచించని క్షణం లేదమ్మా’ అని తల్లి సమాధానమిచ్చింది. దానికా పాప కూడా.. ‘నేను కూడా అమ్మమీద బెంగ పడ్డాను’ అని చెప్పింది. ఎప్పుడో చనిపోయిన కూతురి డిజిటల్‌ అవతార్‌ కళ్ల ముందు కనిపిస్తుంటే.. సంగ్‌ తాకడానికి సంశయించింది. చివరికి పాప చెప్పగా చెప్పగా.. కన్నీటితో ఆ చిన్నారి చేతిని పట్టుకుంది. ‘‘చూశావా అమ్మా.. నాకిక్కడ ఏ బాధా లేదు’’ అని చెప్పిందా చిన్నారి. తర్వాత సంగ్‌ తన పాప పుట్టినరోజు వేడుకలు జరిపింది. ఇద్దరూ కలిసి ఆడుకున్నారు. చివరికి.. తాను అలసిపోయానంటూ అమ్మకు గుడ్‌బై చెప్పి పడుకుంది. తర్వాత అందమైన సీతాకోకచిలుకగా మారిపోయింది. దాదాపు 8 నిమిషాల పాటు సాగిన ఈ షోను అక్కడే ఉన్న సంగ్‌ భర్త, ఇద్దరు పిల్లలు చూశారు. వారు కూడా సంగ్‌ భావోద్వేగాలను చూసి కంటతడి పెట్టారు. అయినవారిని కోల్పోయి బాధపడుతున్నవారికి సాయం చేసేందుకే తాను ఈ డాక్యుమెంటరీలో పాల్గొనేందుకు ఒప్పుకొన్నానని సంగ్‌ తెలిపారు. మరోసారి ఇలాంటి అవకాశం వస్తే తన కూతురిని ఇంకా ఆనందంగా కలుస్తానన్నారు. ఇది కొరియన్‌ టీవీకి మాత్రమే పరిమితమైన కార్యక్రమం కాదు. ఆప్తులను కోల్పోయినవారెవరైనా ఈ టెక్నాలజీ సాయంతో కలిసే అవకాశం ఉంది. అయితే.. కొందరు వైద్యులు మాత్రం ఇలా చనిపోయినవారి డిజిటల్‌ అవతార్‌లను సృష్టించడంవల్ల నైతిక సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి మంచివి కాదని హెచ్చరిస్తున్నారు.

- సియోల్‌


(వీడియో.. ఏబీసీ న్యూస్ ఆస్ట్రేలియా సౌజన్యంతో)

Updated Date - 2020-02-14T08:16:07+05:30 IST