తొలిరోజు ప్రశాంతం

ABN , First Publish Date - 2021-01-17T06:09:44+05:30 IST

జిల్లా వ్యాప్తంగా శనివారం 18 కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. మొత్తం 1,3

తొలిరోజు ప్రశాంతం
శ్రీకాకుళంలో వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌




18 కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం
1,369 మందికి టీకా
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 16)

జిల్లా వ్యాప్తంగా శనివారం 18 కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. మొత్తం 1,369 మందికి తొలిరోజు వ్యాక్సిన్‌ వేశారు. కేంద్రానికి వంద మంది చొప్పున వ్యాక్సిన్‌ వేయాలని తొలుత నిర్ణయించారు. కానీ వివిధ కారణాలతో సాధ్యపడలేదు. 431 మంది గైర్హాజరయ్యారు. తొలిరోజు వ్యాక్సినేషన్‌ ప్రశాంతంగా ముగియడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌, స్పీకర్‌ తమ్మినేని సీతారాంలు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. తొలి వ్యాక్సిన్‌ను బి.ఉషారాణికి వేశారు.  టెక్కలి, పలాసలో మత్య్స, పశుసంవర్థక శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, మిగతా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ ఆన్‌లైన్‌ ప్రసంగాన్ని వీక్షించారు. శాస్త్రవేత్తలు, నిపుణుల వైజ్ఞానిక దక్షతను అభినందించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న 30 రోజుల తరువాత కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం శరీరంలో ఏర్పడుతుందన్నారు. డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ మాట్లాడుతూ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, సీఎం జగన్‌లు కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టారని చెప్పారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఇది దేశం గర్వించదగిన రోజుగా అభివర్ణించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం ముందంజలో ఉందని చెప్పడానికి వ్యాక్సిన్‌ తయారీ కార్యక్రమం గొప్ప ఉదాహరణగా పేర్కొన్నారు. కరోనా కట్టడికి దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్‌ నివాస్‌, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు, అదనపు ఎస్పీ సోమశేఖర్‌, డీఎంహెచ్‌వో చంద్రనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.   


Updated Date - 2021-01-17T06:09:44+05:30 IST