రాష్ట్రంలో తొలిరోజే మొరాయించిన ‘కొవిన్‌’

ABN , First Publish Date - 2021-01-17T08:34:30+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాల్లో కొన్నిచోట్ల కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ మొరాయించింది. తొలిరోజు 140 కేంద్రాల్లో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించగా, వాటిలో 104 చోట్ల

రాష్ట్రంలో తొలిరోజే మొరాయించిన ‘కొవిన్‌’

36 కేంద్రాల్లో పనిచేయని సాఫ్ట్‌వేర్‌

లబ్ధిదారులకు చేరని సందేశాలు

రేపటి నుంచి ర్యాండమ్‌గా ఎంపిక

104 కేంద్రాల్లోనే పనిచేసిన సాఫ్ట్‌వేర్‌


హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాల్లో కొన్నిచోట్ల కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ మొరాయించింది. తొలిరోజు 140 కేంద్రాల్లో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించగా, వాటిలో 104 చోట్ల మాత్రమే కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ పనిచేసింది. మిగిలిన కేంద్రాల్లో సమస్య వచ్చిందని వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఆ కేంద్రాల్లో మాన్యువల్‌గా లబ్ధిదారులను గుర్తించి టీకాలు వేశారు. అలాగే కొన్ని కేంద్రాల్లోని లబ్ధిదారులకు కొవిన్‌ నుంచి సందేశాలు వెళ్లలేదని అధికారులు చెప్పారు. కాగా టీకా తొలిరోజు లబిఽ్ధదారుల ఎంపిక అంతా మాన్యువల్‌గానే చేశారు. మొదటి రోజు చాలా మంది టీకాలు తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో అడిగి మరీ లబ్ధిదారులను ఎంపిక చేయడమే ఇందుకు కారణం. టీకా తీసుకుంటామన్న వారినే ఎంపిక చేసి, సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేశారు. శనివారం టీకా కార్యక్రమం విజయవంతం కావడంతో సోమవారం నుంచి లబ్ధిదారులను ర్యాండమ్‌గా ఎంపిక చేస్తామని వైద్య వర్గాలు తెలిపాయి.   


ఎమర్జెన్సీ శాఖలకు మినహాయింపు

తొలి రోజు వివిధ జిల్లాల్లోని కొన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ శాఖలను టీకాల నుంచి మినహాయించారు. ముఖ్యంగా జనరల్‌ మెడిసిన్‌, పల్మనరీ, పిడియాట్రిక్‌, అనస్థీషియా లాంటి శాఖల వారికి వ్యాక్సిన్‌ ఇవ్వలేదు. 

Updated Date - 2021-01-17T08:34:30+05:30 IST