మహిళలకు కోవా సాయం!

ABN , First Publish Date - 2020-10-21T09:27:46+05:30 IST

కొందరు తాము ఎదగడమే కాకుండా, తమ చుట్టూ ఉన్న వారు కూడా ఎదిగేలా చేస్తారు. కర్నూలు జిల్లా తడకనపల్లె గ్రామానికి చెందిన మహిళా సంఘాలు

మహిళలకు  కోవా సాయం!

కొందరు తాము ఎదగడమే కాకుండా, తమ చుట్టూ ఉన్న వారు కూడా ఎదిగేలా చేస్తారు. కర్నూలు జిల్లా తడకనపల్లె గ్రామానికి చెందిన మహిళా సంఘాలు ఈ కోవకే చెందుతాయి. పాలకోవా తయారీలో  స్థానిక మహిళలకు చేయూతనందిస్తూ, వాళ్లు ఎదిగేందుకు సహాయపడుతూ అందరి మన్ననలు అందుకుంటున్నాయి.  ఆ విశేషాలు ఇవి. 


కరువు తాండవమాడే కర్నూలు జిల్లాలో పశుపోషణే కష్టం. అలాంటి పరిస్థితులను అధిగమించి కొన్ని వందల పశువులను పోషిస్తున్నారు అక్కడి మహిళలు. వాటి పాలతో స్వచ్ఛమైన పాలకోవా తయారు చేస్తూ స్వయంకృషితో ఎదుగుతున్నారు మరికొందరు మహిళలు. అంతేకాకుండా పశుగ్రాసం సాగు చేస్తూ వందల మంది కూలీలకు పని కల్పించగలుగుతున్నారు. వీరికి అక్కడి మహిళా స్వయం సహాయక సంఘాల తోడ్పాటు ఎంతో ఉంది. పశువుల కొనుగోలు, వాటి మేత, పాలు పితకడం వంటి పనులకు అవసరమైన కూలీలు, వారికి చెల్లించాల్సిన డబ్బులను స్వయం సహాయక సంఘాలే చూసుకుంటున్నాయి. పశువులు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి, ఆవిరి యంత్రాల కోసం రుణాలు అందిస్తున్నాయి. ఫలితంగా ఆ మహిళలు నాణ్యమైన పాలకోవా తయారు చేస్తూ దేశ, విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. 


వందేళ్ల చరిత్ర

తడకనపల్లె పాలకోవాకు వందేళ్ల చరిత్ర ఉంది. షాలీ సాహెబ్‌ అనే వ్యక్తి పాలకోవా తయారు చేసి రోజుకో ఊరు తిరుగుతూ అరిటాకుల్లో పెట్టి, వేడి వేడి పాలకోవాను విక్రయించే వారు. ఆయన అమ్మే పాలకోవాను ఆ ప్రాంత ప్రజలు అమితంగా ఇష్టపడే వారు. తరువాత క్రమంలో ఆ ఊరి మహిళలు కూడా పాలకోవా తయారీ పట్ల మక్కువ పెంచుకున్నారు. కోవా తయారీలో మెలకువలు తెలుసుకుని ఇళ్లలోనే బట్టీలు ఏర్పాటుచేసుకున్నారు. క్రమంగా తడకనపల్లె పాలకోవా తయారీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. బట్టీల స్థానంలో ఆవిరి యంత్రాలు వచ్చి చేరాయి. తడకనపల్లె పాలకోవాకు దేశ, విదేశాల్లో గుర్తింపు ఉంది. ఇటు బెంగళూరు, అటు హైదరాబాద్‌తో పాటు దేశ, విదేశాలకు ఇక్కడి నుంచి పాలకోవా సరఫరా అవుతూ ఉంటుంది. ఇక్కడ కిలో పాలకోవా ధర రూ.200 మాత్రమే. పాలకోవా, బెల్లం పాలకోవా, కలకండ కోవా, పిక్క కోవా (ఘుగర్‌ లెస్‌), దూద్‌పేడ వంటి రకాలను తయారుచేస్తుంటారు.  


డ్వాక్రా గ్రూపుల తోడ్పాటు

పాలకోవా తయారీ కోసం తడకనపల్లె మహిళలు పడుతున్న కష్టాన్ని చూసిన స్వయం సహాయక సంఘాలు ఆర్థిక సాయం చేస్తూ తోడ్పాటునందిస్తున్నాయి. తడకనపల్లె పరిసర గ్రామాల్లో కలిపి 26 బట్టీలు ఉన్నాయి. తడకనపల్లె, ఓబులాపురం, వామ సముద్రం, తాండా గ్రామాల్లో  2 వేల పశువులను పోషిస్తున్నారు. పాలకోవా తయారీతో పాటు పశుపోషణ, గడ్డి పెంపకం, దాణా తయారీ కోసం డ్వాక్రా గ్రూపులు సహాయం అందిస్తున్నాయి. అవసరమైన వారికి రుణాలు అందిస్తున్నాయి. ఫలితంగా మహిళలు అర్థికంగా నిలదొక్కుకోగలిగారు. 




