కొవిడ్‌ ఓపీ సేవలు షురూ

ABN , First Publish Date - 2021-05-07T10:12:18+05:30 IST

కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో కొవిడ్‌ అవుట్‌ పేషంట్‌ సేవలను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతోపాటు పాజిటివ్‌ రోగులకు కౌన్సెలింగ్‌

కొవిడ్‌ ఓపీ సేవలు షురూ

పాజిటివ్‌గా తేలిన వ్యక్తులకు కౌన్సెలింగ్‌..

ప్రభుత్వ ఆస్పత్రులన్నింట్లోనూ ఏర్పాటు

పాజిటివ్‌లతోపాటు లక్షణాలున్న వారికీ కిట్లు

ఒక్కో పీహెచ్‌సీకి 800-1000 కిట్లు చేరవేత

బొగ్గులకుంట అర్బన్‌ పీహెచ్‌సీలో సీఎస్‌ తనిఖీ


హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో కొవిడ్‌ అవుట్‌ పేషంట్‌ సేవలను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతోపాటు పాజిటివ్‌ రోగులకు కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించారు. పీహెచ్‌సీలో రెగ్యులర్‌ వైద్య సేవలతో పాటు అదనంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. పీహెచ్‌సీల్లో ఉదయం కొవిడ్‌   నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, పరిమిత సంఖ్యలో చేయడం వల్ల అందరికీ పరీక్షలు సాధ్యం కావడం లేదు. పాజిటివ్‌లతో పాటు లక్షణాలున్నవారినీ కొవిడ్‌ అనుమానితులుగానే భావించి వైద్య సేవలు ప్రారంభించారు. వీరందరికీ మెడికల్‌ కిట్లను అందజేశారు. ప్రతి పీహెచ్‌సీకి 800-1000 మెడికల్‌ కిట్లను వైద్య ఆరోగ్య శాఖ పంపించింది.


తొలిరోజు ప్రతి పీహెచ్‌సీలో సగటున 50-60 మందికి ఈ కిట్లను అందజేశారు. కిట్‌లోని మందులను 14 రోజులు తప్పనిసరిగా వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో కొన్ని 5 రోజుల వరకు వచ్చేవి ఉండగా, మిగిలినవి 14 రోజులకు వచ్చేలా ఇచ్చారు. కిట్‌లో దాదాపు పది రకాల ఔషధాలను ఉంచారు. వాటిలో డాక్సీ 100-(10 ట్యాబ్లెట్లు), పారాసిటమాల్‌(20), లివోసిట్రాజిన్‌(10), హైడ్రాక్సీ క్లోరోక్విన్‌(14), అజిత్రోమైసిన్‌(5), విటమిన్‌-ఏ, డీ (10), బీ కాంప్లెక్స్‌ (10), విటమిన్‌ సీ (10), జింక్‌ ట్యాబ్లెట్లు(10) ఉన్నాయి. 


కౌన్సెలింగ్‌కు ప్రాధాన్యం..

పాజిటివ్‌ అనగానే హైరానా పడేవారు, తీవ్ర ఆందోళన చెందేవారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అందుకే వారికి కొవిడ్‌ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని  పాజిటివ్‌లకు మెడికల్‌ కిట్‌ ఎలా వాడాలి? మందులు ఎప్పడెప్పుడు వేసుకోవాలి? ఐదు రోజులపాటు వాడినా తగ్గకపోతే ఏం చేయాలి? ఇంట్లో ఎలా ఉండాలి? అని కౌన్సెలింగ్‌ ఇస్తున్నట్లు పీహెచ్‌సీ వైద్యులు చెబుతున్నారు.  విడిగా ఉండేందుకు రూమ్‌ లేకపోతే ప్రభుత్వ కొవిడ్‌ కేర్‌ కేంద్రాలకు పంపడం లాంటివి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్‌కుమార్‌ గురువారం బొగ్గులకుంట అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ ఓపీ సేవలు, కౌన్సెలింగ్‌ జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. లక్షణాలున్న వారికి కొవిడ్‌ టెస్టు ఫలితం వచ్చేవరకు ఆగకుండా వెంటనే మందుల కిట్‌ ఇచ్చి, చికిత్స ప్రారంభించాలని అక్కడి వైద్య సిబ్బందికి సూచించారు. మందులు వాడాక జ్వరం నాలుగైదు రోజులపాటు ఉంటే  స్టెరాయిడ్‌ వాడాలని తెలిపారు. సీఎస్‌ వెంట వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ఉన్నారు. 

Updated Date - 2021-05-07T10:12:18+05:30 IST