వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న ప్రస్టేషన్‌తో పిచ్చి పీక్‌స్టేజ్‌లోకి..అత్తమీది కోపం దుత్తమీద చూపడం అంటే ఇదేనేమో..!

ABN , First Publish Date - 2021-12-02T17:38:20+05:30 IST

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన కోపం నషాళానికి అంటుకుంటోంది. ఆయనగారి నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాల జోరుకు ఈ మధ్య వచ్చిన వరదల్లో పెన్నా నదికే గండ్లు పడ్డాయి. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక

వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న ప్రస్టేషన్‌తో పిచ్చి పీక్‌స్టేజ్‌లోకి..అత్తమీది కోపం దుత్తమీద చూపడం అంటే ఇదేనేమో..!

అత్తమీది కోపం  దుత్తమీద చూపడం అంటే ఇదేనేమో..ఆయనలో రోజు రోజుకి పెరిగిపోతున్న ప్రస్టేషన్‌కు అధికారులు, నాయకులు హడలిపోతున్నారు. పిచ్చి పీక్‌స్టేజ్‌లోకి వెళ్లినట్లు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను కూడా సదరునేత టార్గెట్‌ చేస్తూ టార్చర్‌ చేస్తున్నాడనే టాక్‌ వస్తోంది.  ఇంతలా ఆయనగారిలో కోపం రగిలిపోయేందుకు కారణం.. కోరుకున్న పదవి దక్కకపోవడమేననే గుసగుసలు వినిపిస్తున్నాయి.సొంత పార్టీ నేతలను కూడా తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిన చరిత్ర కూడా ఆయన సొంతమనే ఇన్‌సైడ్‌ టాక్ రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇంతకీ ఆయనలో అంతలా ప్రస్టేషన్‌ కలిగించిన అంశాలేంటి? అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


జనం తరిమికొట్టడంతో కారులో తుర్రుమన్నారు 

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన కోపం నషాళానికి అంటుకుంటోంది. ఆయనగారి నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాల జోరుకు ఈ మధ్య వచ్చిన వరదల్లో పెన్నా నదికే గండ్లు పడ్డాయి. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక వరదల సమయంలో జనం అవస్థలు పడ్డారు. ఆకలైనపుడు అన్నం పెట్టని నేతలు ఫొటోలకు ఫోజులిచ్చేందుకు రావడంతో స్టౌబీడీ కాలనీ జనం కన్నెర్ర జేసి తరిమితరిమి కొట్టారు. ఎమ్మెల్యే ప్రసన్న, ఇన్‌ఛార్జ్ మంత్రి బాలినేని, కలెక్టర్‌ చక్రదర్‌ ప్రజా నిరసనను తట్టుకోలేక కారులో తుర్రుమన్నారు. 


ఎమ్మెల్యే ప్రసన్న జర్నలిస్టులపై రెచ్చిపోవడం వెనకున్న రహస్యం? 

కోవూరు ప్రజాగ్రహాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి విలేకర్లపై మండిపడ్డారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌ రెడ్డి. తను తలుచుకుంటే కోవూరులో బతికిబట్టకట్టలేరని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై ఆగ్రహాన్ని వెళ్లగక్కి అంతుచూస్తామని బెదిరించారు. జర్నలిస్టులపై నోరుపారేసుకోవడమే కాదు డౌన్‌డౌన్‌ అని నినదించి సర్కార్‌ తీరును ప్రశ్నించిన పాపానికి ప్రజలపై కేసులు నమోదుచేయించారనే విమర్శలు వస్తున్నాయి.   విలేకర్లపై, స్థానికులపై శాసనసభ్యుడి చిందులుచూసిన సొంతపార్టీ నేతలు, కార్యకర్తలు సార్‌ కోపం వెనుకున్న రహస్యం ఏంటో తెలుసంటూ గుసగుసలాడుకున్నారు. వైసీపీ జమానాలో తిట్టుతిట్లేవారికి, బెదిరింపులు దిగేవారికే  మంత్రి పదవులు వస్తాయని..జగన్‌ దగ్గర మార్కులేసుకునేందుకే మనోడు జర్నలిస్టులను మాటలతో కడిగిపారేస్తున్నాడని ఇన్‌సైడ్‌ టాక్ వచ్చింది. 


ప్రసన్న తీరు అందితే జుట్టు అందకుంటే కాళ్లు!

