కొవాగ్జిన్‌ ముడి పదార్థాలకు కొరత!

ABN , First Publish Date - 2021-04-16T05:53:27+05:30 IST

ఒక వైపు కొవాగ్జిన్‌ ఉత్పత్తిని పెంచాలని భారత్‌ బయోటెక్‌ భావిస్తుంటే.. మరోవైపు

కొవాగ్జిన్‌ ముడి పదార్థాలకు కొరత!

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఒక వైపు కొవాగ్జిన్‌ ఉత్పత్తిని పెంచాలని భారత్‌ బయోటెక్‌ భావిస్తుంటే.. మరోవైపు వ్యాక్సిన్‌ తయారీకి అవసరమైన రసాయనాల కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దీంతో కొవాగ్జిన్‌ ఉత్పత్తిని పెంచడానికి కంపెనీకి ఇబ్బందిగా మారినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇన్‌యాక్టివేటెడ్‌ వ్యాక్సిన్‌లో ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ పెంచడానికి వినియోగించే అడ్జువెంట్‌కు కొరతగా ఉందని చెబుతున్నారు. అమెరికా వంటి కొన్ని దేశాలు సరపరాపై నియంత్రణలు విధించడంతో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీకి వినియోగించే ముడి పదార్థాలు, రసాయనాలకు కొరత ఎదురవుతోందని ఇటీవల భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణ ఎల్లా తెలిపారు.


అమెరికా, స్వీడన్‌ తదితర దేశాల నుంచి అవసరమైన ముడి పదార్థాలను పొందలేకపోతున్నామని వివరించారు. వైరోవ్యాక్స్‌కు చెందిన అల్‌హైడ్రోక్సిక్విమ్‌-2ను భారత్‌ బయోటెక్‌ యాజువన్ట్‌గా వినియోగిస్తోంది. అల్‌హైడ్రోక్సిక్విమ్‌-2ను వినియోగించి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై ప్రయోగాలు చేసి కంపెనీ ఆమోదం పొందింది. దీనిలో మార్పు చేస్తే మళ్లీ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించి ఆమోదం పొందాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  



చెంగల్పట్టులో ఉత్పత్తి! 

 తమిళనాడు చెంగల్పట్టు ఇంటిగ్రేటెడ్‌ వ్యాక్సిన్‌ కాంప్లెక్స్‌ (ఐవీసీ)లో కొవాగ్జిన్‌ను తయారు చేయడంపై భారత్‌ బయోటెక్‌తో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. వ్యాక్సిన్ల రంగంలో స్వయంసమృద్ధిని సాధించే లక్ష్యంతో ఐవీసీని ఏర్పాటు చేశారు. దాదాపు తొమ్మిదేళ్ల క్రితమే ఇది అందుబాటులోకి వచ్చినా ఇప్పటి వరకూ ఒక్క డోసు వ్యాక్సిన్‌ను కూడా ఇక్కడ ఉత్పత్తి చేయలేదని చెబుతున్నారు. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ఐవీసీలో ఉత్పత్తి చేయడానికి   టెండర్లు దాఖలు చేసిన కంపెనీల్లో భారత్‌ బయోటెక్‌ ఒకటి. దీంతో ఈ కంపెనీతో చర్చలు జరుపుతున్నామని అధికార వర్గాలు పేర్కొన్నాయి.   



హాఫ్‌కిన్‌ ఇనిస్టిట్యూట్‌లో కొవాగ్జిన్‌ తయారీ 

 ముంబైకి చెందిన హాఫ్‌కిన్‌ ఇనిస్టిట్యూట్‌లో భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొవాగ్జిన్‌ ఉత్పత్తి చేసేందుకు హాఫ్‌కిన్‌ను అనుమతించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా కేంద్రం ఈ మేరకు అనుమతినిచ్చింది. ప్రస్తుతం కొవాగ్జిన్‌ను భారత్‌ బయోటెక్‌ మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. 


Updated Date - 2021-04-16T05:53:27+05:30 IST