ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం 'క్రాక్' బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఆహా మాధ్యమంలో జనవరి 29న విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే సినిమాకు ఇంకా మంచి కలెక్షన్స్ వస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలను, ఆహా మాధ్యమానికి సంబంధించి నిర్మాత అల్లు అరవింద్‌ను రిక్వెస్ట్ చేశారు. పరిస్థితిని అర్థం చేసుకున్న అల్లు అరవింద్ క్రాక్‌ను మరో వారం పాటు వాయిదా వేసి ఫిబ్రవరి 5న విడుదల చేయడానికి అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డాన్‌శీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన క్రాక్ హ్యాట్రిక్ హిట్ మూవీగా నిలిచింది.