2 -18 ఏళ్ల పిల్లలకు కొవాగ్జిన్‌ టీకా

ABN , First Publish Date - 2021-10-13T06:49:14+05:30 IST

‘‘పిల్లలకు కొవిడ్‌ టీకా’’ కోసం నిరీక్షణ ముగియనుంది. చిన్నారులకు వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందా? అన్న ఎదురుచూపులకు తెరపడనుంది. 2 నుంచి 18 ఏళ్ల వారికోసం భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా..

2 -18 ఏళ్ల పిల్లలకు కొవాగ్జిన్‌ టీకా

  • అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసిన డీసీజీఐ
  • ప్రపంచంలో రెండేళ్ల వయసు చిన్నారులకు కరోనా తొలి వ్యాక్సిన్‌
  • తొలి డోసు పొందిన 28 రోజుల వ్యవధిలోపే రెండో డోసు టీకా
  • వెయ్యిమందిపైగా పిల్లలపై ట్రయల్స్‌.. 77.8 శాతం సామర్థ్యం
  •  జైకొవ్‌-డి 12 ఏళ్లు దాటినవారికి.. ట్రయల్స్‌ దశలో నొవావ్యాక్స్‌
  • అడ్వాన్స్‌ ట్రయల్స్‌లో.. ఐదేళ్లు పైబడినవారికి ఇచ్చే కొర్బెవ్యాక్స్‌


న్యూఢిల్లీ, అక్టోబరు 12: ‘‘పిల్లలకు కొవిడ్‌ టీకా’’ కోసం నిరీక్షణ ముగియనుంది. చిన్నారులకు వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందా? అన్న ఎదురుచూపులకు తెరపడనుంది. 2 నుంచి 18 ఏళ్ల వారికోసం భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత మార్కెట్‌లో వినియోగానికి ఆమోదం తెలుపుతున్నట్లు మంగళవారం రాత్రి ప్రకటించింది. దీనికిముందు కొవాగ్జిన్‌ పిల్లల టీకాకు అత్యవసర వినియోగ అనుమతి ఇవ్వొచ్చంటూ కొవిడ్‌- 19పై ఏర్పాటైన నిపుణుల బృందం డీసీజీఐకి సిఫార్సు చేసింది. ఆ ప్రక్రియ పూర్తి కావడంతో.. ప్రపంచంలో రెండేళ్ల వయసు పిల్లలకు అందుబా టులోకి రానున్న తొలి కొవిడ్‌ టీకాగా నిలిచింది. ప్రస్తుతం 18 ఏళ్లు దాటినవారికి ఇస్తున్నట్లే.. ఇది కూడా రెండు డోసుల టీకా. అయితే, రెండో డోసు వ్యవధి 28 రోజులే కావడం విశేషం. వయోజనులకు ఇస్తున్న టీకా రెండో డోసు గడువు 4 నుంచి 6 వారాలుగా ఉంది.


77 శాతం సామర్థ్యం

దేశవ్యాప్తంగా వెయ్యిమందిపైగా పిల్లలపై కొవాగ్జిన్‌ టీకా ట్రయల్స్‌ చేపట్టారు. పెద్దల టీకా తయారీకి వినియోగించిన ఫార్ములానే దీనికీ వాడారు. భద్రత, సామర్థ్యం అంశాలను దృష్టిలో పెట్టుకుని ట్రయల్స్‌ మాత్రం ప్రత్యేకంగా నిర్వహించారు. భారత్‌ బయోటెక్‌ ఈ వివరాలను గత వారం కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీవో)కు సమర్పించింది. వాటిని సీడీఎ్‌ససీవో, నిపుణుల కమిటీ పూర్తిగా పరిశీలించి, సానుకూలంగా స్పందించిందని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. మరోవైపు అధికారికంగా వివరాలు బయటకు రాకున్నా.. పెద్దల స్థాయిలోనే పిల్లలకూ కొవిడ్‌ నుంచి కొవాగ్జిన్‌ టీకా రక్షణ కల్పిస్తుందని నిపుణుల బృందం పేర్కొంది. 18 ఏళ్లు దాటినవారిపై కొవాగ్జిన్‌ సామర్థ్యం 77.8 శాతం అని జూన్‌లో భారత్‌ బయోటెక్‌ సంస్థ డీసీజీఐకి ఇచ్చిన నివేదికలో తెలిపింది.


కాగా, పిల్లల టీకాకు సంబంధించి ఇప్పటికే జైడస్‌ క్యాడిలా సంస్థ జైకొవ్‌-డికి అనుమతులు వచ్చినా ఇది 12 ఏళ్లు దాటినవారికే. ఇక 2-17 ఏళ్ల పిల్లలకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేయనున్న కొవోవ్యాక్స్‌ ట్రయల్స్‌కు జూలైలో , 7 నుంచి 11 ఏళ్ల వారికోసం తయారు చేయనున్న నొవావ్యాక్స్‌ టీకా ట్రయల్స్‌కు సెప్టెంబరులో డీసీజీఐ అనుమతిచ్చింది. మరోవైపు ఐదేళ్లు దాటినవారికి బయోలాజికల్‌-ఈ తయారీ కొర్బెవ్యాక్స్‌ అడ్వాన్స్‌ ట్రయల్స్‌లో ఉంది.


నమ్మకం సాకారం..: కేంద్రం 

చిన్నారుల రక్షణను దృష్టిలో పెట్టుకుని కొవాగ్జిన్‌ ట్రయల్స్‌ సాగాయని, వారి భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ తెలిపారు. రెండేళ్ల పైబడిన చిన్నారులకు కొవిడ్‌ టీకాను అందించగలమని తాము నమ్మకంగా చెబుతూ వచ్చామని, అదిప్పుడు సాకారం కానుందన్నారు.


కొర్బెవ్యాక్స్‌ సింగిల్‌ బూస్టర్‌ డోసు టీకా మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి కోరుతూ హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. కొవిషీల్డ్‌ లేదా కొవాగ్జిన్‌ రెండు డోసులూ పొందినవారిపై ఈ ట్రయల్స్‌ చేపట్టనుంది.

Updated Date - 2021-10-13T06:49:14+05:30 IST