ఇంకా అందని రెండో డోసు

ABN , First Publish Date - 2021-08-01T09:21:53+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై టీకాల కొరత ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే వ్యాక్సిన్‌ మొదటి డోసును తీసుకున్న వారికి.. సకాలంలో రెండో డోసు

ఇంకా అందని రెండో డోసు

జూలైలో 13.50 లక్షల మందికి..  ఆగస్టులో 35 లక్షల మందికి బాకీ

ఏకకాలంలో మొదటి, రెండో డోసులు ఇవ్వడం వల్లే సమస్య

వచ్చే 2 వారాలు.. ఆ డోసు వారికే టీకాలు 

గడువుకు ముందే.. వ్యాక్సిన్‌కు జనం క్యూ 

మళ్లీ దొరుకుతుందో లేదోనన్న ఆందోళన


హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై టీకాల కొరత ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే వ్యాక్సిన్‌ మొదటి డోసును తీసుకున్న వారికి.. సకాలంలో రెండో డోసు అందే పరిస్థితి కనిపించడం లేదు. కొత్తగా మొదటి డోసును అందించడం తగ్గించేసి, రెండో డోసు లబ్ధిదారులకే వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యమిస్తున్నా .. ప్రస్తుతమున్న టీకా స్టాక్‌ సరిపోవడం లేదు. దీంతో తమకు కేటాయించిన షెడ్యూల్‌ ప్రకారం రెండో డోసును వేయించుకునేందుకు ప్రభుత్వ టీకా కేంద్రాలకు వస్తున్న లబ్ధిదారులకు ‘వ్యాక్సిన్లు అయిపోయాయి’ అనే సమాధానమే వినిపిస్తోంది. కొన్ని టీకా కేంద్రాల వద్ద పరిమిత సంఖ్యలో టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల 50 టోకెన్లే ఇస్తుండటంతో మిగిలిన వారికి వ్యాక్సిన్‌ అందడం లేదు. రాష్ట్రంలో టీకా వేసుకునేందుకు 2.2 కోట్ల మంది అర్హులు ఉండగా, ఇప్పటికే 1.12 కోట్ల మందికి సింగిల్‌ డోసు వేశారు. అయితే రెండో డోసు మాత్రం 33.79 లక్షల మందికే ఇచ్చారు. 


3 లక్షల మందికి అందని ‘కొవాగ్జిన్‌’

జూలైలో రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి రెండో డోసును ఇవ్వాల్సి ఉందని స్వయంగా ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు జూలై 1న మీడియాకు తెలిపారు. అయితే టీకాల కొరత కారణంగా రెండో డోసు వ్యవధిని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ పెంచింది. కొవిషీల్డ్‌ టీకా రెండో డోసు వ్యవధిని 84-112 రోజుల మధ్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించగా, దాన్ని 98-112 రోజులకు రాష్ట్ర సర్కారు పెంచింది. ఆ పద్నాలుగు రోజుల గడువు పెంపుతో టీకా రెండో డోసు కోసం వచ్చేవారి సంఖ్య తగ్గుతుందని సర్కారు భావించింది. అయితే అందుకు భిన్నంగా.. కొవిషీల్డ్‌ను ఇవ్వాల్సిన లబ్ధిదారుల సంఖ్య 22.50 లక్షల మందికి పెరిగింది. జూలై నెలలో ఈ 22.50 లక్షల మందిలో 12 లక్షల మందికే కొవిషీల్డ్‌ రెండో డోసును వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చింది. అంటే కొవిషీల్డ్‌ రెండో డోసు మరో 10.50 లక్షల మందికి ఇవ్వాల్సి ఉందన్న మాట. ఇంకో 3 లక్షల మందికి కొవాగ్జిన్‌ రెండో డోసును కూడా ఇవ్వాల్సి ఉంది. ఈనేపథ్యంలో వచ్చే ఒకటి రెండు వారాల పాటు రెండో డోసు వారికే వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఎక్కువ ప్రాధాన్యమిస్తామని డీహెచ్‌ శ్రీనివాసరావు శనివారం వెల్లడించారు.


9.50 లక్షల డోసులు అదనంగా అందినా..  

వాస్తవానికి జూలైలో రాష్ట్రానికి 30.04 లక్షల వ్యాక్సిన్‌ డోసులను కేంద్ర సర్కారు అందించింది. రాష్ట్రానికి కేటాయించిన దానికంటే 9.50లక్షల వ్యాక్సిన్‌ డోసులు అదనంగా అందాయి. అయినప్పటికీ సరైన వ్యాక్సినేషన్‌ ప్రణాళిక లేకపోవడంతో సెకండ్‌ డోసు డ్యూ ఉన్నవారందరికీ టీకా ఇవ్వలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జూలైలో అందిన 30 లక్షల డోసులను మొదటి, రెండో డోసుల వారందరికీ ఇచ్చారు. వాస్తవానికి ఆ డోసులన్నింటిని సెకండ్‌ డోసు వారికే ఇస్తే అంతమంది రెండోడోసు కోసం ఎదురుచూడాల్సి వచ్చేది కాదు. జూలైలో టీకా తీసుకోలేకపోయిన వారు, ఆగస్టులో వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన వారితో కలిపితే మొత్తం 35 లక్షల మందికి ఆగస్టులో రెండో డోసు అందాల్సి ఉంటుంది.


ఈ నెలలోనైనా అందరికీ సెకండ్‌ డోసు వేస్తేనే రెండో డోసు బాకీ ఉన్నవారంతా టీకాలు తీసుకోగలుగుతారు. ఈనేపథ్యంలో కొందరు లబ్ధిదారులు తమ వంతు వచ్చేవరకైనా ఆగకుండా టీకా దొరుకుతుందో లేదోనన్న ఆందోళనతో వ్యాక్సిన్‌ కేంద్రాలకు క్యూ కడుతున్నారని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ‘‘మాకు ముందుగా టీకాలు వేయండి. గడువు సమయం వచ్చాక సెకండ్‌ డోసు ఇచ్చినట్లు వివరాలు అప్‌లోడ్‌ చేసుకోండి’’ అని కొందరు రెండో డోసు లబ్ధిదారులు వైద్య సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.

Updated Date - 2021-08-01T09:21:53+05:30 IST