కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం

ABN , First Publish Date - 2021-04-14T06:25:12+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాను పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేయగా, టీ కా పనులు ముమ్మరం చేశారు.

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం
యాదాద్రి జిల్లా తంగడపల్లి పీహెచ్‌సీలో కరోనా టీకా వేస్తున్న వైద్య సిబ్బంది

టీకాల పంపిణీలో తంగడపల్లి పీహెచ్‌సీ ముందంజ


చౌటుప్పల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 13: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాను పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేయగా, టీ కా పనులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా చౌటుప్పల్‌ మునిసిపాలిటీ పరిధిలోని తంగడపల్లి పీహెచ్‌సీ పరిధిలో జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్‌ మొదలు పెట్టారు. ఈ నెల 7వ తేదీ వరకు పైలెట్‌ ప్రాజెక్ట్‌గా తీసుకున్నారు. 45 ఏళ్లు పైబడిన వారు 19,500 మంది ఉన్నట్లు గుర్తించగా, అందులో 5,900 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. పైలెట్‌ ప్రాజెక్ట్‌గా తీసుకున్న అనంతరం ఈ నెల 7న 350 మందికి, 8న 610, 9న 723, 10న 859, 11న 464, 12వ తేదీన 1140 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. ఈ ఆరు రోజుల్లో కూడా వ్యాక్సినేషన్‌ చేయడంలో ఈ మండలమే రాష్ట్రస్థాయిలో అగ్రగ్రామిగా నిలవడం విశేషం. గ్రామాల్లో మూడు సంచార వైద్య బృందాలతోపాటు స్థానిక ఆస్పత్రిలో ఓ బృందం వ్యాక్సినేషన్‌ చేస్తోంది. మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రా జు, పీహెచ్‌సీ వైద్యాధికారి ఎం.శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో 26మంది వైద్య సిబ్బంది టీకాలు వేస్తుండగా, 64మంది ఆశా కార్యకర్తలు వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రోగ్రాం అధికారి జగన్నాథరెడ్డి, కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌లు అభినందించినట్లు వైద్యాధికారి శివప్రసాద్‌రెడ్డి మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. 


అందరి సహకారంతోనే సాధ్యం : మోదుగు శివప్రసాద్‌ రెడ్డి, పీహెచ్‌సీ వైద్యాధికారి, తండపల్లి

అందరి సహకారంతో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విజయవంతంగా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్‌ చేయడంలో తంగడపల్లి పీహెచ్‌సీ రాష్ట్రస్థాయిలోనే ముందువరుసలో ఉండడం ఆనందంగా ఉంది. 45 ఏళ్లుపై బడిన వారంతా తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలి. కరోనా వైరస్‌ నియంత్రణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యంకావాలి. మాస్క్‌లు విధిగా ధరించి, భౌతిక దూరం పాటించాలి. 


Updated Date - 2021-04-14T06:25:12+05:30 IST