భారతీయ వంటకాలతో కొవిడ్‌ నిధులు

ABN , First Publish Date - 2021-06-02T05:30:00+05:30 IST

కరోనా బాధితుల వెతలు చూసి తట్టుకోలేని ఓ యువ ఎన్నారై కొవిడ్‌-19 రిలీఫ్‌ ఫండ్‌ నిధుల సేకరణకు మార్గాలు వెతకడం మొదలుపెట్టింది. ఇందుకోసం స్వయానా చెఫ్‌ అయిన ధృతి డెన్మార్క్‌లో తను పనిచేసే ‘నోమా’ రెస్టారెంట్‌ మెనూలో సంప్రదాయ భారతీయ వంటకాలను

భారతీయ వంటకాలతో  కొవిడ్‌ నిధులు

కరోనా బాధితుల వెతలు చూసి తట్టుకోలేని ఓ యువ ఎన్నారై కొవిడ్‌-19 రిలీఫ్‌ ఫండ్‌ నిధుల సేకరణకు మార్గాలు వెతకడం మొదలుపెట్టింది. ఇందుకోసం స్వయానా చెఫ్‌ అయిన ధృతి డెన్మార్క్‌లో తను పనిచేసే ‘నోమా’ రెస్టారెంట్‌ మెనూలో సంప్రదాయ భారతీయ వంటకాలను చేర్చింది. అంతే కాదు... నోరూరించే ఆ వంటకాలు కొనుక్కోవాలంటే, 1,500 రూపాయలు డొనేట్‌ చేయాలనే నియమాన్ని కూడా పెట్టింది. ఆ ఆసక్తికరమైన కథనం ఇది! 


కొవిడ్‌ కాలంలో రెస్టారెంట్లు మనుగడ సాగించడం కష్టం. కొపెన్‌హేగెన్‌లోని నోమా ఫైన్‌ డైనింగ్‌ రెస్టారెంట్‌ కూడా ఇలాంటి గడ్డు కాలాన్నే గత ఏడాది కొవిడ్‌ తొలి దశ సమయంలో ఎదుర్కొంది. దాంతో అప్పట్లో మెనూలో బర్గర్లు ప్రవేశపెట్టి, కస్టమర్లను ఆకర్షించి మొదటి కొవిడ్‌ వేవ్‌ నుంచి ఎలాగోలా గట్టెక్కేసింది. ఇక సెకండ్‌ వేవ్‌లో సరికొత్త వంటకాల ప్రయోగాలు జరిపే క్రమంలో అదే రెస్టారెంట్‌లో పని చేస్తున్న ఇంటర్న్‌ చెఫ్స్‌ను సలహాలు అడిగింది. వాళ్లలో ఒక ఇంటర్న్‌ చెఫ్‌... ఢిల్లీ అమ్మాయి ధృతి అరోరా. తనకొచ్చిన ఓ వినూత్న ఆలోచనను వాళ్ల ముందు ఉంచింది. భారతీయులు లొట్టలు వేసుకుంటూ తినే బటర్‌ చికెన్‌, లచ్చా పరాఠా, గాజర్‌ కా హల్వా, దాల్‌ మఖనీ వంటకాలను నోమా మెనూలో చేరిస్తే కస్టమర్ల సంఖ్య తగ్గే వీలే ఉండదని చెప్పింది. ఆ ఫోర్‌ కోర్స్‌ మెనూ కొనుగోలుకు ఓ నియమం పెట్టాలని కూడా సూచించింది.


వాటిని కొనాలంటే తలకొకటి చొప్పున 1,500 రూపాయలు తప్పనిసరిగా డొనేట్‌ చేయాలి. ఆ నియమానికి కట్టుబడినవాళ్లే రుచికరమైన ఇండియన్‌ మీల్‌ను తీసుకువెళ్లవచ్చు. ధృతి సూచనను స్వాగతించిన రెస్టారెంట్‌ యాజమాన్యం మరో ఆలోచన లేకుండా ఆ నాలుగు భారతీయ వంటలనూ మెనూలో చేర్చింది. ఆ వెంటనే వరుసగా ఆర్డర్లు వచ్చి పడ్డాయి. గంటల వ్యవధిలోనే మెనూలోని భారతీయ వంటకాలన్నీ అమ్ముడుపోయాయి. అలా వారం రోజుల వ్యవధిలో సుమారు రెండు లక్షల రూపాయలు నిధుల రూపంలో సమకూరాయి. తమ విజయాన్నీ, ఆ ప్రయత్నం వెనకున్న ధృతి ఆలోచననూ నోమా రెస్టారెంట్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఆ పోస్ట్‌లో ధృతి వీడియో కూడా ఉండడం విశేషం! 


