వైరస్‌ విలయం

ABN , First Publish Date - 2021-05-03T05:09:01+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి ప్రమాదకరంగా కనిపిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా శనివారం పాజిటివ్‌ల సంఖ్య వెయ్యి దాటింది. ఆదివారం అది 1378కి చేరింది. ఏప్రిల్‌లో ప్రత్యేకించి రెండో పక్షం నుంచి రోజురోజుకే కేసుల సంఖ్య పెరుగుతోంది

వైరస్‌ విలయం
రిమ్స్‌ అడ్మిషన్‌ కేంద్రం వద్దే ఆక్సిజన్‌తో ఉన్న కరోనా బాధితులు

ప్రకంపనలు సృష్టిస్తున్న పాజిటివ్‌లు

పక్షంలో రెండున్నర రెట్లకు పైగా 

పెరిగిన కరోనా యాక్టివ్‌ కేసులు 

ఆక్సిజన్‌, వెంటిలేటర్లపై

భారీ సంఖ్యలోనే బాధితులు

హోం ఐసోలేషన్‌లో వేలాది మంది 

వెంటాడుతున్న బెడ్ల సమస్య 

చికిత్స కోసం పొరుగు ప్రాంతాలకు

పెద్ద సంఖ్యలోనే వెళ్తున్న ప్రజలు 


ఒంగోలు, మే  2 (ఆంధ్రజ్యోతి) :

జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ విలయతాండవం చేస్తోంది. అన్ని ప్రాంతాలకూ వైరస్‌ విస్తరించి వణికిస్తోంది. నిత్యం ఈ మహమ్మారి బారిన పడే వారి సంఖ్య వందలు దాటి వేలకు చేరింది. ఏప్రిల్‌ రెండో పక్షం నుంచి వెలుగు చూస్తున్న పాజిటివ్‌లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అదే సమయంలో యాక్టివ్‌ కేసులు, అక్సిజన్‌, వెంటిలేటర్‌ అవసరమైన వారి సంఖ్య భారీగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. వేల సంఖ్యలోనే బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా ఆస్పత్రుల వద్ద బెడ్‌ల కోసం అనేక మంది పడిగాపులు కాస్తున్నారు. అవసరమైన సమయంలో చికిత్స అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు పొరుగు ప్రాంతాల్లోని వైద్యశాలలకు పరుగులు పెడుతున్నారు. 


 జిల్లాలో కరోనా ఉధృతి ప్రమాదకరంగా కనిపిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా శనివారం పాజిటివ్‌ల సంఖ్య వెయ్యి దాటింది. ఆదివారం అది 1378కి చేరింది. ఏప్రిల్‌లో ప్రత్యేకించి రెండో పక్షం నుంచి రోజురోజుకే కేసుల సంఖ్య పెరుగుతోంది. 

పట్టణ ప్రాంతాల్లో వైరస్‌ ఉధృతి అధికం

జిల్లాలో కరోనా రెండో వేవ్‌ మార్చి ఆఖరి వారంలోనే ప్రారంభం కాగా ఏప్రిల్‌ రెండో పక్షానికి స్పీడందుకుంది. నిత్యం జిల్లాలో వందల సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. అందులోనూ ఆఖరి వారంలో మరింత తీవ్రస్థాయికి చేరింది. గత ఏడాది ప్రారంభం నుంచి జిల్లాలో 73,141 పాజిటివ్‌లు నమోదు కాగా అందులో ఈ ఏడాది ఏప్రిల్‌ 1నుంచి 30వతేదీ వరకు 7474 ఉన్నాయి. వాటిలో అత్యధికంగా ఒంగోలు నగరంలో 2587  వెలుగు చూశాయి. ఒంగోలుతో కలిసి మొత్తం ఎనిమిది అర్బన్‌ ప్రాంతాలైన మున్సిపల్‌, నగర పంచాయతీల్లోనే 4115 కేసులు  నిర్ధారణ అయ్యాయి. అంటే మొత్తం నమోదైన కేసుల్లో దాదాపు 55శాతానికి పైగా ఈ ఎనిమిది ప్రాంతాల్లోనే ఉండటం ఆందోళన  కలిగిస్తోంది.  గ్రామాలు, మండల కేంద్రాల్లోనూ వైరస్‌ విస్తరిస్తున్నది. 


