ఆంక్షలపై అయోమయం

ABN , First Publish Date - 2021-04-23T05:20:47+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి, కేసులు నమోదు ఉధృతంగానే కొనసాగుతుండగా నియంత్రణ కోసం ప్రతిపాదిస్తున్న ఆంక్షల అమలుపై అయోమయ పరిస్థితి కొనసాగుతోంది. కొన్నిచోట్ల కేసులు ఉధృతంతో స్థానికంగా ఆంక్షలు అమలుచేయగా మరికొన్నిచోట్ల కూడా అమలుకు అధికారులు దృష్టిపెట్టారు.

ఆంక్షలపై అయోమయం
యథేచ్ఛగా తిరుగుతున్న వాహనదారులు

నియంత్రణ తప్ప లాక్‌డౌన్‌ ఉండదన్న కలెక్టర్‌

నేడు వివిధ వర్గాలతో సమావేశం, తర్వాత నిర్ణయం

నియంత్రణ చర్యలపై టాస్క్‌పోర్స్‌ కమిటీ భేటీ

విపత్తుల చట్టం అమలుకు నిర్ణయం

ఒంగోలు, ఏప్రిల్‌ 22 (అంధ్రజ్యోతి) :



కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతి నేపథ్యంలో ఉన్నతాధికారుల ప్రకటనలు  అయోమయానికి గురిచేస్తున్నాయి. రోజుకోక తీరుగా మాటలు ఉండటంతో జనం ఆశ్చర్యానికి గురవుతున్నారు. జిల్లాలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రతిపాదిస్తున్న ఆంక్షల అమలుపై అనిశ్చితి కొనసాగుతోంది.  కలెక్టర్‌ బుధవారం మాట్లాడుతూ పాజిటివ్‌ కేసులు ఽఅధికంగా ఉన్న ప్రాంతాల్లో త్వరలో కఠిన ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలిపారు.  కొందరు అధికారులైతే వెంటనే అమలుచేయబోతున్నట్లు ప్రకటించారు కూడా. అయితే గురువారం నియంత్రణ తప్ప లాక్‌డౌన్‌, కర్ఫ్యూ వంటి తీవ్ర నిర్ణయాలు ఉండబోవని కలెక్టరే తెలపడంతో చివరకు అధికారులకే స్పష్టత కరువైంది. కొన్నిచోట్ల కేసులు ఉధృతంతో స్థానికంగా ఆంక్షలు అమలు కొనసాగుతుండగా మరికొన్నిచోట్ల కూడా అమలుకు అధికారులు దృష్టిపెట్టారు. అదేసమయంలో గురువారం జేసీ అధ్యక్షతన టాస్క్‌పోర్స్‌ కమిటీ సమావేశమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే కలెక్టర్‌ ప్రకటనల నేపథ్యంలో ఆంక్షల అమలు ఆదేశాలు కోసం స్థానిక అధికారులు వేచిచూస్తున్నారు.

 జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి, కేసులు నమోదు ఉధృతంగానే కొనసాగుతుండగా నియంత్రణ కోసం ప్రతిపాదిస్తున్న ఆంక్షల అమలుపై అయోమయ పరిస్థితి కొనసాగుతోంది. కొన్నిచోట్ల కేసులు ఉధృతంతో స్థానికంగా ఆంక్షలు అమలుచేయగా మరికొన్నిచోట్ల కూడా అమలుకు అధికారులు దృష్టిపెట్టారు. అయితే పాజిటివ్‌ కేసులు ఽఅధికంగా ఉన్న ప్రాంతాల్లో త్వరలో ఆంక్షలు అమలు చేయనున్నట్లు కలెక్టర్‌ పోలాభాస్కర్‌ బుధవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. అప్పుడు కలెక్టర్‌ చేసిన ప్రకటన ప్రకారం పగటిపూట రెండు విడతలుగా 6 గంటల పాటు మాత్రమే వ్యాపార కార్యక్రమాలు, సాధారణ జనసంచారం ఉంటుంది. మిగిలిన 18గంటలు ఆంక్షలు అమలులో ఉంటాయి. అందులో సాయంత్రం 6నుంచి మరుసటిరోజు 6వరకు పూర్తిస్థాయిలో ఆంక్షలు ఉంటాయి. అంటే రాత్రిపూట లాక్‌డౌన్‌ అన్నది 10 నుంచి సాయంత్ర 4 గంటల వరకు ఆరుగంటల పాటు అదే పరిస్థితి. అప్పటికే కందుకూరులో రాత్రిపూట లాక్‌డౌన్‌ అమలులోకి రాగా త్రిపురాంకంలో ఉదయం 10గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6గంటల వరకు దాదాపు 20గంటలపాటు ఆంక్షలు అమలు చేస్తున్నారు. కేసులు ఉదృతి దృష్ట్యా అద్దంకిలోను గురువారం నుంచి రాత్రిపూట అంక్షలకు నిర్ణయించారు. ఆంక్షలు అమలుకు స్థానికంగా సిద్ధమైన ప్రాంతాలు వారు తాజా కలెక్టర్‌ ప్రకటనతో సందిగ్ధంలో పడ్డారు. ఆంక్షలు కలెక్టర్‌ నుంచి ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవహరించాలనే ఆలోచనలో ఉన్నారు. 

