‘కొవాగ్జిన్‌’ మూడో డోసు

ABN , First Publish Date - 2021-04-03T07:05:09+05:30 IST

‘కొవాగ్జిన్‌’ టీకా ప్రయోగ పరీక్షల్లో పాల్గొంటున్న వలంటీర్లలో రెండు డోసులు తీసుకున్న కొంతమందిపై.. మూడో డోసునూ పరీక్షించేందుకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది.

‘కొవాగ్జిన్‌’ మూడో డోసు

  • ‘బూస్టర్‌’తో ప్రయోగ పరీక్షలు.. 
  • భారత్‌ బయోటెక్‌కు పచ్చజెండా?
  • ఏటా ఒక బూస్టర్‌ డోసు.. 
  • ఫైజర్‌, మోడెర్నా యోచన?
  • గతంలో సోకిన వారిలో..4.5% మందికి మళ్లీ కరోనా


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: ‘కొవాగ్జిన్‌’ టీకా ప్రయోగ పరీక్షల్లో పాల్గొంటున్న వలంటీర్లలో రెండు డోసులు తీసుకున్న కొంతమందిపై.. మూడో డోసునూ పరీక్షించేందుకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. రెండోదశ క్లినికల్‌ ట్రయల్‌ ప్రొటోకాల్‌లో ఈ మేరకు సవరణలు చేసి భారత్‌ బయోటెక్‌ సమర్పించిన దరఖాస్తుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు చెందిన విషయ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) ఆమోదం తెలిపినట్లు సమాచారం.


వలంటీర్లకు కొవాగ్జిన్‌ రెండో డోసు వేసిన 6 నెలల తర్వాత మూడో డోసు అందించనున్నారు. రెండో దశ ట్రయల్స్‌లో పాల్గొన్న మొత్తం 380 మందిలో సగంమందికి 3 మైక్రోగ్రాములు, మిగతావారికి 6 మైక్రోగ్రాముల కొవాగ్జిన్‌ రెండు డోసులను అందించారు. తదుపరిగా, బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనను గుర్తించినందున.. మూడో డోసును అందించేందుకు 6 మైక్రోగ్రాముల డోసులు తీసుకున్న వారినే ఎంపిక చేసుకోవాలని భారత్‌ బయోటెక్‌కు ఎస్‌ఈసీ నిర్దేశించింది. వలంటీర్ల ఆరోగ్య స్థితిగతుల్లో వచ్చే మార్పులను కనీసం 6 నెలలు నిశితంగా పరిశీలించాలని ఎస్‌ఈసీ తెలిపింది.


మూడో డోసును అందించడం ద్వారా ఏ ఫలితాలను సాధించదలిచారు? ఏ అంశాలను మదింపు చేయదలిచారు? ప్రాథమిక, ద్వితీయ లక్ష్యాలేంటి? అనే వివరాలతో నివేదికను సమర్పించాలని భారత్‌ బయోటెక్‌ను ఆదేశించింది. ఈ సమాచారానికి అనుగుణంగా ట్రయల్‌ ప్రొటోకాల్‌లో మార్పులు చేయాలని నిర్దేశించింది.


డమ్మీ (ప్లసీబో) టీకాలు వేసిన 45 ఏళ్లకు పైబడిన వలంటీర్ల వివరాలను బహిర్గతపర్చేలా మూడోదశ ట్రయల్స్‌ ప్రొటోకాల్‌లో సవరణలు చేయాలంటూ భారత్‌ బయోటెక్‌ చేసిన విజ్ఞప్తికి  ఆమోదం తెలిపింది. వీరి వివరాలను వెల్లడించి, అర్హత లభించగానే ఉచితంగా టీకా ఇవ్వాలని సిఫారసు చేసింది. 



మూడోది ఎందుకంటే..

కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు ఎందుకన్న ప్రశ్నపై వైద్య, ఔషధ రంగాల నిపుణులు పలు రకాల సమాధానాలిస్తున్నారు. ‘‘కరోనా  నుంచి కోలుకున్న ఆరు నెలల తర్వాత యాంటీబాడీలు తగ్గుముఖం పడుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సంక్లిష్ట తరుణంలో రోగ నిరోధక వ్యవస్థకు అదనపు చైతన్యం చేకూర్చే లక్ష్యంతో మూడో డోసుతో నిర్వహించనున్న ప్రయోగాల్లో ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి’’ అని ప్రముఖ వైరాలజిస్టు గగన్‌దీప్‌ కాంగ్‌ అన్నారు.


‘‘పిల్లలకు హెపటైటి్‌స-బి టీకా రెండు డోసులను ఇచ్చాక, బూస్టర్‌ డోసును అందించేందు సుదీర్ఘ విరామం తీసుకుంటారు. ఫలితంగా దీర్ఘకాలిక రోగ నిరోధకత లభిస్తుంది. అచ్చం ఇలాగే ఇవ్వాలని యోచిస్తున్న కొవాగ్జిన్‌ మూడో డోసు వల్ల.. కరోనా నుంచి దీర్ఘకాలిక రక్షణ లభిస్తుందని ఆశిస్తున్నారు’’ అని మరో శాస్త్రవేత్త పేర్కొన్నారు. మూడో డోసుతో ట్రయల్స్‌ నిర్వహించాలని భారత్‌ బయోటెక్‌ భావించడానికి బలమైన కారణం ఉండొచ్చని మసాచుసెట్స్‌కు చెందిన వ్యాక్సిన్‌ నిపుణుడు డాక్టర్‌ దవీందర్‌ గిల్‌ అభిప్రాయపడ్డారు. బహుశా.. జంతువులపై జరిపిన ప్రయోగ పరీక్షల్లో ఇప్పటికే మూడో డోసును పరీక్షించి ఉండొచ్చన్నారు. 




Updated Date - 2021-04-03T07:05:09+05:30 IST