అవకాశాలు అందిపుచ్చుకుంటూ...

కర్నూలు జిల్లాలో ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతుంటారు. కానీ, పాలకోవా పరిశ్రమగా మారిన తడకనపల్లెకు మాత్రం పక్క ఊళ్ల నుంచి రోజూ వందల మంది కూలీలు ఉపాధి కోసం వస్తుంటారు. పాలకోవా తయారీకి పాలు ప్రధాన ముడి సరుకు. పాలల్లో ఏమాత్రం కల్తీ జరిగినా కోవా 4 రోజులకే పాడవుతుంది. నాణ్యత, నమ్మకమే పెట్టుబడిగా జరుగుతోన్న కోవా తయారీకి అక్కడి మహిళలు తాజా పాలను మాత్రమే ఉపయోగిస్తారు. అక్కడ తయారైన పాలకోవా ఫ్రిజ్‌లో పెట్టకపోయినా 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది.  ఆ గ్రామంలో 25 కుటుంబాలు కలిసి సుమారు 800కు పైగా ఆవులు, గేదెలను పోషిస్తున్నాయి. ఆ పశువుల నుంచి రోజూ మూడు వేల లీటర్లకు పైగా పాలు సేకరిస్తారు. కోవా తయారీదారులే స్వయంగా పశువుల నుంచి అవసరమైన పాలను సేకరిస్తుంటారు. తడకనపల్లె నుంచి రోజూ 1200 కిలోలకు పైగా పాలకోవా మార్కెట్‌కు వెళుతుంది. స్వయం సహాయక సంఘాల తోడ్పాటుతో ఆ ఊరి మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ, పదిమంది ఎదిగేలా చేస్తున్నారు. 

మధుసూదన్‌ ఘట్టమనేని, కర్నూలు


వందేళ్ల క్రితం మా నాన్న ప్రారంభించారు 

తడకనపల్లె పాలకోవా అంటే మానాన్న షాలీ సాహెబ్‌ పేరు చెబుతారంతా. నాన్న పేరును నిలిపే బాధ్యత నేను తీసుకున్నాను. నా భర్త అబ్దుల్‌ రెహమాన్‌, కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. నాన్న ఉన్నప్పుడే దేశ, విదేశాలకు ఆర్డర్‌పై కోవాను పంపే వాళ్లం. విదేశాల నుంచి ఆర్డర్లు ఇప్పటికీ వస్తుంటాయి. 

సాహేరాభీ, తడకనపల్లె


ఆవిరి యంత్రంతో శ్రమ తగ్గింది 

మూడు లక్షల పెట్టుబడితో యంత్రం సమకూర్చుకోవడం వల్ల శ్రమ తగ్గింది. కట్టెల ద్వారా ఆవిరి వచ్చి పాల కోవా తయారీ సులువుగా అయిపోతోంది.

 హజరాభీ


పాలకోవా అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటున్నా!

పాలకోవ అమ్మడానికి కర్నూలు నగరంలోని సి. క్యాంప్‌ సెంటర్‌కు వెళ్తాను. ప్రతి రోజు రాత్రి నుంచి ఉదయం వరకు బట్టి పైనే కోవా తయారు చేస్తాను. అ తర్వాత అమ్మడానికి కర్నూలు వెళుతుంటాను. దీనిపైనే ఆదారపడి కుటుంబాన్ని పొషించుకుంటున్నాను. 

గోల్ల పుల్లమ్మ, తడకనపల్లె


బెల్లం పాలకోవా టేస్ట్‌ సూపర్‌

బెల్లంతో పాలకోవా తయారీపై ప్రత్యేకంగా చొరవ తీసుకుంటాం. దూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ బెల్లం పాలకోవాకు ఆర్డర్లు ఇస్తుంటారు. వారికి అవసరమైన రీతిలో ప్రత్యేకంగా సెలం బెల్లంతో పాలకోవా తయారుచేస్తుంటాం. తయారీలో కొన్ని మెలకువలు తీసుకుంటుండంతో కోవా ప్రియులు రుచిని మరింతగా ఆస్వాదిస్తారు. 

సుభద్ర, తడకన పల్లె

Updated Date - 2020-10-21T09:27:46+05:30 IST