ఆ క్రెడిట్‌ వాళ్లదే... 

‘‘డెన్మార్క్‌లోని డానిష్‌ రెస్టారెంట్‌ నోమాలో భారతీయ వంటకాలు ఉడుకుతూనే ఉన్నా సర్వ్‌ చేయడం ఇదే మొదటిసారి. ఈ రెస్టారెంట్‌లో ఇంటర్న్‌గా పనిచేసే ప్రతి చెఫ్‌ తమ తమ దేశాల్లో పేరున్న వంటకాలను వండి, టీమ్‌ మొత్తానికీ రుచి చూపించాలనే నియమం ఉంది. అలా నా వంతు వచ్చినప్పుడు ఏ భారతీయ సుగంధ ద్రవ్యం పరిచయం చేస్తే బాగుంటుందా అని ఆలోచించాను. నోమా వంటగదిలో మన దేశ స్పైసెస్‌ అన్నీ వాడుకలో ఉన్నాయి... ఒక్క ఇంగువ మినహా. దాంతో ఇంగువను పరిచయం చేశాను. అలాగే నాకెంతో ఇష్టమైన భారతీయ వంటకాలను కూడా! ఎప్పుడు ఢిల్లీలోని అమ్మమ్మ దగ్గరకు వెళ్లినా, లచ్చా పరాఠా, దాల్‌ మఖనీ, బటర్‌ చికెన్‌, గాజర్‌ కా హల్వా తినవలసిందే! చెఫ్‌గా మారిన తర్వాత ప్రపంచవ్యాప్త వంటకాలెన్ని రుచి చూసినా భారతీయ వంటకాల మీద మమకారం పెరిగిందే తప్ప తరగలేదు. 


గత ఏడాది కంటే ఇప్పటి కొవిడ్‌ పరిస్థితి మరింత ఘోరం. ఆక్సిజన్‌ సిలిండర్లు, బెడ్ల కొరతతో కొవిడ్‌ బాఽధితులు పడుతున్న బాధలు నా మనసును కదిలించాయి. వారికి తోచిన సహాయం చేద్దామని నిర్ణయించుకుని, నిధులను సేకరించే ప్రయత్నం మొదలుపెట్టాను. చెఫ్‌ను కాబట్టి అందరి ఆదరణ పొందిన భారతీయ వంటకాలను డానిష్‌ ప్రజలకు రుచి చూపించాను. అయితే ఈ క్రెడిట్‌ మొత్తం ఆ రెసిపీలను నాకు నేర్పించిన అమ్మ, అమ్మమ్మలకే దక్కుతుంది’’ అని చెప్పుకొచ్చింది ధృతి. 


ఢిల్లీ టు డెన్మార్క్‌... 

ఢిల్లీకి చెందిన ధృతి అరోరా కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అమెరికాలో గ్రాడ్యుయేషన్‌ ముగించింది. ఆ తర్వాత ముంబయి, వాషింగ్టన్‌లలోని రెస్టారెంట్లలో చెఫ్‌గా పనిచేసింది. ఆ తరువాత డెన్మార్క్‌లోని కోపెన్‌హేగెన్‌లోని నోమా రెస్టారెంట్‌లో ఇంటర్న్‌ చెఫ్‌గా స్థిరపడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నోమా రెస్టారెంట్‌ పోస్ట్‌ చేసిన ధృతి వీడియోకు వేలకొద్దీ లైక్స్‌ వచ్చాయి. దాంతోపాటు... రెసిపీ వివరాలు చెప్పమనే రిక్వెస్ట్‌లు కూడా లెక్కకు మించి వస్తూ ఉండడం చెప్పుకోదగిన విశేషం. 

Updated Date - 2021-06-02T05:30:00+05:30 IST