నేపాల్ ప్రధాని ఓలీ మానసిక దివాలాకోరుతనం బయటపడింది : ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2020-07-14T20:30:33+05:30 IST

శ్రీరాముని జన్మ స్థలం, జాతీయత విషయంలో నేపాల్ ప్రధాన మంత్రి

నేపాల్ ప్రధాని ఓలీ మానసిక దివాలాకోరుతనం బయటపడింది : ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ : శ్రీరాముని జన్మ స్థలం, జాతీయత విషయంలో నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ చేసిన వ్యాఖ్యలను ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తప్పుబట్టారు. ఓలీ తన మానసిక దివాలాకోరుతనాన్ని బయటపెట్టుకున్నారని దుయ్యబట్టారు. 


మౌర్య మంగళవారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ‘‘మర్యాదా పురుషోత్తముడు ప్రభు శ్రీరాముని జన్మ స్థలం గురించి నేపాల్‌కు చెందిన కమ్యూనిస్టు ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆయన మానసిక దివాలాకోరుతనాన్ని చూపుతోంది’’ అని పేర్కొన్నారు. 


‘‘నేపాల్ గతంలో ఆర్యావర్తం (భారత దేశం)లో భాగమేనని ఓలీ తెలుసుకోవాలి’’ అని మౌర్య పేర్కొన్నారు. 


నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ తన సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. భారత దేశానికి చెందిన లిపియధుర, లిపులేఖ్, కాలాపానీలను తమవిగా చెప్పుకుంటూ కొత్తగా ఓ నేపాలీ రాజకీయ మ్యాప్‌ను ఓలీ ప్రభుత్వం ఆమోదించింది. దీనిపై భారత దేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా ఓలీ మరో వివాదాన్ని సోమవారం సృష్టించారు. శ్రీరాముని జన్మ భూమి అయోధ్య నేపాల్‌లో ఉందని, శ్రీరాముడు నేపాలీ అని పేర్కొన్నారు. 


ఖాట్మండులోని తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఓలీ మాట్లాడుతూ, ‘‘పశ్చిమ బీర్‌గుంజ్‌లోని థోరీ పట్టణం వద్ద నిజమైన అయోధ్య ఉన్నప్పటికీ, భారత దేశం మాత్రం శ్రీరాముడు అక్కడ జన్మించాడని చెప్తోంది. నిరంతరం ఇలా చెప్పడం వల్ల మనం కూడా సీతా దేవిని భారత దేశంలోని యువరాజు రామునికి ఇచ్చి వివాహం చేశారని మనం కూడా నమ్ముతున్నాం. అయితే నిజానికి అయోధ్య బీర్గుంజ్‌కు పశ్చిమంలో ఉన్న ఓ గ్రామం’’ అని పేర్కొన్నారు. 


భారత దేశం నకిలీ అయోధ్యను సృష్టించడం ద్వారా సాంస్కృతిక దురాక్రమణకు పాల్పడిందని ఓలీ ఆరోపించారు. సీతాదేవిని వివాహం చేసుకోవడానికి శ్రీరాముడు ప్రస్తుతం భారత దేశంలోని అయోధ్య నుంచి ఎలా రాగలిగాడని ప్రశ్నించారు. అప్పట్లో సరైన కమ్యూనికేషన్ల వ్యవస్థ లేదన్నారు. ప్రస్తుత భారత దేశంలోని అయోధ్య నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్‌కు శ్రీరాముడు రావడం అసాధ్యమన్నారు. 


‘‘జనక్‌పూర్ ఇక్కడ ఉంది, అయోధ్య అక్కడ ఉంది, పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. ఓ టెలిఫోన్ లేదు, ఓ మొబైల్ లేదు అలాంటపుడు ఆయన జనక్‌పూర్ గురించి ఎలా తెలుసుకున్నాడు?’’ అని ఓలీ ప్రశ్నించారు.


Updated Date - 2020-07-14T20:30:33+05:30 IST