వ్యాక్సిన్‌ డోసులు ఎక్కువ ఇవ్వండి

ABN , First Publish Date - 2021-01-17T08:52:08+05:30 IST

తెలంగాణకు కొవిడ్‌ టీకా డోసులు ఎక్కువగా అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్రాన్ని కోరారు. వ్యాక్సిన్‌ అందించే

వ్యాక్సిన్‌ డోసులు ఎక్కువ ఇవ్వండి

కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలున్నాయి

టీకా వేసుకున్నామని నిర్లక్ష్యం వద్దు: కిషన్‌రెడ్డి

కేంద్రానికి వైద్యమంత్రి ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి

వ్యాక్సిన్‌ ప్రక్రియ నిరంతరం ఉంటుందని వెల్లడి


హైదరాబాద్‌/సిటీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు కొవిడ్‌ టీకా డోసులు ఎక్కువగా అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్రాన్ని కోరారు. వ్యాక్సిన్‌ అందించే కేంద్రాలన్నింటిలోనూ కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ సరిగా పనిచేయలేదని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 140 కేంద్రాల్లో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి, 90% విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.


కేంద్రమంత్రి హర్షన్‌వర్ధన్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా వారియర్స్‌కి వ్యాక్సిన్‌ అందిస్తున్నామని, ముందుగా హెల్త్‌ వర్కర్స్‌కు ఇవ్వాలని ప్రధాని నిర్ణయించారని తెలిపారు. చాలా మంది ‘మీరు వ్యాక్సిన్‌ వేసుకోరా’ అని తనను ప్రశ్నిస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు. 50ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ వేసేటప్పుడు తానూ తీసుకుంటానని వెల్లడించారు. దేశమంతా సమష్టిగా పనిచేసి పోలియోను తరిమికొట్టినట్లే, కరోనాను కూడా తరిమికొడదామని అన్నారు.


గాంధీ ఆస్పత్రిలో..

కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అందరికి టీకా వేస్తామని మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఈటల పాల్గొని మాట్లాడారు. వ్యాక్సిన్‌ తయారీకి హైదరాబాద్‌ వేదిక కావడం శుభపరిణామన్నారు. సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్‌ను రాష్ట్రానికి సరఫరా చేస్తున్నారని చెప్పారు. తొలిరోజు సీరం సంస్థ అందించిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నాలుగు కంపెనీల నుంచి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగా, అందులో రెండు కంపెనీలు మన దేశానికి చెందినవే ఉండడం శుభపరిమాణమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆ రెండులో ఒకటి హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కావడం గర్వంగా ఉందన్నారు. టీకా వేసుకున్నామని నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచించారు. 


జిల్లాల్లోనూ వ్యాక్సిన్‌ పంపిణీ

వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. కామారెడ్డిలో ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ లోకసభాపక్ష నేత నామాతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్‌, మహబూబ్‌నగర్‌లో మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ ప్రారంభించారు.

Updated Date - 2021-01-17T08:52:08+05:30 IST