మేమంతా ఏపీ వైపే ఉంటాం: కలెక్టర్‌తో కొటియా గ్రామస్థులు

ABN , First Publish Date - 2021-10-25T22:06:46+05:30 IST

తామంతా ఏపీ వైపే ఉంటామని ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా ప్రాంత వాసులు స్పష్టం చేశారు.

మేమంతా ఏపీ వైపే ఉంటాం: కలెక్టర్‌తో కొటియా గ్రామస్థులు

విజయనగరం: తామంతా ఏపీ వైపే ఉంటామని ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా ప్రాంత వాసులు స్పష్టం చేశారు. కొటియా ప్రాంత గిరిజనులను కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి సత్కరించారు. ఈ సందర్భంగా కొటియా ప్రజలు మాట్లాడుతూ.. తాము ఆంధ్రప్రదేశ్ పౌరులుగానే కొనసాగుతామని తీర్మానం చేశారు. తీర్మానం కాపీలను కలెక్టర్ సూర్యకుమారికి అందజేశారు. ఒడిశా ప్ర‌భుత్వం త‌మ‌ను పోలీసుల‌తో బెదిరిస్తోందని, ఆ బెదిరింపుల‌కు తలొగ్గ‌బోమ‌ని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏపీ ప్ర‌భుత్వం త‌రపున అన్ని సంక్షేమ ప‌థ‌కాలు అందేలా చూస్తామ‌ని హామీ ఇచ్చారు. వారికి అన్నివిధాలా అండ‌దండ‌లు అందిస్తామ‌న్నారు. 


స్వాగతం పలికిన ఎస్పీ

కలెక్టరేట్‌కు వచ్చిన కొటియా ప్రాంత గిరిజనులకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దీపికా పాటిల్, ఓఎస్డీ సూర్య చంద్రరావు స్వాగతం పలికారు. వారితో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒడిశా పోలీసుల వేధింపులను గిరిజనులు ఎస్పీకి వివరించారు. గిరిజనుల భద్రతకు తాము భరోసా కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గిరిజనలకు మాస్కులు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.


కోర్టులో వివాదం..

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కొటియా వివాదం ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. ఆ ప్రాంతం ముందు నుంచి ఏపీలోనే ఉంది. అయితే సరిహద్దు రాష్ట్రం ఒడిశా ఆ ప్రాంతం తమదంటూ కోర్టుకు వెళ్లింది. దీనిపై ఏపీ కూడా సుప్రీం కోర్టులో కేసు వేసింది. కోర్టు తీర్పు కోసం ఏపీ వేచి చూస్తోంది.

Updated Date - 2021-10-25T22:06:46+05:30 IST