జీజీహెచ్‌ కిటకిట

ABN , First Publish Date - 2022-01-20T05:38:32+05:30 IST

శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్‌) కొవిడ్‌ బాధితులతో కిటకిటలాడుతోంది. గత ఐదు రోజుల్లో 66 మంది బాధితులు ఇక్కడ చేరారు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నప్పటికీ వీరికి చికిత్స అందజేసేందుకు వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వందలాది మంది వైద్యులు, సిబ్బంది అదనంగా అవసరమవుతారని అధికారులే చెబుతున్నారు. ఒక పక్క కేసులు పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం ఇంతవరకు చర్యలు చేపట్టలేదు.

జీజీహెచ్‌  కిటకిట
జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులు

- ఆస్పత్రిలో చేరుతున్న కొవిడ్‌ బాధితులు

- గత ఐదురోజుల్లో 66 మంది చేరిక

- వేధిస్తున్న సిబ్బంది కొరత

(గుజరాతీపేట, జనవరి 19)

శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్‌) కొవిడ్‌ బాధితులతో కిటకిటలాడుతోంది. గత ఐదు రోజుల్లో 66 మంది బాధితులు ఇక్కడ చేరారు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నప్పటికీ వీరికి చికిత్స అందజేసేందుకు వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వందలాది మంది వైద్యులు, సిబ్బంది అదనంగా అవసరమవుతారని అధికారులే చెబుతున్నారు. ఒక పక్క కేసులు పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం ఇంతవరకు చర్యలు చేపట్టలేదు. జీజీహెచ్‌లో 443 ఆక్సిజన్‌ పడకలు, 112 ఐసీయూ పడకలు ఉన్నాయి.  ప్రస్తుతం చేరినవారికి ఇప్పుడున్న వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో  చికిత్స అందజేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇంకా బాధితుల సంఖ్య పెరగనుంది. ఈస్థితిలో వందలాదిమంది ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోలు, ల్యాబ్‌టెక్నీషియన్లు, రేడియాలజిస్ట్‌లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎనస్టియాల జిస్ట్‌లు, శానిటేషన్‌ సిబ్బంది అవసరమవుతారు. కానీ, వీరిని ఇంత వరకు నియమించలేదు. దీంతో కొవిడ్‌ బాధితులను ఎక్కువగా హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందజేసేందుకు వైద్యాధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 88,940 హోం ఐసోలేషన్‌ కిట్లను సిద్ధం చేశారు. వీటిలో 22,184 కిట్ల మండలాలకు చేరవేశారు.


 ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే కొవిడ్‌ పరీక్షలు

ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రులు, ఇనిస్టిట్యూట్‌లు, ల్యాబ్‌ల్లో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బగాది జగన్నాథరావు ఒక ప్రకటనలో ఆదేశించారు. అధిక ధరలు వసూలు చేస్తే ఐపీఎంఆర్‌ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో ఆర్‌టీపీసీఆర్‌ కొవిడ్‌-19 పరీక్ష ధరను రూ.350 (అన్ని చార్జీలతో సహా) నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో స్ర్కీనింగ్‌, కన్మర్మేటరీ టెస్ట్‌లు ఉంటాయన్నారు. ప్రభుత్వం మార్పు చేసిన ధరలు అందరికీ కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. 


టెక్కలిలో వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ 

కొవిడ్‌ పరీక్షల కోసం టెక్కలి ఆస్పత్రిలో వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ను ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ తెలిపారు. బుధవారం ఆయన శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన హాస్పిటల్‌(జీజీహెచ్‌)లోని కొవిడ్‌ పరీక్ష కేంద్రాన్ని  సందర్శించారు. పరీక్షలు ఏ విధంగా చేస్తున్నారో పరిశీలించారు. టెక్కలిలోని వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ కోసం సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ ల్యాబ్‌ను సందర్శించాలని జీజీహెచ్‌ సిబ్బందిని ఆదేశించారు. టెక్కలి పరిసర మండలాల పరీక్షలను ఇక్కడే నిర్వహించాలన్నారు. శాంపిల్స్‌ పెండింగ్‌లో ఉంచవద్దని, ఫలితాలు 12 గంటల్లో వచ్చే విధంగా చూడాలన్నారు. జిల్లాలో ఇంతవరకు 60 వరకు ఒమైక్రాన్‌ కేసులు నమోదైనట్లు చెప్పారు. వేరియంట్‌ ఏదైనప్పటికీ ప్రజలు వ్యాక్సినేషన్‌, బూస్టర్‌ డోస్‌ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని చెప్పారు. ఆయన వెంట ఐటీడీఏ పీవో నవ్య ఉన్నారు. 


పడకలు సిద్ధం చేయాలి : జేసీ శ్రీనివాసులు

కలెక్టరేట్‌,  జనవరి 19: కరోనా కేసుల నేపథ్యంలో ఆస్పత్రుల్లో పడకలను సిద్ధం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కె.శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో నోడల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పడకలకు ఆక్సిజన్‌ సరఫరా ఉండాలన్నారు. ఆస్పత్రుల వారీగా పడకల సంఖ్యను తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ ఆర్‌.శ్రీరాములునాయుడు, నోడల్‌ అధికారులు,  ఆస్పత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. 


 పొందూరు పోలీస్‌స్టేషన్‌లో ఏడుగురికి కరోనా 

పొందూరు : పొందూరు పోలీస్‌స్టేషన్‌లో కరోనా కలకలం రేగింది. ఏడుగురి సిబ్బందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. స్టేషన్‌లో 20 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇటీవల ఒకరికి కరోనా సోకగా.. మిగిలిన సిబ్బంది కొవిడ్‌ పరీక్షలు చేసుకున్నారు. దీంతో బుధవారం మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఉన్న సిబ్బందితోనే  విధులు నిర్వహిస్తున్నారు. స్టేషన్‌కు వచ్చేవారి విషయంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు.

Updated Date - 2022-01-20T05:38:32+05:30 IST