ఆక్సిజన్‌, వెంటిలేటర్లపై వెయ్యి మందికి పైగా బాధితులు 

గత పక్షం రోజులుగా యాక్టివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. అందులోనూ ఆక్సిజన్‌, వెంటిలేటర్‌పై చికిత్స అవసరమైన బాధితుల సంఖ్య గణనీయంగా ఉంటోంది. ఏప్రిల్‌ తొలిపక్షం కన్నా రెండో పక్షంలో దాదాపు రెండున్నర రెట్లకు పైగా యాక్టివ్‌  కేసులు పెరగ్గా ఇంచుమించు మూడురెట్ల వరకూ ఆక్సిజన్‌, వెంటిలేటర్‌పై చికిత్స పొందే బాధితుల సంఖ్య పెరిగింది. ఏప్రిల్‌ 17న అధికారులు ప్రకటించిన సమాచారం (16వతేదీ  వరకు నమోదైన కేసుల) ప్రకారం జిల్లాలో అప్పటి వరకు 2820 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. వారిలో కేవలం 55 మందికి వెంటిలేటర్‌, మరో 316 మందికి ఆక్సిజన్‌ ద్వారా చికిత్స అందించారు. మిగిలిన వారిలో అత్యధికులు హోం ఐసోలేషన్‌లోనూ, కొందరు ఆస్పత్రుల్లో సాధారణ చికిత్స పొందారు. అదే 23న ప్రకటించిన సమాచారాన్ని పరిశీలిస్తే అప్పటికి యాక్టివ్‌ కేసుల సంఖ్య 4447 ఉండగా వారిలో 97 మందికి వెంటిలేటర్‌, మరో 711 మందికి ఆక్సిజన్‌ చికిత్సను అందిస్తున్నారు. ఇక నెలాఖరు నాటికి పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 7257 కు చేరగా వారిలో 181 మంది వెంటలేటర్‌పైన, మరో 926 మంది ఆక్సిజన్‌ బెడ్‌లపైన చికిత్స పొందుతున్నారు. అలా పక్షం రోజుల్లోనే యాక్టివ్‌ కేసుల సంఖ్య రెండున్నర రెట్లు.. ఆక్సిజన్‌, వెంటలేటర్‌ చికిత్స అవసరమైన బాధితులు మూడు రెట్లకు పైగా పెరగడం జిల్లాలో కరోనా తీవ్రతను తెలియజేస్తోంది. 


బెడ్లు లేక ఎక్కువ మంది హోం ఐసోలేషన్‌లోనే 

ప్రస్తుతం యాక్టివ్‌ కేసులుగా ఉన్న వారిలో అనేక మంది ఆస్పత్రులలో వైద్యం కోసం పరుగులు తీస్తున్న బెడ్‌లు సరిపడా లేక అవస్థలు పడుతున్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటులో జాప్యం కూడా సమస్యకు కారణమవుతోంది. దీంతో ఎక్కువ మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. అధికారులు ఈ నెల 1న ప్రకటించిన సమాచారం ప్రకారం (ఏప్రిల్‌ 30 నాటికి నమోదైన కేసులు) జిల్లాలో 7257 యాక్టివ్‌ కేసులు ఉండగా వారిలో అత్యధికంగా 5275 మంది హోం ఐసోలేషన్‌లో  ఉండి  చికిత్స పొందుతున్నారు. అలాగే 1865 మంది కొవిడ్‌ ఆస్పత్రుల్లోనూ, మరో 117 మంది కొవిడ్‌ కేర్‌ సెంటర్లలోనూ ఉన్నారు. మరోవైపు జిల్లాకు చెందిన వందలాది మంది కరోనా బాదితులు పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. మొత్తంగా రోజురోజుకీ జిల్లాలో కరోనా ఉధృతి ప్రమాదకరంగానే కనిపిస్తున్నది. 

Updated Date - 2021-05-03T05:09:01+05:30 IST