మాజీ మంత్రిగారి నోటి దురుసు, చేతలు గుర్తుచేసుకుంటున్న జనం.. సార్‌ తీరు అందితే జుట్టు అందకుంటే కాళ్లు అన్నట్లుగా ఉండటం కామన్‌ అంటున్నారు.ఇటీవల కాలంలో ప్రసన్న తిట్టే వారి సంఖ్య బాగా ఎక్కువైంది. ఎవరినంటే వారిని తెగ తిట్టేస్తున్నారు. అందుకే... వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ నుంచి జారుకుంటున్నారు. ఇంతగా ఆయనలో ప్రస్టేషన్ ఎందుకు పెరిగిపోతుందని అంటే... ఇంకేముంది... మంత్రి పదవి రాకపోవడమనే ఇన్‌సైడ్ టాక్‌ వస్తోంది. మంత్రి పదవి వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కనపడకపోవడంతో... ప్రస్టేషన్ బాగా పెరిగిపోయిందని... అందుకే ఎవర్నంటే వారిని అన్నేసి మాటలు అంటున్నారని సొంత పార్టీలోనే చర్చలు సాగుతున్నాయి. వైసీపీలో విజయమ్మకంటే తనే సీనియర్‌నని.. కానీ మంత్రి పదవి దక్కలేదని రగిలిపోతున్నారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. విజయమ్మపై శాసనసభలోనే బొత్సా, ఆనం ఆరోపణలు చేశారని  అయినా సత్తిబాబుకి మంత్రి పదవి ఇచ్చారంటూ రగిలిపోతున్నారట ప్రసన్నకుమార్‌రెడ్డి. 


అప్పట్లో ఆదరించిన చంద్రబాబుపై ప్రసన్న విమర్శలు.. వైఎస్‌ను, జగన్‌ను రాయలసీమ రౌడీలు అన్నదీ ప్రసన్ననే

తండ్రి శ్రీనివాసులురెడ్డి తదనంతర వారసత్వ రాజకీయాల్లోకి వచ్చిన ప్రసన్నకుమార్‌రెడ్డిని తొలుత ఆదరించింది తెలుగుదేశం. అప్పట్లో ఎమ్మెల్యేగా గెలిపించింది చంద్రబాబేనని అలాంటి ఆయన్నే పలుమార్లు తిట్టిపోసిన చరిత్ర ప్రసన్నది అంటారు లోకల్ జనం. వైఎస్‌ను, జగన్‌ను రాయలసీమ రౌడీలనీ విమర్శించిందీ ప్రసన్నే కదా అంటారు పబ్లిక్. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిపై విమర్శలు చేసి ఆశీర్వాదం తీసుకుందీ ప్రసన్నే అని గత చరిత్రను గుర్తుచేస్తుంటారు ఓటర్లు. సోమిరెడ్డి, ఆనమోళ్లు..ఇలా ఎవరినైనా మాట అనేయడం విమర్శలు చేయడం ప్రసన్నకు లెక్కేలేదంటారు పబ్లిక్‌. ఇటీవల కోటలో వైసీపీ నేతలపై అవినీతి ఆరోపణలు చేసింది ప్రసన్న అని రగిలిపోతుంటారు ఫ్యాన్‌ ఫార్టీ నేతలు .గతంలో ఎస్పీపై తీవ్ర విమర్శలు చేసి.. పీఎస్‌ ఎదుట ధర్నా చేసి ఆ మరుసటి రోజునే ఎస్పీకి పుష్పగుచ్చం ఇచ్చారు. ఇలా మాటమీద నిలకడలేకుండా అందితే జుట్టు అందకుంటే కాళ్లు అనేలా ప్రసన్నకుమార్‌ రెడ్డి ప్రవర్తిస్తుంటారనే టాక్‌ జిల్లాలో రోజురోజుకి ఎక్కువైపోతోంది. 


ఆరుసార్లు ఎమ్మెల్యే... ఒకసారి మంత్రిగా ఉన్న ప్రసన్న... ఇలా వ్యవహారించడం సరికాదనే విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నించిన జనంపైనా కేసులు బనాయిస్తే ప్రజాస్వామ్యానికి అర్ధమేముంటుంది?... అయినా ఇలా తిట్లు పురాణాలతో మంత్రి పదవి పొందాలనుకోవడం దారుణం... ఇచ్చేవారిదీ అవివేకమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Updated Date - 2021-12-02T17:38:20+05:30 IST