కలెక్టర్‌ మరో ప్రకటన

ఈ పరిస్థితులలో అంక్షలకు సంబంధించి గురువారం కలెక్టర్‌  మరో ప్రకటన చేశారు. కరోనా ఉధృతి ఉన్నప్రాంతాల్లో జనసంచారాన్ని నియత్రించడం తప్ప లాక్‌డౌన్‌, కర్ఫ్యూ వంటి వాటి అమలు లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి తుదినిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దీంతో అంక్షలు విషయంలో కలెక్టర్‌ నుంచి ఎలాంటి ఆదేశాలు రాబోతున్నాయి. వాటివల్ల ఎంతమేర ప్రయోజనం అన్న సందిగ్ధం వివిధ వర్గాలలో  కనిపిస్తోంది. ఇదే సమయంలో జేసీ వెంకటమురళి నేతృత్వంలో జిల్లాస్థాయి టాస్క్‌పోర్సు కమిటీ గురువారం సమావేశమై జిల్లాలో పటిష్టమైన కట్టడి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అందుకోసం విపత్తు నిర్వహణ  చట్టం అమలు చేయాలని జేసీ ఆదేశించారు. మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, పార్కులు, స్విమ్మింగ్‌ పూల్స్‌ మూత, బస్సులు నిలిపివేత, తదితర చర్యలకు ఆదేశించారు. ఒకవైపు ఇప్పటికే కొన్ని చర్యలు అమలు, మరికొన్నింటిపై టాస్కుపోర్సు కమిటీ నిర్ణయాలు చేయడం జరగ్గా మరోవైపు నియంత్రణ, తప్ప లాక్‌డౌన్‌, కర్ఫ్యూ వంటి తీవ్ర నిర్ణయాలు ఉండబోవని కలెక్టర్‌ స్పష్టం చేయడం జనాన్ని అయోమయానికి గురిచేస్తోంది. దీంతో ఇప్పటికే అంక్షలున్న ప్రాంతాల్లో యథావిధిగా అమలుచేస్తుండగా ఇతర ప్రాంతాల్లో తీవ్రత ఉన్నప్పటికి కలెక్టర్‌ ఆదేశాలు కోసం స్థానిక అధికారులు ఎదురు చూస్తున్నారు. 

బెడ్లు ఫుల్‌

ఇదిలా ఉండగా జిల్లాలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూ ఉంది. తాజాగా గురువారం మరో 345 కేసులు నమోదు కాగా దీంతో ఈ నెలలో నమోదైన కేసులు సంఖ్య 4,591కి చేరింది. పలుచోట్ల మృతులు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 3,896 యాక్టివ్‌ కేసులు ఉండగా 1,099మంది ఆస్పత్రుల్లోను, 2,797మంది ఇళ్లల్లో చికిత్సపొందుతున్నారు. పలు ప్రైవేటు వైద్యాశాలల్లో ఇప్పటికే బెడ్లు నిండిపోగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోను ఆ పరిస్థితే ఉంది. దీంతో బెడ్లు పెంపు చర్యలపై కలెక్టర్‌ గురువారం సాయంత్రం సమీక్షించారు. కాగా కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజలు ఒకవైపు కరోనా పరీక్షల కోసం, మరోవైపు వ్యాక్సిన్‌ కోసం పరుగులు తీస్తున్నారు. రెండు, మూడురోజులు తర్వాత వ్యాక్సిన్‌ జిల్లాకు రావడంతో వేయించుకోనేందుకు ప్రభుత్వ వైద్యశాలల ఎదుట జనం బారులు తీరారు. అలాగే ఒంగోలులోని రిమ్స్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కరోనా టెస్టులు కోసం కూడా అధికసంఖ్యలోమ జనం రావడంతో రద్దీ కనిపించింది. సంజీవని బస్సులలో కూడా పరీక్షలను తిరిగి అధికారులు ప్రారంభించారు. 




Updated Date - 2021-04-23T05:20:47+05:30 IST