కొవిడ్‌ కష్టం-ఖర్చులకు కళ్లెం

ABN , First Publish Date - 2020-09-25T06:24:20+05:30 IST

దేశంలో ప్రతి 10 మంది వ్యక్తుల్లో 9 మంది వ్యయాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు...

కొవిడ్‌ కష్టం-ఖర్చులకు కళ్లెం

  • ఆచితూచి వ్యవహరిస్తున్న భారతీయులే అధికం
  • ఉపాధి పెరుగుదల, ఆర్థిక రికవరీపై అపనమ్మకం
  • స్టాన్‌చార్ట్‌ సర్వేలో తేలిన వాస్తవం


ముంబై : దేశంలో ప్రతి 10 మంది వ్యక్తుల్లో 9 మంది వ్యయాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్‌ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతూ ఉండడం వల్ల ఉపాధి రంగం, ఆర్థిక రికవరీ రెండింటిలోనూ తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన స్టాన్‌చార్ట్‌ బ్యాంకు ప్రజల వ్యయధోరణులపై ప్రపంచవ్యాప్త సర్వే నిర్వహించింది. బ్రిటన్‌, హాకాంగ్‌, ఇండియా, ఇండోనేసియా, కెన్యా, చైనా, మలేషియా, పాకిస్తాన్‌, సింగపూర్‌, తైవాన్‌, యూఏఈ, అమెరికాల్లో ఈ ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించారు. కరోనా వైరస్‌ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు తెచ్చింది, ఆ మార్పు వారిలో ఎంతకాలం కొనసాగుతుంది వంటి భిన్న కోణాల్లో ప్రశ్నించారు. ఈ రకంగా నిర్వహిస్తున్న మూడు సర్వేల్లో ఇది రెండవది. జూలైలో మొదటి సర్వే నిర్వహించారు. 


సర్వేలో ముఖ్యాంశాలు

వైరస్‌ విజృంభణతో వ్యయాలపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని భారతీయుల్లో 90 శాతం మంది, ప్రపంచ ప్రజల్లో 75 శాతం మంది చెప్పారు. కొవిడ్‌-19 ప్రభావం తమలో వ్యయధోరణులను నిశితంగా ట్రాక్‌ చేసే దైఖరిని పెంచిందని 76 శాతం మంది భారతీయులు, 62 శాతం మంది ఇతర దేశాల ప్రజలు చెప్పారు.


వ్యయాలకు పగ్గాలు వేసే చర్యల్లో భాగంగా 80 శాతం మంది కట్టుదిట్టమైన బడ్జెట్‌ విధానాలు అనుసరిస్తున్నారు. 


తాము ఆన్‌లైన్‌లోనే షాపింగ్‌ చేయదలుచుకున్నట్టు 78 శాతం భారతీయులు చెప్పగా ఇతర దేశాల వారి సంఖ్య 66 శాతం ఉంది. కరోనాకు ముందు కాలంలో దేశంలో ఆన్‌లైన్‌ కొనుగోలుదారుల సంఖ్య 54 శాతం ఉండేది. 


నిత్యావసరాలు, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్‌ సాధనాల కొనుగోలుకు మాత్రమే ఖర్చు చేస్తున్నట్టు భారతీయులతో సహా ఇతర దేశాల వినియోగదారులు చెప్పారు.  


కరోనా ముందు సమయంతో పోల్చితే రాబోయే కాలంలో ప్రయాణాలు, విహార యాత్రలు తగ్గించుకుంటామని 64 శాతం, కొత్త అనుభూతి అందించే ఉత్పత్తుల కొనుగోలు నిలిపివేస్తామని 41 శాతం మంది చెప్పారు.


స్థానికంగానే కొనుగోలు చేస్తామని 72 శాతం మంది, చిన్న వ్యాపారుల నుంచి కొనుగోలు చేస్తామని 73 శాతం మంది అన్నారు. 


ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేస్తామని అధిక శాతం మంది చెప్పారు.

Updated Date - 2020-09-25T06:24:20+05:30 IST